Monday, November 16, 2020

జీవిత పాఠాలు.

*జీవిత పాఠాలు.
ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు... లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు. ప్రతి జీవితం ఎలా జీవించాలో, జీవించకూడదో తెలియజేసే ఒక పాఠం అవుతుంది. నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలేగానీ... ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
పుస్తక పఠనం ద్వారా ఎంత నేర్చినా, మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు. ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం.
నాన్ననుంచి క్రమశిక్షణ, అమ్మనుంచి సందర్భోచిత నాయకత్వ లక్షణాలు, మామ్మనుంచి మనశ్శక్తి, తాతయ్యనుంచి అప్పగింతలు, తోబుట్టువులనుంచి క్షమ, మరపు... ఎన్నో నేర్చుకోవచ్చు. మనిషి కళ్లు తెరిచిన దగ్గర్నుంచీ నేర్వదగ్గ పాఠాలు బోలెడు.
మీరా నుంచి భక్తి, హనుమనుంచి సమర్పణ భావం, మహాత్మాగాంధీ సంకల్పబలం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో స్టీవ్‌ జాబ్స్‌నుంచి, ఎడిసన్‌ నుంచి పట్టువిడవని సాధన... ప్రతి జీవితం జ్ఞానసముపార్జనకు అద్భుత అవకాశం కల్పిస్తుంది. మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచడమనేది కీలకం. లోపల ఉండే అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఎవరినుంచైనా, దేనినుంచైనా, ఏ పరిస్థితిలోనైనా నేర్చుకోవడమన్నది విడవకూడదు. చాలామందిలో పాఠశాల రోజులతోనే నేర్చుకోవడం ఆగిపోతుంది. అటువంటి బతుకు నిరర్థకంగా తయారవుతుంది.
మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలంటే, ఆరోగ్యంగా ఎదగాలంటే- అధ్యయనం జీవితాంతం సాగాలి. అది శ్వాస తీసుకోవడంలా, తుదిక్షణాల వరకు నిలవాలి.
ఆటపాటల్లో మునిగితేలే పిల్లల్ని చూస్తే వర్తమానంలో జీవించడమంటే ఏమిటో బోధపడుతుంది.
ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించేదంతా అనుభవం అవుతుంది. అది పరిపక్వతను పెంచుతుంది.
ప్రాముఖ్యం లేని సంఘటనలు సైతం అద్భుతమైన అవకాశాలై జీవితంలో గొప్ప అనుభవాలుగా నిలుస్తాయి. ఎందరికో మార్గదర్శకం అవుతాయి. ఐన్‌స్టీన్‌, ఆర్కిమెడిస్‌, న్యూటన్‌ పరిశోధనలు మానవ జీవనశైలినే మార్చేశాయి. ఆ పరిశోధనలన్నీ ఏ మాత్రం ప్రాధాన్యం తోచని అనుభవాలుగా మొదలై వెలుగులోకి వచ్చినవే.
కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవగతమవుతుంది మనిషికి... పరిపక్వతకు ఒక అడుగు తక్కువలో ఉందన్న విషయం. పరిస్థితులకు తలకిందులైపోయి, చెదిరిపోయి, ఉద్విగ్నతకు లోనై నిరుత్సాహపడితే నేర్చుకునేది ఏమీ లేకపోగా- అవే పరిస్థితులు పునరావృతమవుతుంటాయి.
జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు, ఏళ్లు పడితే... మరికొందరికి జీవితకాలం సరిపోదు.
అనుభవాలు రకరకాలు. జయాపజయాలు, మంచి చెడులు, అనుకూల ప్రతికూలాలు... ప్రతి అనుభవం ఒక పరీక్షే. అవన్నీ ‘నేటి’నుంచి ఎలా ఉండనుందో తెలియని రేపటికి తీసికెళ్ళేందుకు మనిషిని సిద్ధం చేయడం కోసమే.
తాను చేసే పొరపాట్లవల్ల మనిషి లోతైన పాఠాలు నేర్చుకుంటాడు. అపజయాలు గుర్తుండిపోయే పాఠాలు నేర్పుతాయి. విజయం ప్రేరణనందిస్తే, పరాజయం బోధకుడి పాత్ర పోషిస్తుంది. మనిషి పొరపాట్లకు మానసికంగా చలించిపోతే ‘రేపు’ కొత్తగా ఉండదు. బతుకు భారమనిపిస్తుంది.
జీవితం ఒక ఆట. లెక్కకు మించిన అవకాశాలను, సవాళ్లను దారిపొడుగునా విసురుతూనే ఉంటుంది. పట్టుదల ఉంటే వాటినందుకుంటూ జీవితాన్ని మెరుగుపరచుకుంటూ మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు.
(ఈనాడు అంతర్యామి)
✍🏻మంత్రవాది మహేశ్వర్‌

Source - Whatsapp Message

No comments:

Post a Comment