*వయసు రావడం కాదు పోవడమే అనే సత్యాన్ని గుర్తించండి*
ప్రతి ఏడాదీ పుట్టినరోజున సంబరపడి, వేడుక జరుపుకోవడం మనిషికి అలవాటు. పుట్టిన రోజున దీపాలు ఆర్పేవాళ్లు కొందరైతే, దీపాలు వెలిగించేవాళ్లు కొందరు!
దీపాలు ఆర్పేవారు క్రమంగా ఆయువు ఆరిపోతోందని, ఈ సత్యాన్ని గ్రహించాల్సిందిగా హెచ్చరిక చేస్తున్నారనిపిస్తుంది.
దీపాలు వెలి గించేవారు ఇకనైనా మేల్కొని శేష జీవితాన్ని సార్థకం చేసుకొమ్మని ప్రబోధిస్తున్నట్లు అనిపిస్తుంది.
మనిషి జనన మరణాలు అతడి అధీనంలో ఉండవు. పుట్టిన ఏ వ్యక్తి లేదా ప్రాణి అయినా ఎంతకాలం బతుకుతారో, ఎప్పుడు తనువు చాలిస్తారో ఎవరికీ తెలియదు.
నూరేళ్లు బతుకుతారని ఆశించినవారు అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోవడం, చావునోట్లో తలపెట్టినవారు బతికి నూరేళ్లు జీవించడం లోకంలో అందరూ చూస్తున్నదే.
ఆరోగ్యంగా ఉన్నవాడు చావడనే నమ్మకం లేదు. రోగగ్రస్తుడు బతికినా ఆశ్చర్యం లేదు. కనుక మరణం ఎవరికీ అంతుపట్టని బ్రహ్మపదార్థం.
ఎవరికీ అందనంత ఎత్తులో ఆకాశంలో విహరిస్తాయి పక్షులు. అయినా వాటికీ మరణం తప్పదు.
ఉన్నచోటు సురక్షితమా అరక్షితమా అనే విచక్షణ మరణానికి ఉండదు. ఎన్నో భోగాలను అనుభవిస్తూ సింహాసనంపై కూర్చొన్న రాజుకు కూడా అకాల మృత్యువు సంభవించవచ్చు.
ఏ రక్షణా లేని పూరి గుడిసెల్లో ఎన్నో అపాయాల మధ్యన నివసించే నిరుపేదలు దీర్ఘకాలం బతకవచ్చు. మరణానికి ఏదీ ప్రతిబంధకం కాదు.
వివేకవంతుడైన మనిషి తనకు ఎప్పటికైనా మరణం తప్పదనే సత్యాన్ని జీర్ణించుకోవాలి.
బతికినంతకాలం మంచిపనులు చేసి, ఇతరులకు తోడ్పడాలి. భగవంతుడు ఇచ్చిన మానవజన్మను సార్థకం చేసుకోవడానికి కృషి చేయాలి.
చచ్చిన తరవాతా అందరూ స్మరించే విధంగా కీర్తిని నిలుపుకోవాలి.
వయసు రావడం కాదు, క్రమంగా తగ్గిపోవడమే అనే వాస్తవాన్ని గ్రహించి, ఆదర్శమయమైన జీవితాన్ని గడపాలి.
అప్పుడే మనిషి పుట్టినందుకు సార్థకత!
No comments:
Post a Comment