Wednesday, July 24, 2024

భగవంతుడు ఏమి చేసినా దానికొక కారణముంటుంది.

 *🕉️భగవంతుడు ఏమి చేసినా దానికొక కారణముంటుంది.🙏🪷*

ఒక సంక్రాంతి దినమునాడు కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి, ద్రౌపది అందరూ కలసి చెఱుకులు తింటున్నారు. ఆ సమయములో చెఱకు కోస్తున్న శ్రీకృష్ణుని చిటికెన వేలుకు గాయం తగిలినది. దానికి కట్టు కట్టడానికి సత్యభామ, రుక్మిణి గుడ్డను తీసుకురావటానికి చెలికత్తెలను పంపించారు. కాని వెంటనే ద్రౌపది తన క్రొత్తచీరను చింపి కృష్ణునియొక్క చిటికెన వేలికి కట్టు కట్టింది. ఆ ఉపకారమును పురస్కరించుకొని కౌరవసభలో ద్రౌపదిని నిర్వస్త్రను చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆమెకు కృష్ణుడు అక్షయముగా చీరలను అందించి కాపాడాడు. కాబట్టి మనము భగవంతునికి ఏమి సమర్పించుకున్నను దానిని
తిరిగి అందుకోటానికి అధికారముంటున్నాది.

భగవంతుడు చేసిన ప్రతికార్యమునకు ఒక కారణముంటుంది.

కర్జునకు ఒక శాపముంటుంది. తన గురువు అయిన పరశురామునకు తాను బ్రాహ్మణుడనని నమ్మించి అతని వద్ద విద్యలు నేర్చుకున్నాడు. కడపటికి అతడు క్షత్రియుడని తెలిసింది. తనను వంచించి నేర్చుకున్న విద్యలు నిష్ప్రయోజనమవుతాయని పరశురాముడు కర్ణునికి శాపమిచ్చాడు. యుద్ధసమాప్తము అయిన తరువాత ఒకనాడు కృష్ణుడు అర్జునుని రథము దిగమన్నాడు. అర్జునునికి అహంకారమువలన ముందు నువ్వు దిగమన్నాడు. ఈ విధముగా వాదోపవాదములు జరిగిన తరువాత ఆఖరికి అర్జునుడు రథము దిగాడు. కృష్ణుడు రథమునుండి దిగినవెంటనే అ రథము భస్మమయినది. కారణం, కర్ణునియొక్క అస్త్రములవలన అర్జునుని రథము ఏనాడో భస్మము అయివుండేది. కాని కృష్ణుడు దానిని కాపాడుతూ వస్తున్నాడు. అప్పుడు అర్జునుడు తన అహంకారము విడిచి కృష్ణుని వేడుకున్నాడు. భీష్ముడు వదలిన అస్త్రముల తాకిడికి తట్టుకొనలేక అర్జునుడు కృష్ణుని స్మరించుకుని 'ఏ కృష్ణుడైతే నన్ను సృష్టించాడో ఆ కృష్ణుడే నన్ను రక్షించాలి. ఏ కృష్ణుడైతే నాకు శిక్షణ యిచ్చాడో అతడే 'నాకు రక్షగా వుండాలి' అని వేడుకున్నాడు. భీష్ముని ప్రతాపమును చూచి అర్జునుడు బలహీనుడైనాడు. అప్పుడు కృష్ణుడు ఆవేశముతో రథము దిగి 'భీష్ముని నీవు చంపుతావా లేక నన్ను చంపమంటావా' అన్నాడు. ఇది అర్జునునకు ఒక విధమైన ఉద్రేకము తెప్పించుటకు చేసినదే కాని మరొకటి కాదు. అదే విధముగా భగవంతుడు చేసిన ప్రతి చర్యకు ఒక గూఢార్థము మరియు కొన్ని కారణములు వుంటాయి. కృష్ణుడు చంపడానికి వచ్చినప్పుడుకూడా భీష్ముడు 'కృష్ణుడే నన్ను రక్షించుగాక', అని వేడుకుంటున్నాడు. ఎందుకంటే శిక్షించేది తానే, రక్షించేది తానే అని తెలుసుకున్నవాడు కాబట్టి. అతడే జ్ఞాని, భీష్మాచార్యుడు.

*~శ్రీ సత్యసాయి వచనామృతం.*
*(29-04-1988)*

No comments:

Post a Comment