Monday, July 29, 2024

దేహతాదాత్మ్యము

 #దేహతాదాత్మ్యము..*

ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతడు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కుతాడు. అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలాగా కాక ఆ మనిషే అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకు ముసలితనం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు అని అతడికి తెలుసు. అయినప్పటికి చావును తప్పించుకోవాలనుకొని ఒక ఆలోచన చేశాడు. రూపం, రంగు, ఒడ్డు, పొడుగు, డ్రెస్ అన్నీ తనలాగే అచ్చు గ్రుద్దినట్లుగా ఉండే 9 శిల్పాలను తయారుచేశాడు. వాటిని చూసిన వారెవరైనా వాటిని శిల్పాలు అని అనుకోరు. ఆ శిల్పియే అనుకుంటారు. ఆ తొమ్మిదింటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొంతకాలం గడిచింది.

అతడికి జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతోకాలం జీవించటం జరగదు. బహుశా రెండు మూడు గంటలు మాత్రమే అని చెప్పారు. అప్పుడా శిల్పి తన ఇంటి బయట 9 శిల్పాలను పరుండబెట్టి అన్నింటిపై ఒకేరకం వస్త్రాన్ని కప్పి, తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకం వస్త్రాన్ని కప్పుకున్నాడు. మరణ సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు చేత పాశాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు. అయితే అక్కడ 10 మంది శిల్పులు పరుండినట్లు గమనించాడు.ఆదిత్యయోగీ.

ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ ఒక్కటిగానే ఉన్నారు. ఇందులో ఆయుష్షు తీరిపోయిన శిల్పి ఎవరా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు బోధ పడటం లేదు.

ఒకరికి బదులు మరొకరి మెడలో పాశాన్ని వేయటం తన వృత్తి ధర్మానికే కళంకం. తనకున్న 'సమవర్తి' అనే పేరు తొలగిపోతుంది. అందువల్ల అందరినీ మరొకసారి పరికించి చూచి తిరిగివెళుతూ వెళుతూ "వీడెవడో గాని అన్నింటిని ఎంతో నైపుణ్యంతో, జీవకళ ఉట్టి పడేటట్లుగా చక్కగా చెక్కాడు గాని ఒక్క పొరపాటు చేశాడు" అని పెద్దగా అన్నాడు. ఆ మాట వినటంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమాంతంగా లేచి "ఏమిటయ్యా.. ఆ పొరబాటు..?" అన్నాడు. "..నీవు లేవటమే ఆ పొరపాటు" అని యమధర్మరాజు.. అతడి మెడలో యమపాశాన్ని వేసి ప్రాణాలు గైకొని పోయాడు. ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి. కాని దేహాభిమానం అతణ్ణి వీడలేదు. నేను ఇంతటి గొప్ప శిల్పినే.. నేనేం పొరపాటు చేశాను..? అనే అభిమానం పొడుచుకు వచ్చింది. లేచాడు. పొయ్యాడు. దేహాభిమానమే అతడి కొంప ముంచింది, అతడి ప్రాణాలు తీసింది.
 
దేహాభిమానం గలవారు 'ఈ దేహమే నేను' అనే భావంతో ‘నేను’ 'నేను' అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ దేహానికి సంబంధించిన వారిని 'నావారు' అని, ఈ దేహానికి సంబంధించిన వాటిని 'నావి' అనే మమకారాన్ని కలిగి ఉంటారు. ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకొని, మనస్సును అనవసరమైన ఆందోళనలకు, ఉద్రేకాలకు లోనుగావించుకొని అశాంతిని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూనే ఉంటారు. అందుకే నిర్గుణోపాసన అనేది కష్టతరమవుతున్నది. ఈ "దేహతాదాత్మ్యమే మానవులు కున్న పెద్దదోషం".

ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జపధ్యానాదులు, ఉపాసనలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేక పోవటానికి కారణం ఈ దేహాభిమానమే.. దేహతాదాత్మ్యమే.. దేహమే నేను అని భావించే అహంకారమే. క్షేత్రాన్ని శుద్ధం చేయకుండా.. పొలాన్ని సరిగ్గా దున్ని తయారు చేయకుండా విత్తనాలు చల్లితే ఏం ప్రయోజనం.. పునాది గట్టిగా వేయకుండా ఎన్ని అంతస్థుల మేడ కడితే అది ఎంతకాలం ఉంటుంది.. అలాగే అంతరంగం లోని దేహాభిమానం తొలగకుండా పరమాత్మయందు మనస్సు నిలుపుదాం అని ప్రయత్నిస్తే నిలుస్తుందా..? నిలవదు. కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి. ఆ దోషం తొలిగితే గాని నిర్గుణోపాసన కుదరదు...!!

No comments:

Post a Comment