నేటి మంచిమాట.
ఈరోజు అహం గురించి తెలుసుకుందాం
మనిషిలో 'అహం' ఉండటం సహజం. అది ఒక త్రాసు వంటిది. త్రాసులోని ఇరువైపులా ఏమీ లేనప్పుడు తూచే ముల్లు సమాంతరంగానే ఉంటుంది. ఎటువైపూ మొగ్గదు. ఈ సూత్రాన్ని మనిషి జీవనానికి అన్వయించుకొని ముందుకు సాగాలి. నేను, నాది అనేది అహం. మనిషి తనను తాను పరిచయం చేసుకొనే సందర్భంలో 'నేను' అనుకుంటే తప్పులేదు. తనకు సంబంధించిన వ్యక్తినో, వస్తువునో చెప్పినప్పుడు 'నాది' అని అనడంలో కూడా తప్పులేదు.
కొందరు ఆహాన్ని పూర్తిగా కోల్పోయి బతుకుతుంటారు. అలాంటివారు నారుపోసినవాడు నీరుపోయడా?" అనుకొంటూ బ్రతుకును సాగదీయడానికి ప్రయత్నిస్తుంటారు. పుట్టించిన దేవుడే భృతిని ఇవ్వాలి తప్ప, తాము ఏ ప్రయత్నమూ చేయవలసిన అవసరం లేచినే సోమరిపోతులు పరాన్నజీవులై ఇతరులపై ఆధారపడుతుంటారు. వీరికి ఉండవలసిన 'అహం' పూర్తిగా నశించిందని అర్ధం. ఇలాంటి వారిలో 'అహం' నశిస్తే ప్రమాదమే. తన కృషితో సొంతకాళ్ల మీద నిలబడి బతకాలని తెలుసుకోలేకపోవడం ఒక రకమైన
అజ్ఞానానికి సంకేతం.
అలాగే కొందరిలో 'అహం శ్రుతి మించుతుంది. అన్నీ నేనే, అంతా నేనే నన్న విర్రవీగే భావన ఎవరినీ లెక్కచేయకపోవడం, అందరినీ
తృణీకరించడం కనబడుతుంది. ఇలాంటివారు 'అహం' అనే త్రాసులో అటువైపు పూర్తిగా మొగ్గుతూ. సమాంతర స్థితిని కోల్పోవడం చూడవచ్చు. ఇదీ ప్రమాదమే. పూర్వం ఇలాంటి వికృతి గల రాక్షసులు లోకకంటకులై చెలరేగి, చివరికి అవతారమూర్తుల చేతిలో నశించిన వృత్తాంతాలు కనిపిస్తాయి. రావణుడు,
హిరణ్యకశిపుడు, తారకాసురుడు వంటివారు 'అహం' కట్టలు తెంచుకోగా, పతనానికి పాత్రులైనవారే. పరమ సాధ్వి సీతాదేవిని చెరబట్టడమే కాకుండా, ధర్మనిరతుడైన శ్రీరాముణ్ని ఎదురించి నాశనమయ్యాడు దశకంఠుడు. అతడి ప్రబల శక్తులన్నీ అధర్మం కారణంగా నశించిపోయాయి. అతడి ఆధర్మ ప్రవృత్తికి కారణం 'అహం' హద్దులు దాటడమే. లోకబాంధవుడు శ్రీకృష్ణుణ్ని అత్యంత హీనంగా తూలనాడిన పాపానికి సుదర్శన చక్రహతుడై తనువు చాలించాడు. శిశుపాలుడు!. హరి లేడు, గిరి లేడు' అంటూ మహావిష్ణువునే శత్రువుగా భావించి అహంకరించిన హిరణ్యకశిపుడు ఉగ్రనరసింహుడికి ఆహుతి అయ్యాడు. వరాలను జాగ్రత్తగా కాపాడుకో" అని సాక్షాత్తు వరప్రదాత బ్రహ్మదేవుడు చెప్పినా వినిపించుకోని 'అహం' హిరణ్యకశిపుడి నాశనానికి కారణమైంది.
భగవద్గీతలో కృష్ణుడు సమభావమే యోగం అన్నాడు. 'అహం' విషయంలోనూ ఈ సమభావం అవసరం. 'అహం' పూర్తిగా లేకున్నా బాధలు ఎదురవుతాయి. అలాగే కట్టలు తెంచుకొన్నా ప్రమాదాలే ఎదురవుతాయి. ఆత్మగౌరవానికి భంగం కలగనంతవరకు 'ఆహం' శోభిస్తుంది. ఆత్మోన్నతికి, అభ్యుదయానికి చేటు కలిగించే ''అహం' వినాశనాన్నే కలిగిస్తుంది. మనిషికి సమత్వభావనమే శ్రేయస్కరం.
మనిషి జీవితం ఒక తులామానం వంటిదే. ఆ త్రాసులో ఏది ఎంతవరకు సమకూరాలో నిర్ణయించుకొనే వివేకం మనిషిలో ఉండాలి. ఆహాన్ని ఆత్మోన్నతికి, ఆత్మ స్థైర్యానికి, ధైర్యానికి, శౌర్యానికి, వీరత్వానికి ఉపయోగించాలే గాని, అనర్ధానికి దారి తీయకూడదు అనేదే జీవన సారాంశం. అందుకే మనిషి ఆహానికి అటూ ఇటూ ఎలా ఉండాలో తేల్చుకోవాలి.
సేకరణ. మానస సరోవరం
No comments:
Post a Comment