Thursday, June 18, 2026

 నీటి తత్త్వం 

మానవ శరీరం నీటి కుండ. దాదాపు డెబ్బై శాతం మానవ శరీరం నీటిమయం. పంచభూతాల ఆవిర్భావ క్రమంలో ఆఖరిది భూమి అయితే, అగ్ని తరువాత, భూమికి ముందు ఆవిర్భవించింది నీరు. అయినప్పటికీ ఈ రెండింటికంటే మన శరీరంలో ఎక్కువ భాగం నీటిదే.

దేహంలో జరిగే సకల జీవన చర్యలకూ నీరు అత్యంత ఆవశ్యం. నీరు ప్రకృతిలో అత్యంత సాధారణమైనదైనా, గొప్ప ఆధ్యాత్మిక గురువు. మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే నీటిని పరిశీలిస్తే చాలు. నీరు మనకు కేవలం దాహాన్ని తీర్చే ద్రవం మాత్రమే కాదు; జీవితం ఎలా జీవించాలో నేర్పించే గురు పదార్ధం.

నీరు సాగిపోతూ ఉండాలి. ఆగిపోకూడదు. ప్రవహించే నీరు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ఒకచోట నిలిచిపోయిన నీరు క్రమంగా కలుషితమై దుర్గంధభరితమవుతుంది. మన జీవితమూ అంతే. స్తబ్దతకు గురికాకుండా నిరంతరం ముందుకు సాగితేనే నిత్యనూతనత్వాన్ని అనుభవించగలం. నేర్చుకోవడం, ఎదగడం, మార్పును స్వీకరించడం ఆగిపోయినప్పుడు జీవితం కూడా నిలిచిన నీటి మడుగుగా మారుతుంది.

అందుకే ఒక గ్రీకు తత్వవేత్త  “ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయలేము” అని అన్నాడు..కారణం, నిత్యం ప్రవహించే నదిలో ఒకసారి మునిగి లేచే సరికి ముందు మనల్ని తాకిన నీరు ముందుకు సాగిపోతుంది. రెండోసారి మునిగే సమయానికి కొత్త నీరు వచ్చి చేరుతుంది. నది అదే అయినా, నీరు మాత్రం అది కాదు. అదేవిధంగా మనిషి జీవితం కూడా ప్రతి క్షణం మార్పులోనే ఉంటుంది. నిన్నటి మనం ఈరోజు ఉండము; ఈరోజు ఉన్న మనం రేపు ఉండము. శరీరం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, అనుభవాలు పెరుగుతాయి. మార్పును అంగీకరించినవాడు జీవితం యొక్క ప్రవాహంతో కలిసి సాగగలుగుతాడు; మార్పును ప్రతిఘటించినవాడు బాధను ఆహ్వానించుకుంటాడు.

నీరు దారిలో రాళ్లు ఎదురైనా, కొండలు అడ్డొచ్చినా వాటితో పోరాడదు. వాటిని చుట్టుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కానీ తన గమ్యాన్ని మాత్రం మరచిపోదు. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు, అడ్డంకులు సహజం. వాటితో యుద్ధం చేస్తూ జీవిత గమ్యాన్ని మరచిపోకూడదు. తప్పని సరి అయితే తాత్కాలికంగా మార్గాన్ని మార్చుకోవచ్చు; కానీ అంతిమ లక్ష్యాన్ని వదలకూడదు. నీరు మనకు నేర్పే పాఠం ఇదే — సహకరించు, కానీ లొంగిపోకు; మార్గం మార్చుకో, కానీ గమ్యం మర్చిపోకు. 

నీరు వినయానికి ప్రతీక. నీటికి పుట్టిలు సముద్రం. ఎత్తైన పర్వతాలలో ప్రారంభమయిన ప్రతి నీటి పాయ జలపాతమై క్రిందికి ప్రవహిస్తుంది. జలపాతాలు నదులుగా మారి,  నదులన్నీ చివరికి సముద్రంలో కలుస్తాయి. ఎందుకంటే సముద్రం అన్నిటికంటే దిగువన ఉంటుంది. అందుకే అది అన్నింటినీ స్వీకరించగలుగుతుంది. వినయం ఉన్న వ్యక్తి కూడా సముద్రంలా అందరినీ అక్కున చేర్చుకోగలడు. అహంకారం శిఖరంలా ఒంటరిగా నిలబడితే, వినయం సముద్రంలా విశాలంగా విస్తరిస్తుంది.

నీరు ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని స్వీకరిస్తుంది. గిన్నెలో పోస్తే గిన్నె ఆకారం, నదిలో ఉంటే నది ఆకారం, మేఘంగా మారితే ఆకాశాన్ని అలంకరిస్తుంది. కానీ తన రూపాన్ని మాత్రం కోల్పోదు. అలాగే మనిషి కూడా , పరిస్థితులనుగుణంగా మారటంలో తప్పు లేదు. కానీ తన విలువలను, ధర్మాన్ని, అంతరంగ స్వచ్ఛతను కోల్పోకూడదు. అనుకూలత అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు;  పరిస్థితులకు తగిన విధంగా వ్యక్తీకరించడం.

నీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. కలుషితమైతే ఏదీ స్పష్టంగా కనిపించదు. మన మనస్సు కూడా అంతే. కోపం, ద్వేషం, అసూయ, అహంకారం వంటి మలినాలతో నిండినప్పుడు సత్యం కనిపించదు. మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్నప్పుడే జీవితం యొక్క నిజస్వరూపం ప్రతిబింబిస్తుంది. అందుకే మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం ఆధ్యాత్మిక సాధనలో అత్యంత ముఖ్యమైనది.

నీరు ఆవిరై మేఘమై పైకి ఎగురుతుంది. తరువాత వర్షమై తిరిగి భూమికి వస్తుంది. ఈ చక్రం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో ఎదగడం అంటే ఇతరుల నుండి దూరం కావడం కాదు. ఎంత ఎత్తుకు ఎదిగితే తిరిగి సమాజానికి అంత ఎక్కువగా ఉపయోగపడాలి. మేఘం వర్షంగా మారి భూమిని సస్యశ్యామలం చేసినట్లే, మన జ్ఞానం, సంపద, అనుభవం, శక్తి ఇతరుల సంక్షేమానికి ఉపయోగపడాలి. నిజమైన ఎదుగుదల అనేది పంచుకోవడంలోనే ఉంటుంది.

ఆధ్యాత్మిక దృష్టిలో నీరు మరింత గొప్పది. దానికి తనకు తాను ఏ రంగు లేదు, ఏ రూపం లేదు. కానీ దేనితో కలిసినా దానికి అనుగుణంగా కనిపిస్తుంది. ఆత్మ కూడా అలాగే నిరాకారమైనది, నిర్మలమైనది. దేహాలు మారుతాయి, పేర్లు మారుతాయి, హోదాలు మారుతాయి; కానీ ఆత్మ స్వరూపం మారదు. నీటి బిందువు సముద్రంలో కలిసినప్పుడు తన ప్రత్యేకతను కోల్పోయి సముద్రమవుతుంది. అలాగే జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు ద్వైత భావం అంతమై అద్వైత సత్యం అనుభవమవుతుంది.

ఆచార్య డా అనిల్ ప్రసాద్

No comments:

Post a Comment