Thursday, June 18, 2026

 సేవ – మార్గమా? గమ్యమా?  సాధనమా? సాధ్యమా?

ఈ మధ్య,  సమాజ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన అనేక మందిని కలిసే అవకాశం కలిగింది.

ఒకరు పర్యావరణ పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరొకరు ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ, తాము ఆచరిస్తూ చూపిస్తున్నారు. ఇంకొకరు యువతలో మానవతా విలువలను పెంపొందించేందుకు తమ సమయాన్ని, శక్తిని వినియోగించడానికి సమయాత్తమవుతున్నారు. మరికొందరు సహజ జీవన విధానాలను ప్రచారం చేస్తూ ప్రజల శారీరక, మానసిక శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు.

వీరందరిలో  కనిపించే లక్షణం ఒక్కటే—సేవా తత్త్వం. స్వార్థాన్ని కొంత పక్కన పెట్టి, పరుల శ్రేయస్సు కోసం జీవించే మనస్తత్వం. “మానవ సేవే మాధవ సేవ” గా సేవను దైవారాధనగా భావించి జీవించే తత్వం.

ఇదే సమయంలో, మరికొందరిని కలిసాను. వారి మార్గం సమాజ సేవ కాదు; ఆధ్యాత్మిక ప్రచారం.

కొంతమంది ధ్యానాన్ని బోధిస్తున్నారు. మరికొందరు భక్తినే జీవిత పరమార్థంగా భావించి భక్తి సమాజాలను నిర్మిస్తున్నారు. ఇంకొందరు ఒక గురువును ఆశ్రయించి, ఆయన బోధనలను ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు తమకు నచ్చిన ధర్మాన్ని కాపాడటమే జీవిత లక్ష్యంగా భావిస్తున్నారు.

వీరిలోనూ ఒకే తత్త్వం కనిపిస్తుంది—ఆధ్యాత్మిక తత్త్వం. పరమసత్యాన్ని చేరుకోవడానికి భిన్న మార్గాలను అనుసరిస్తూ, అంతర్ముఖ ప్రయాణం చేసే ప్రయత్నం.

నిజానికి మార్గాలు అనేకం. గమ్యం మాత్రం ఒక్కటే.
ఆ గమ్యం పేరు ఆత్మ సాక్షాత్కారం. అదే మోక్షం. అదే జనన–మరణ చక్రం నుంచి విముక్తి. జన్మరాహిత్య స్థితి.

సేవా మార్గమైనా, భక్తి మార్గమైనా, ధ్యాన మార్గమైనా, యోగ మార్గమైనా—ఏ మార్గాన్ని ఎంచుకున్నా, ఆ అంతిమ లక్ష్యాన్ని మనసులో నిలుపుకొని ప్రయాణిస్తే అది సాధకుణ్ణి గమ్యానికి చేరుస్తుంది. అయితే పుణ్యం సంపాదించాలనే కోరికతో, స్వర్గసుఖాల ఆశతో, లేదా మరో మంచి జన్మ కోసం మాత్రమే ఈ కార్యక్రమాలను చేస్తే, శ్రమ ఎక్కువగా ఉండవచ్చు; కానీ ఆధ్యాత్మిక లాభం పరిమితంగానే ఉంటుంది.

అద్వైత వేదాంత దృష్టితో చూస్తే ఆత్మ జ్ఞానానికి సేవ, పూజ ,యాత్రలూ,కర్మలూ, ప్రాధమిక సహాయకారులు మాత్రమే. అంతిమ అవసరాలు కావు.   ఆత్మసాక్షాత్కారానికి మూలం ఒక్కటే—“అహం బ్రహ్మాస్మి” అనే ప్రత్యక్ష అనుభవం. “నేను ఈ దేహం కాదు, మనస్సు కాదు; నేనే బ్రహ్మస్వరూపుడిని” అనే సజీవ అనుభూతి.

ఆ భావన మనలో స్థిరపడేందుకు ఏ సాధన ఉపకరిస్తుందో, అదే మనకు సరైన మార్గం. ఎవరితో సాంగత్యం చేస్తే ఆత్మభావం బలపడుతుందో వారి సత్సంగం అవసరం. ఏ గ్రంథాలను అధ్యయనం చేస్తే సత్యం స్పష్టమవుతుందో ఆ స్వాధ్యాయం అవసరం. ఏ ధ్యాన పద్ధతి మనస్సును అంతర్ముఖం చేస్తుందో ఆ ధ్యాన సాధన అవసరం.

అంటే సేవ అనవసరం అని కాదు. సేవ ఒక పవిత్ర సాధన. అది మన హృదయాన్ని విశాలం చేస్తుంది. అహంకారాన్ని కరిగిస్తుంది. స్వార్థాన్ని తగ్గిస్తుంది. ఆత్మసాక్షాత్కారానికి అనుకూలమైన అంతరంగాన్ని సిద్ధం చేస్తుంది. కానీ సేవ ఒక్కటే మోక్షాన్ని ప్రసాదించదు. సేవ మార్గం మాత్రమే; గమ్యం కాదు.

అందుకే “మానవ సేవే మాధవ సేవ” అని అన్నారు.
అయితే, మాధవుడిని సేవించడం ఒక స్థితి; నీవే మాధవుడివని అనుభవించడం మరొక స్థితి.

సేవ చేస్తున్నంత వరకు సేవకుడు వేరు, సేవ పొందుతున్నవాడు వేరు; అంటే దేవుడు వేరు.  అక్కడ సూక్ష్మంగా ద్వైత భావన ఉంటుంది. కానీ “సర్వం ఖల్విదం బ్రహ్మ” అనే అనుభూతి కలిగినప్పుడు, సేవకుడు–సేవ్యుడు–సేవ అనే భేదాలు కరిగిపోతాయి. అక్కడ అద్వైతం వికసిస్తుంది.

ఆత్మజ్ఞానం లేని సేవ పుణ్యాన్ని ఇస్తుంది. అది ఆనందం కోసం చేసే సేవ 
ఆత్మజ్ఞానంతో చేసిన సేవ చిత్తశుద్ధిని ఇస్తుంది.అది ఆనందంతో చేసే సేవ 
ఆత్మసాక్షాత్కారం కలిగిన స్థితిలో జరిగే సేవ ‘నీవే ఆనందమై చేసే సేవ’
 అప్పుడు అది సేవ అని పిలువబడదు. అది సహజస్పందనగా పరిగణించ బడుతుంది. పువ్వు పరిమళాన్ని వెదజల్లినట్లుగా, సూర్యుడు కాంతిని ప్రసరించినట్లుగా, జ్ఞాని తన ఉనికితోనే లోకహితాన్ని కలిగిస్తాడు.

సేవ మార్గం.మోక్షం గమ్యం. సేవ మనల్ని ద్వైతం నుంచి అద్వైతం వైపు నడిపించే వంతెన. ఆ వంతెనను దాటి చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే—ఆత్మసాక్షాత్కారం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

No comments:

Post a Comment