Thursday, July 25, 2024

*****బాగు కోరేదే భాగవతం

 *🙏బాగు కోరేదే భాగవతం🙏*            
      *👉శ్రీకృష్ణపరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తూ భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాంగ్మయ మూర్తియనీ, బ్రహ్మ సూత్రాలకు భాష్యరూపమనీ, సకల వేదసారమనీ, కామక్రోధాలను జయించడానికి, ధుఃఖ దారిద్య్ర, పాపములను ప్రక్షాళన కావించుటకు, భాగవతానికి మించిన ఔషదము వేరొకటిలేదనీ, కాశి, గంగ, ప్రయాగ, గయ, తీర్ధ సేవనము, భాగవత కధా శ్రవణానికి సాటిరావనీ, ఎక్కడభాగవత కథా శ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని. వెయ్యి అశ్వమేధయాగాలు, వంద వాజపేయ యాగముల ఫలితం భాగవత కధా శ్రవణములో 16 వ వంతు సరితూగనిదనీ, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రముననే శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది.*

*ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపదిదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడనికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని?*

*శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేకమంది దుష్టరాజులతో స్వయంగా యుధ్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకొన్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడ చేపట్టుకోనని ఎందుకు అన్నాడు?*

*గోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా, బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడనికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులచే ఏవిధంగా ఆమోదింపబడ్డాడు?* 

*శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు, గోవులను కాచాడు, ఆటలాడాడు, పాటలూ పాడాడు చిలిపి చేష్టలు చేసి కొంటెవాడనీ అనిపించుకొన్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు. పెద్దవాడై దొరగా రాజ్యపాలనా చేశాడు.*

*రాజనీతిని పాటించాడు. రాజకీయ వ్యవహారాలనూ నడిపించాడు, రాయబారం చేశాడు, రధాన్ని నడిపాడు, రాసక్రీడలు సలిపాడు, గురుసేవలు చేశాడు, ఎంగిళ్ళు తిన్నాడు, విషాన్ని హరించాడు, బ్రాహ్మణుల పాదాలు కడిగాడు, మహారాజులచే పాదపూజలందుకున్నాడు, శత్రువులను సంహరించాడు, చివరకు క్షవర కర్మ కూడా (రుక్మికి గడ్డాలు, మీసాలు జుట్టు గొరిగాడు) చేశాడు. ఆర్తులను ఆదరించి సేదతీర్చాడు,  ఆపదలోఉన్నవారిని బంధువుగా ఆదుకొన్నాడు, సంసారిగా జీవించాడు, భోగిగా కనిపించాడు, మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు నిందలను మోసాడు, దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటినన్నిటినీ ఎదుర్కొన్నాడు.*

*సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినుతికెక్కాడు. ఆనందరూపుడై ఆబాలగోపాలాన్నీ అలరించాడు. మధుర మూర్తియై ప్రేమామృతాన్ని వెదజల్లాడు. ఙ్ఞాన స్వరూపుడై ఙ్ఞానకాంతులను విరజిమ్మాడు. శాంతికాముడై ధర్మ స్థాపనకు ఉద్యమించాడు,  ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీ కృష్ణుని దివ్యమైన లీలలను, బోధలను మహాత్మ్యాలను   స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు.* 

* *దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి భాగవత గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజూ పఠించాలి ఎంతగా పఠిస్తే, అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి🙏*

*భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం. ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే!  ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.* 

*భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచలంచల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది. భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది.* 

*ఎన్ని రూపాలలో, ఎంతమందిని, ఎన్నిరకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు  సూచిస్తున్నారు...☝️*                             
      *🙏శ్రీకృష్ణం వందే జగద్గురుమ్🙏*

No comments:

Post a Comment