Wednesday, October 28, 2020

పాత్రత రచన: సద్గురు ఇ. కృష్ణమాచార్యులు

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 60,61 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు

🌻. పాత్రత 🌻

🌻తగినవాడు‌ కనిపించినపుడు దానము‌ చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము.

ఎవరికిని నీ‌ వలన బాధ కలుగరాదను ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము.

పాత్రునకు దానము చేయుట‌ అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను.

అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది.

అది లేకపోవుట చేతనే మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది.

దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును.

తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో‌ సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత.

దానిని‌ సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...

ప్రియముగా పలుకుట అనగా మన సంభాషణ వలన ఎదుటివాడు సంతోషించునట్లు పలుకుట.

సామాన్యముగా దానము చేసినవాడు దానము పొందిన వాని‌ కన్నా గొప్పవాడను భ్రాంతి ఉండును కనుక నిర్లక్ష్యముగా దానము చేయుట, అమర్యాదగా మాట్లాడుట, తనతో సమానముగా చూడలేకుండుట మానవ లక్షణములైన దౌర్బల్యములు. వానిని దాటగల్గినపుడు మాత్రమే ప్రియవాక్యములతో దానము మున్నగునవి చేయవలెను.

మన కన్నా బలవంతుడు, ధనవంతుడు అగు వాని యెడల పలికిన ప్రియవాక్యములు లెక్కలోనివి కావు. అవి తప్పనిసరి కనుక సదభ్యాసములుగా లెక్కపెట్టరాదు.

ఉద్యోగమిచ్చినవాని ఎదుట చేతులు జోడించి నిలబడి మాట్లాడుట భక్తియోగము అనవచ్చునా? కనుక ప్రియవచనములు అనగా మన‌ కన్నా చిన్న వారు తక్కువ వారు కనిపించినపుడు పలికిన ప్రియవచనములు మాత్రమే ఆత్మసాధనకు పనికి వచ్చును.

ప్రియముగా మాట్లాడవలెనని సత్యమును మెలిద్రిప్పరాదు. ఎదుటివాని అభిప్రాయము మనకు నచ్చనప్పుడు నచ్చినట్లు తియ్యగా మాట్లాడుట సత్యభంగము కనుక ఎదుటివానికిని మనకును త్రిప్పలు తెచ్చును. కనుక ప్రియవాక్కు కన్న సత్యవాక్కు ముఖ్యము. సత్యమును అయినను అప్రియముగా పలుకుటలో హింస ఉండును.

కనుకనే మనువు "సత్యమునే పలుకవలెను, ప్రియముగా మాత్రమే పలుకవలెను, సత్యమును అప్రియముగా పలుకరాదు, ప్రియము కదా అని అసత్యము పలుకారాదు" అని శాసించెను.

పై మూడింటికి ముఖ్యోద్దేశము ఒక్కటే. తనకు గాని ఎదుటి వారికి గాని బాధ లేకుండుట. దానినే అహింస అందురు. ఈ సంకల్పము మనస్సున ఉన్నచో మిగిలిన మూడును నిర్వర్తించుట చేతనగును....
మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹



Source - Whatsapp Message

No comments:

Post a Comment