‘ఆచార్యవాన్ పురుషో వేద’ అని ఉపనిషద్వాక్యం. ‘ఆచార్యుని కలిగిన పురుషుడే తెలుసుకుంటున్నాడు’ అని దీని భావం.
ఎవరికి గురువు ఉంటున్నాడో అతడే జ్ఞాని అవగలడు – అని తాత్పర్యం. ‘గురు లేక ఎటువంటి గుణికి మోక్షము లేదు’ అని త్యాగరాజ కీర్తన. శాస్త్రాలు అనంతాలు. సాధనా మార్గాలు అనేకాలు. ఏ శాస్త్ర ప్రమాణంతో ఏ మార్గాన్ని అనుసరించి తరించాలో తెలియాలంటే సామాన్య బుద్ధికి తేల్చుకోవడం కష్టం. అందుకే గురువు యొక్క ఆవశ్యకత.
మన శరీర లక్షణాన్ని పరిశీలించి, రోగ నిర్ధారణ చేసి, ఔషధ నిర్దేశం చేయడంలో వైద్యునికి ఎటువంటి బాధ్యతయో, మన జీవ లక్షణాన్ని, బుద్ధి స్థాయిని గ్రహించి తగిన సాధనా మార్గంలో ప్రయాణింప చేయడం గురువుదీ అటువంటి బాధ్యతయే.
విద్య – గురువు- విద్యార్థి – ఈ త్రిపుటితో సమన్వయము సాధించడం ఒక యోగం. విద్య కావాలనుకొనే వానికి విద్యపై శ్రద్ధ, బోధించే గురువుపై భక్తి ముఖ్యం.
విద్యలు పలు విధాలు. వాటిని లౌకిక విద్యలు – పారమార్థిక విద్యలు అని ప్రధానంగా రెండు భాగాలు చేయవచ్చు.
లౌకిక విద్యలు – కళలు, వృత్తులు, లోకవ్యవహారాన్ని అర్థవంతం చేసే విద్యలివి. వీటిని నేర్పే వారు గురువులే. అధ్యాపకులు, ఉపాధ్యాయులు అని కూడా వీరిని వ్యవహరించవచ్చు.
ఇక పారమార్థిక విద్యలు. ఇవి మళ్ళీ మూడు విధాలు: ధర్మము, ఉపాసన, వేదాంతం(తత్త్వవిచారణ).
శాస్త్రములననుసరించి ఆచరించవలసిన విధులు, చేయకూడని కర్మలు(నిషేధాలు) ఏమిటో బోధించేది ధర్మం. ఇది దేశ, కాల, పరిస్థితులననుసరించి, వారి వారి జీవన రీతులకు తగినట్లుగా అన్వయించాలి. దీనిని చక్కగా శాస్త్ర మర్యాదలతో బోధించి వ్యక్తిత్వ నిర్మాణం చేయించే వారు గురువులు.
ఈశ్వరానుగ్రహం లేనిదే చిత్తశుద్ధి, జ్ఞానము కలుగవు కనుక ఈశ్వరోపాసనను అలవడేలా చేయడం ‘ఉపాసనాశాస్త్ర’ గురువుల పని. ఇది కూడా సాధకుని స్థితి ననుసరించి ఉంటుంది. సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుని, ఆయన శక్తులను విధివిధానంగా ఉపాసించే శాస్త్రాలు చాలా ఉన్నాయి. అభీష్టదేవతా సిద్ధాంతాన్ని అనుసరించి ఒకే పరమేశ్వరుని వారి వారి ఇష్ట దేవతగా ఉపాసించడం జరుగుతోంది. ఆ ఉపాసనా పద్ధతులను ‘నిగమాగమా’(వేద-తంత్ర)ప్రకారం బోధించే మంత్రోపదేష్టలు గురువులు.
ధర్మము ద్వారా చిత్తశుద్ధి, ఉపాసన ద్వారా ఏకాగ్రత – సాధించిన ‘పక్వత’ కలిగిన సాధకులకు వేదాంత శాస్త్రాన్ని సంప్రదాయ సిద్ధంగా బోధించే వారు వేదాంత గురువులు.
పైవిధంగా ధర్మ, మంత్ర(ఉపాసన), వేదాంత విద్యలను బోధించే గురువు ఒక్కరుగానూ లభించవచ్చు. లేదా ఏ స్థాయిలో ఆ గురువు లభించవచ్చు. నిజానికీ పై మూడింటికీ పరస్పరానుబంధం ఉన్నది కనుక మూడు మార్గాలలోనూ తీర్చిదిద్దగలిగే సమర్థుడైన గురువు దొరకడం భాగ్యం. ఆచరించి ఆచరింపజేస్తాడు కనుక ‘ఆచార్యుడు’. మనలను మలచేవాడు కనుక ‘దేశికుడు’. ఉపదేశిస్తాడు కనుక ‘ఉపదేష్ఠి’. ఇవి పర్యాయపదాలు. గురువు ముఖ్యంగా సంప్రదాయానుగుణమైన శిక్షణతో శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి. వాటిని బోధించడంలో స్వార్థము, ధనాపేక్ష, కపటత్వం లేనివాడై ఉండాలి. శిష్యునికి సౌలభ్యంగా ఉండాలి...’ అని గురు లక్షణాలను శాస్త్రాలు బోధిస్తున్నాయి.
ప్రధానంగా ఒకే గురువును మనం చెప్పుకున్నా, వివిధ గురువుల అవసరము ఉంటుంది. అయితే ఒకే గురు సంప్రదాయాన్ని అనుసరించేటప్పుడు ఇతర సంప్రదాయాలు దానికి విరుద్ధం కావచ్చు. కనుక శాస్త్ర సిద్ధమైన బహు సంప్రదాయాలలో మనమనుసరించే గురువుగారి సంప్రదాయాన్ని వీడకుండా ఉండాలి. లేనిపక్షంలో అయోమయం, గందరగోళం ఏర్పడే ప్రమాదముంది. ఒకే వైద్య శాస్త్రాన్ని అనుసరించి చికిత్స పొందేటప్పుడు, ఇతర వైద్యవిధానాలను, అవగాహనారాహిత్యంతో కలిపివేస్తే ఏర్పడే ప్రమాదం వంటిదే ఇదీనూ.
శిష్యుడు తనను విశ్వసించి ఆశ్రయించాడు కనుక గురువు మరింత జాగరూకతతో వ్యవహరించాలి. శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సాధన చేసి, తాను పక్వత సాధించిన వాడే గురువు కాగలడు. తోటి సాధకులు ప్రేరకులు కాగాలరేమో కానీ గురువులు కాలేరు. గురువు ఒక చక్కని శిష్టాచార పరంపరకు చెందినా వాడై ఉండడం అత్యంత ప్రధానాంశం. సనాతన సదాచారంలో విశ్వాసం, అనుష్టానం ఉన్న గురువు శిష్యునకు హితకారి కాగలడు. సందేహం లేనివాడే సందేహాన్ని తొలగించగలడు. అసంశయః సంశయచ్చిత్. అలాంటి గురువును ఎలా అపోల్చడం? అనేదీ సమస్యే.
గురువు శిష్యుని పరీక్షించినట్లే శిష్యుడూ గురువును పరీక్షించాలి అనే ఒక మాట ఉన్నది. కానీ గురువును పరీక్షించేటంత తాహతు శిష్యునికుంటుందా? వివేకానంద రామకృష్ణుని పరీక్షించిన విధానాన్ని పరిశీలిస్తే కొంత బోధపడుతుంది.
చక్కని గురువు దొరకాలన్నా ఈశ్వరానుగ్రహముండాలి.
అసలు జీవుని లక్ష్యం ఈశ్వరానుగ్రహమే. దానిని పొందించేవాడు గురువు. నిష్కపటంగా ఈశ్వరానుగ్రహం కావాలని ఈశ్వరునే శరణువేడితే, ఆ ఈశ్వరుడే తగిన గురువును తగిన సమయంలో ఏదో రూపంలో పంపిస్తాడు, గుర్తించేలా చేస్తాడు. పెద్దల ద్వారా తెలుసుకున్న నియమబద్ధమైన, ధార్మిక జీవితాన్ని తెలిసినంత మేరకు అనుసరిస్తూ ఈశ్వర చింతన చేసేవానికి అటువంటి గురువు ప్రాప్తిస్తాడు. తగిన గురువు దొరికే వరకు భగవంతునే గురువుగా ‘శివాయ గురవేనమః’ అని శరణువేడాలి.
No comments:
Post a Comment