Wednesday, October 14, 2020

భగవంతుని పై నమ్మకం

భగవంతుని పై నమ్మకం


ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనమూ లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది.

ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలి పడ్డాడు. ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి ! ఇంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు? నీకు ఏమైనా సహాయం చేయనా ?అని అడిగాడు.

ఆ చిన్ని పక్షి,” నాకు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతున్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే, ఈ ఎండ, వేడిని కొంచము తట్టుకుని హాయిగా, సంతోషంగా ఉండగలను." అని చెప్పింది .

“ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది. అయినా నేను పరమాత్మ దగ్గరకి వెళ్లి నీ కోరిక నెరవేర్చమని అయనను అడుగుతాను”, అన్నారు.

శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్లి ఆ పిట్టకి సహాయం చేయమని ఆయనకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు ఆయన "నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను. కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ, ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడూ ఏదో ఒక కాలి పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి, ఉపశమనం కలుగుతుంది. వెళ్లి ఆ పక్షి తో ఇలా నేను చెప్పానని చెప్పు" అన్నారు పరమాత్మ.

నారదుడు మళ్ళీ ఎడారి లో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి భగవానుని పై ఎంతో నమ్మకము. ఈ ఉపాయం విని చాలా సంతోషించింది. నారద మహర్షికి ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఈయనకు అర్థం కాలేదు "ఇందులో ఇంత సంతోషించటానికి ఏముందో. అడిగిన చెట్టు మొలిపించలేదు సరి కదా, ఒంటి కాలి మీద నడువు" అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలు లో పెట్టటం మొదలు పెట్టింది.

మహర్షికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అక్కడికి వెళ్లి చూద్దామని ఆ దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఈయనకి ఆనందం కలిగింది, అయినా పరమాత్మ చెప్పక పోయినా చెట్టేలా వచ్చిందనే విషయం బోధ పడలేదు. మళ్ళీ దేవుడి దగ్గరకి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు.

అందుకు శ్రీమహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు:" నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తల రాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తరువాత, భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని, అర్థము చేసికొని ఆచరించింది. అంతే కాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయముతో తనకు లభించిన భగవత్ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు , నా అనుగ్రహము మేరకు తల రాతను మార్చేసి, అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను" అన్నారు.

మనం నేర్చుకోవలసినది ఏమిటి?
*అందిన అనుగ్రహాన్ని ఆచరించాలి, ఆ పూటకు దొరికిన దాన్ని ప్రసాదముగా భావించాలి. ఈ మాత్రము అందుకోగలిగినందుకు ఆయన పట్ల కృతజ్ఞత చూపాలి. మనకేమి కావాలో ఆవి యిస్తారు, మనం కోరుకున్నవన్నీ మనకు సుఖ శాంతులు అందించలేకపోవచ్చు. అందువలన ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే, మనకేది అవసరమో ఆయనే ఇచ్చేటట్లు ధన్యవాదములు తెలియచేసుకోవాలి, భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం- వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.

Source - Whatsapp Message

No comments:

Post a Comment