*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *మీరు “వేడుకుంటే చాలు మాధవుడు ఆదుకుంటాడు”. భగవంతుణ్ని చూసే, చేరే, తెలుసుకునే, అవగాహన చేసుకునే మార్గాలను చూపుతుంది శ్రీమద్భాగవతం.*
💖 *సంపూర్ణ శరణాగతి, వేడుకోలుల ప్రాధాన్యతనీ, శక్తినీ ఎరుక పరుస్తుంది భాగవతం. పోతన ప్రార్థనాపూర్వకంగా చేసిన వేడుకోలుతో భక్తి పారవశ్య విధానం ఆరంభమై భాగవతం యావత్తూ అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది.*
❤️ *’కాటుక కంటి నీరు...’ అనే పద్యంలో సరస్వతీ దేవిని వేడుకుంటూ ‘అమ్మా! నేను అనువదించే ఈ కావ్యాన్ని సామాన్యులకు అంకితమివ్వను’ అని మాటఇచ్చాడు. తన భాగవత అనువాదానికి ఆ అమ్మను అండగా ఉండమని అడిగాడు. ‘శ్రీకైవల్య పదంబు...’ అనే పద్యంలో అదే హామీని మళ్ళీ విష్ణువుకు ఇచ్చాడు.*
💓 *‘భాగవతాన్ని ఆంధ్రీకరించి రాజులు జమీందారులు వంటి వాళ్లిచ్చే బహుమానాలతో జీవించాలనే తాపత్రయం నాకు లేదు’ అని చెబుతూ తన రచన సాఫీగా సాగేలా చేయమని శ్రీహరిని వేడుకున్నాడు.*
💕 *వేడుకోవడమెలాగో, దాని ప్రభావమెలాంటిదో అనుభవ పూర్వకంగా తెలిసినవాడు కనుకనే ఆయన వేడుకోలులో పలురకాలున్నాయని, ఎవరి స్థాయినీ, స్థితినీ బట్టి వారు త్రికరణశుద్ధితో వేడుకుంటే ముక్తి కలుగుతుందని భాగవతం ద్వారా సామాన్యులక్కూడా అర్ధమయ్యేలా అనేక కథలు ద్వారా తెలియజేశారాయన.*
💞 *శరణాగతి, ప్రార్థన లాంటి నవవిధ భక్తిమార్గాల ద్వారా వేడుకోవడాన్ని భాగవతంలో విస్తృతపరిచాడు పోతన. ప్రథమ స్కంధంలోని అశ్వత్థామ గర్వపరిహారఘట్టంలో ఉత్తర గర్భరక్షణకోసం చేసిన వేడుకోలు, శుకుణ్ని పరీక్షిత్తు మోక్షమార్గం కోరే ఘట్టం, తృతీయ స్కంధంలో దితి, కశ్యప సంవాద ఘట్టంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ద్వేషంతో స్మరణ లాంటివి ప్రార్థనాపూర్వకమైనవి. యశోద వేడుకోలు ఆప్యాయతా భక్తికి అద్దంపడుతుంది.*
💓 *’మన ఇంట్లో పాలు, పెరుగులకేమి కొరత? ఇతరుల ఇళ్ళలో వాటిని దొంగిలించి నలుగురినోట్లో పడవద్దు’ అని మందలిస్తుంది యశోద. ఆ మందలింపూ వేడుకోలే మరీ…!*
💖 *రుక్మిణీదేవి వేడుకున్నతీరు, ప్రేమ, ఆత్మీయతా భక్తికి నిదర్శనం. ‘నీయందు నా మనసు ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచి ఉండేటట్లు చూడు’ అని కృష్ణుణ్ని కోరుకుంది రుక్మిణి. సుదాముడి భక్తికి మెచ్చి “ఏదైనా వరం కోరుకో” అన్నాడు కృష్ణుడు. సుదాముడప్పుడు “నిరంతరం నీ పాదపద్మాల సేవ చేసుకునే భాగ్యం, అలాంటి సేవకులతోటి స్నేహం, ఎప్పటికీ తరిగిపోని భూతదయ నాకు ప్రసాదించు”అని వేడుకున్నాడు. ప్రేమానురాగపు వేడుకోలిది.*
💓 *ప్రేమతో కూడిన ఆప్యాయతానురాగాలు గోపికల వేడుకోలులో ప్రస్ఫుటమౌతాయి. నిరహంకారానికి దర్పణం గజేంద్రుడి వేడుకోలు.* *“లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్* *శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!” అని వేడుకున్నాడు.*
💖 *”ధృవోపాఖ్యానం” లో ధ్రువుడి వేడుకోలు ‘నిర్వికల్ప స్థితి’కి ఉదాహరణ. ధ్రువుడి తపస్సువల్ల ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితిని గమనించి విషయం తెలుసుకోవడానికి శ్రీమహావిష్ణువే స్వయంగా ఆ బాలుడి దగ్గరకి వెళ్ళగా ధ్రువుడికాయన దర్శనం వలన కలిగిన భక్తి పారవశ్యం స్తోత్రం మొదలుపెట్టేలా చేసింది. ‘ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయం పొందకుండా చివరిశ్వాసలోనూ నిన్నే తలచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్న మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వాళ్ళు నీలో ఐక్యమైపోతున్నారు. అలాంటివారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు.*
💞 *’వేడుకోవడం’ అనే ఏకైక భక్తిభావంతో సర్వాంతర్యామి కృపకు పాత్రులై ఆయనలోనే ఐక్యమైనవారి స్మరణతో మన ఈ ప్రభాతం “సుప్రభాతం”గా మన భాగ్యంగా భాసిల్లుతోంది.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment