*ప్రశాంతత ఎలా వస్తుందో తెలుసుకుందాం
'సుప్రభాత వేళ నుంచి ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా, కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ప్రశాంతత మనసుకు లేపనం. ఆత్మకు ఔషధం. మానవ జీవితంలో ప్రశాంతత ఎంతో అవసరం, ఆధ్యాత్మిక జీవనం ప్రశాంతతతోనే సాధ్యం. జీవన బృందావనంలో ప్రశాంత పారిజాతాలు లేకపోతే వేణుమాధవుడు విహరించడానికి రాడు. ప్రశాంతత సీతాకోకచిలుకలా ఎగురుతూ ఉంటుంది. దాని వెంట పడితే అది దొరకదు. ఒక చోట హాయిగా కూర్చుంటే, వచ్చి వాలుతుంది. ఆలసిన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
జీవితం ప్రశాంతంగా ధ్యానంలా సాగిపోవాలని చాలా మంది ఆకాంక్ష. అలా జరగదు. ఎందుకిలా జరుగుతోంది అనే భావనే మనసును అల్లకల్లోలం చేసి ప్రశాంతతకు దూరం చేస్తుంది. ప్రశాంతతను తెచ్చి పెట్టుకోవాలి. అది పరిమళించే గులాబీల గుత్తిలా ఉండాలి. ప్రశాంతత లేని జీవితం వ్యర్థం. తినే ఆహారం, పీల్చే గాలి, నడక, ఆలోచన, నిద్ర... ఇవన్నీ మనిషిని సుఖంగా ఉంచడానికే. ఈ సుఖంలోంచే ప్రశాంతత పుడుతుంది. అత్యంత కీలకమైన ప్రశాంతత కలుగుతుంది. అది శాంతికి,
పరమశాంతికి దారి తీస్తుందని యోగం
తెలియజేస్తోంది. మొదట మనిషి నిలబెట్టు కోవాల్సింది ప్రశాంతత. దాని కోసమే కొంత ప్రయత్నం చెయ్యాలి. ఆ తరువాత ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్థితినైనా అలవోకగా
అందుకోవచ్చు. అంతర్గత ప్రశాంతత లేనిదే బాహ్య ప్రశాంతత వీలుపడదు. లోపల శ్రీకృష్ణుడు నివసిస్తుంటే, బయట కంసుడిలా ప్రవర్తించడం జరగదు. లోపల రావణాసురుడు తిష్ఠ వేసుకుని కూర్చుంటే, బయట శ్రీరాముడిలా నటించడం ఎక్కువ కాలం సాగదు..
జ్జానంతో నిజమైన ప్రశాంతత వసంత సమీరంలా ఉంటుంది. వాన వెల్లువలా ఉంటుంది. వాకిలి ముందు వేసిన అందమైన రంగుల హరివిల్లులా ఉంటుంది. కోకిల గానంలా ఉంటుంది. పారిజాత పుష్ప పరిమళంలా ఉంటుంది. పోతన తీయటి తెలుగు పద్యంలా హృద్యంగా ఉంటుంది.
దైవాంశ సంభూతుల చుట్టూ పట్టువస్త్రంలా ప్రశాంతత చుట్టుకుని ఉంటుంది. అవతార మూర్తుల సన్నిధిలో ప్రశాంతత వటవృక్షంలా ఎదిగి ఉంటుంది. ప్రశాంతత ఇవ్వని ఆలయం ఆలయం కాదు. దేవుడు దేవుడు కాదు.
చేయకూడని పనులు చేసి ప్రశాంతతను పోగొట్టుకోవడం సులువు. ప్రశాంతంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని హాయిగా జీవించడం కష్టం. ప్రశాంతత విలువను గుర్తించడంలో మనిషి ఔన్నత్యం బయటపడుతుంది.
ప్రశాంతతతోనే ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. తరంగాలు తరంగాలుగా ప్రశాంతత మనల్ని ఆవరిస్తుంటే అది అదృష్టం అనుకోవాలి. సహజంగా ప్రశాంతంగా ఉండటం అనేది ఏ నూటికో కోటికో ఒకరికి సాధ్యపడుతుంది. ఈ యాంత్రిక జీవనంలో మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలని మనోవైజ్ఞానిక శాస్త్రకారులు చెబుతున్నారు.
మంచి పుస్తకాలు చదవడం, మంచి మనుషుల్ని కలపడం, మంచి ఆలోచనలు. చెయ్యడం. అందరినీ కలుపుకొని ముందుకు పోవడం, కనిపించే ప్రతి విషయంలోనూ ప్రతికూల అంశాలు వెదకకుండా ఉండటం, అవకాశం ఉంటే ఏ కొద్ది మంచైనా ప్రతిఫలం ఆశించకుండా చెయ్యడం వంటి అంశాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ప్రశాంతత దేవుడిచ్చిన వరం. వెల కట్టలేనిది. వెనక్కి తిరిగి చూస్తే ఎంత హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాం అన్నదే మానవ జీవన సాఫల్యానికి అద్దం పడుతుంది. దీన్ని ఎన్నడూ
మరిచిపోకూడదు.
సేకరణ. మానస సరోవరం
No comments:
Post a Comment