Tuesday, May 3, 2022

ఆశ్రయ దోషం

🌹 ఆశ్రయ దోషం 🌹

🥀మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు.

🥀భీష్ముడు ప్రాణాలు విడువడానికి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ యుద్ధభూమిలో అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ధర్మరాజు, శ్రీకృష్ణుని అనుజ్ఞతో తన తమ్ములతోనూ, ద్రౌపదితోనూ భీష్మపితామహుణ్ణి చూడటానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు.

🥀పాండవులు, ద్రౌపది ధర్మాత్ముడైన భీష్మునికి పరమ పాదాభివందనాలు చేశారు. తరువాత ధర్మరాజు ఆయనను వర్ణాశ్రమాలు, పౌరుల కర్తవ్యాలు, రాజు విధులు వంటి ముఖ్యమైన విషయాల గురించిన అనేక ప్రశ్నలు అడిగాడు. భీష్ముడు ఆ ప్రశ్నలన్నింటికీ సముచిత జవాబులు ఇవ్వసాగాడు.

🥀ఈ విధంగా భీష్ముడు, ధర్మజునికి ధర్మోపదేశం చేస్తూన్నప్పుడు హఠాత్తుగా ద్రౌపది ఫక్కున నవ్వింది.

🥀ఆ నవ్వు శబ్దం విన్న భీష్ముడు ధర్మోపదేశాన్ని సగంలో ఆపివేసి, ద్రౌపదిని చూస్తూ, "పౌత్రీ! ఎందుకమ్మా నవ్వావు?" అని అడిగాడు.

🥀ద్రౌపది ఆ మాటకు ఎంతో సిగ్గుపడిపోయింది. తల దించుకొని, "నన్ను క్షమించండి, పితామహా! ఏదో అజ్ఞానంలో నవ్వేశాను. తప్పు చేశాను, మన్నించండి" అంది.

🥀పితామహుడు ఆ జవాబు విని తృప్తి చెందలేదు. ఆయన ఇలా కొనసాగించాడు. "తల్లీ! ఏ కులస్తీ కూడా పెద్దల సమక్షంలో ఎన్నడూ నవ్వదు. ఉత్తమురాండ్రలో సర్వోత్కృష్ట అయిన నీ వంటి కులాంగన ఏ కారణం లేకుండా పలువురి సమక్షంలో ససేమిరా నవ్వదు. నువ్వు సుగుణాలరాశివి, మహాపతివ్రతవు. అటువంటి నీకు కారణరహితంగా నవ్వు వచ్చి ఉండదు. కాబట్టి నిస్సంకోచంగా నువ్వు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు.”

🥀పితామహుని మాటలు విన్న ద్రౌపది కళ్ళు అర్ధమయ్యాయి. చేతులు జోడించి భీష్మునికి నమస్కరిస్తూ ఆమె, “పితామహా! అది చాలా చిన్న విషయం. అయినప్పటికీ మీరు అడిగారు కనుక నేను చెప్పకు తప్పదు. నేను చెప్పింది విన్న తరువాత దయచేసి నా పట్ల కోపం వహించకండి.

🥀“మహానుభావా! మీరు ఇప్పుడు ఇంతలేసి ధర్మోపదేశాలు చేస్తున్నారు. హఠాత్తుగా నాకు ఒక సంఘటన జ్ఞప్తికి వచ్చింది. ఈనాడు ధర్మానికి ఇంత విపులంగా వివరణ ఇస్తున్న ఇదే పితామహుడు, కౌరవ సభలో నాడు దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేస్తూ నా మానానికి భంగం కలిగింప విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు నోరు మెదపకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారే! ఆ సమయంలో, ఇప్పుడు ఇంతగా ధర్మోపదేశం చేస్తున్న భీష్మాచార్యులవారు ఈ జ్ఞానాన్నంతా ఎక్కడ విడిచిపెట్టేశారు? లేదా ఒకవేళ ఈయన ఈ ధర్మాచరణ జ్ఞానాన్ని ఆ తరువాత సంతరించుకొన్నారని అనుకోవచ్చునా! ఇది తలచుకోగానే నాకు ఫక్కువం నవ్వు వచ్చింది. నన్ను మనసారా క్షమించండి" అంది.

🥀అంతా విని పితామహుడు ప్రశాంతంగా ఇలా జవాబిచ్చాడు. "అమ్మా, ద్రౌపదీ! నీ ప్రశ్న చాలా న్యాయసమ్మతమైనది. దీన్లో నిన్ను నేను క్షమించడానికి ఏం ఉంది? కౌరవ సభలో నేను ఆసీనుడనై ఉన్న ఆ సమయంలో ధర్మాచరణ జ్ఞానం నాకు లేకపోలేదు. కాని దుష్టుడైన దుర్యోధనుని ఉప్పు (ఆహారం) నేనప్పుడు తింటున్నాను. ఫలితంగా నేను ఆశ్రయ దోషానికి గురి అయ్యాను. ఆ కారణంగా నా జ్ఞానం మసకబారి మంచి చెడుల తారతమ్యం గురించి యోచించే శక్తిని కోల్పోయింది. దుష్టులు సమర్పించే ఆహారాన్ని తింటే, తిన్న వారి మనస్సూ శరీరమూ దౌష్ట్యాన్ని సంక్రమింప జేసుకొంటాయని శాస్త్రాలు వచిస్తున్నాయి.

🥀కాని ఇప్పుడు యుద్ధంలో అర్జునుడు నాపై ప్రయోగించిన బాణాలచే నా దేహంలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేసింది. దుష్టులు పెట్టిన ఆహారం తినడంతో ఏర్పడ్డ రక్తం ఒక్క చుక్క కూడా శరీరంలో లేకుండా బయటకు వచ్చేయడంతో బుద్ధి స్పష్టతను సంతరించుకొంది. కాబట్టి ఇప్పుడు ఈ మేరకు ధర్మతత్త్వాలను సునిశితంగా విడమరిచి చెప్పగలుగుతున్నాను.”


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

సేకరణ

No comments:

Post a Comment