Sunday, December 20, 2020

విశ్వాసం

విశ్వాసం

“విశ్వాసం లేని మనిషికి సుఖముండదని” పెద్దలన్నట్టు ఇతరులని విశ్వసించని వారు సంతోషంగా జీవించలేరు. ప్రతి విషయాన్ని అనుమానించేవారు కార్యాలను విశ్వాసంతో ప్రారంభించలేరు. తమని తాము బలంగా విశ్వసించేవారు మహనీయులుగా పేరు తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి.

“దైవవిశ్వాసం కొండలను కదిలిస్తుంది. విశ్వాసానికి మించిన సంపద సృష్టిలో లేదని” శాస్త్రాలు చెప్పినట్టు భగవంతునిపై విశ్వాసంతో తండ్రి కల్పించిన బాధలను భరించిన ప్రహ్లాదుడు ఆ సర్వాంతర్యామిని నరసింహావతారంలో దర్శించినట్టు భాగవతం వివరించగా, శ్రీకృష్ణుడిపై అపార విశ్వాసముంచి కురుక్షేత్రంలో దిగిన పాండవులకు విజయలక్ష్మి వరించినట్టు భారతం తెలుపగా , శ్రీరామ నామ జపబలంతో సముద్రాన్ని లంఘించిన హనుమంతుని విశ్వాసాన్ని రామాయణం తెలిపింది.

“దైవశక్తి గొప్పదనం విశ్వసించిన భక్తులకు విజయాలు వరిస్తాయని” పురాణాలు వర్ణించాయి. గణాధిపత్య పోరులో త్రిలోకాలు సంచరించే బదులు శివపార్వతులకు ప్రదక్షణ చేసి గణాధిపత్యం పొందిన వినాయకుడి కథను శివపురాణం తెలిపగా, కురుసభలో మానరక్షణ చేయమని కృష్ణుని ప్రార్ధించి ఆపదను అవలీలగా అధిగమించిన ద్రౌపది చరితను, కురుక్షేత్రంలో తమ తరుపున అండగా నిలవమని కృష్ణుని కోరి విజయం పొందిన అర్జునుడి గాధను భారతం, మొసలి నోటికి చిక్కి సందేహంతో పిలిచిన గజరాజుని కనికరించని విష్ణువు, విశ్వాసంతో పిలవగానే పరుగున వచ్చి రక్షించిన వైనాన్ని భాగవతం తెలిపాయి.

“గురువు యందు విశ్వాసంతో చరిస్తూ గురువాక్కు పాలించేవారికి శుభాలు జరిగి ఉన్నతులు కాగలరని గ్రంథాలు” వ్రాసినట్టు చాణక్యుని ఆదేశాలతో చంద్రగుప్తుడు పాటలీపుత్రమునకు రాజయినట్టు, మత గురువయిన సమర్దరామదాసుపై ఛత్రపతి శివాజీ నిలిపిన విశ్వాసమే హైందవ స్వరాజ్య స్థాపనకు, అణగారపోయిన హిందూ జాతిని జాగృతం చేయడానికి ఉపయోగపడినట్టు చరిత్ర తెలిపింది. గురువుపై అపార విశ్వాసంతో గంగానది దాటుతున్న సనందుడి పాదాల క్రింద పద్మాలు ఏర్పడినట్టు పద్మపాదుడి కథ తెలిపింది.

“విశ్వాసమనేది మనిషిలోని దివ్యత్వాన్ని బయటకు తీస్తుందని, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటే అసాధ్యమేదీ లేదని” గ్రంథాలు వ్రాసినట్టుగా భారత స్వాతంత్ర్యాన్ని సత్య అహింసలతో సాధించిన మహాత్మాగాంధీ, అమెరికాను కనుగొన్న కొలంబస్, అంధులకు లిపి కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ అపార విశ్వాసంతో చాటి చెప్పారు.

“ఒక వ్యక్తి కానీ ఒక జాతి కానీ తమపై విశ్వాసం కోల్పోయినప్పుడు మరణించినట్టేనని, బలహీనులుగా భావించుకుంటే బలహీనులే అవుతారని, బలవంతులుగా భావించుకుంటే బలవంతులవుతారన్న ” వివేకానందుని బోధనల సాక్ష్యంగా విశ్వాసంతో ముందడుగేసి ఉన్నత లక్ష్యాలు , విజయ తీరాలు నిర్దేశించుకుని అధిగమించినప్పుడే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి జాతి పురోగతిని దర్శించే రోజు వస్తుంది.
🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment