ఆ గుడిలో దేవుడు లేడు
- రవీంద్రనాథ్ ఠాగూర్
'ఆ గుడిలో దేవుడు లేడు' సాధువు ప్రకటించాడు
రాజు కోపంతో మండిపడ్డాడు.
'దేవుడు లేడా ? ఏమంటున్నావు, నాస్తికునిలాగా మాట్లాడుతున్నావా?'
రత్నఖచిత సింహాసనం మీద ధగధగ మెరిసే బంగారు విగ్రహం కనిపిస్తున్నా, కళ్ళముందు ఏమీ లేదంటావా?
ఏమీలేదనడం లేదు. రాజరికపు అహంకారం నిండిపోయిందక్కడ
రాజా, నిన్ను నీవే ప్రతిష్టించుకున్నావక్కడ, ఈ లోకపు దేవుణ్ణి కాదు.
సాధువు సమాధానమిచ్చాడు
రాజు భృకుటి ముడిచాడు, 'ఆకాశాన్ని తాకే మహా హర్మ్యం పైన
ఇరవై లక్షల బంగారు నాణేలను వెదజల్లాను
పూజలు అన్నీ చేసి దేవుడికి అర్పించాను
అయినా మహా ఆలయంలో దేవుడు లేడని
అంటావా, ఎంత ధైర్యం నీకు?'
సాధువు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు
‘ఇదే సంవత్సరం ఇరవై లక్షల మంది జనం నీ రాజ్యంలో కరువు వాతబడ్డారు
గూడులేక, తిండి లేక నిరుపేద జనం
సహాయం కోసం నిన్ను శరణు కోరుకుంటే
నువ్వు వాళ్ళని తరిమివేశావు
దిక్కులేని జనం
అడవులలో, గుహలలో, వీధులలో చెట్లకింద,
శిథిలమైన దేవాలయాల్లో తలదాచుకున్నారు
అదే సంవత్సరం నువ్వు ఇరవై లక్షల బంగారు నాణేలు వెచ్చించి
నువ్వు నీ గుడిని నిర్మించావు’
ఆ రోజే దేవుడు ప్రకటించాడు
'నా శాశ్వత నివాసం
వినీలాకాశపు నక్షత్రాలతో నిత్యం ప్రకాశిస్తుంది
సత్యం, శాంతి, కరుణ, ప్రేమ
విలువలే నా నివాసానికి పునాదులు
దిక్కులేని దీనులకు గూడు కల్పించలేని
పరమ లోభి నాకు గుడి కట్టించగలడా?
'ఆ రోజే దేవుడు నీ గుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు
వీధులలో, చెట్ల కింద తలదాచుకున్న
పేదలలో కలిసిపోయాడు
ఇప్పుడు నీ గుడి
మహాసముద్రాలలో తేలే నురగలాంటిది
అహంకారం, ధన మదం నిండిన గాలి బుడగ నీ గుడి’
రాజు ఆగ్రహంతో కేకలు పెట్టాడు
‘పనికిమాలిన మూర్ఖుడా
నా రాజ్యం నుండి వెంటనే వెళ్ళిపో, నిన్ను బహిష్కరిస్తున్నాను’
సాధువు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు
'దేవుడినే వెళ్ళగొట్టిన నీ రాజ్యం నుండి
భక్తుడిని కూడా తరిమివేయి'
(123 సంవత్సరాల క్రితం, ఆగస్టు 1900 లో కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'దీనో దాన్' ( దీనులకు దానం) కవిత నుంచి. మెయిన్ స్ట్రీమ్ పత్రిక 2020 ఆగస్టు 8 నాటి సంచికలో ఈ కవితనీ, సందీప్త దాస్ గుప్తా ఆంగ్లానువాదాన్నీ ప్రచురించింది)
తెలుగు అనువాదం: ఎస్ కె
No comments:
Post a Comment