నేటి జీవిత సత్యం.
*కోపం ఎలా ఉండాలి...*
ఎప్పుడూ కోపంతో ఊగిపోయేవాడి దగ్గరకు వెళ్ళడానికి, స్నేహంగా మెలగడానికి, ఆత్మీయతను పంచుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఆయనో ఉన్నతాధికారి అయినా ఉపకారం కూడా చెయ్యగలవాడయినా . కానీ చాలా కోపిష్టి, ఎప్పుడు కోప్పడతాడో తెలియదు. ఎందుకొచ్చిన గొడవ మరో దారి చూసుకుందాం లే అనుకుంటారు.
కట్టుకున్న భార్య కూడా భయపడుతుంటుంది. తోబుట్టువులు, స్నేహితులు కూడా ఆయనతో అంతంత మాత్రంగానే ఉంటారు. అది చాలా ప్రమాదకర లక్షణం.
అగ్ని అంటుకున్న తరువాత మంటపైకి లేస్తుంది. చుట్టూ ఉన్న వస్తువులన్నింటినీ కాల్చేస్తుంది. అప్పుడు నీళ్ళలాగానే ఉంది కదా అని నెయ్యి పోసారనుకోండి. మంట మరింత పెరిగిపోతుంది.
కోపమూ అంతేనండి .. మరి దాన్ని ఎలా అణచాలి. ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకుందాం.
.. పాము ఒంటికి కుబుసం పట్టు కుంటుంది. కుబుసం ఉన్న పాము చాలా కోపంతో ఉంటుంది. సరిగా కళ్లు కనపడవు.అప్పుడు దాని ఒంటికి తొడుగు ఉంటుంది. అది దానికి రక్షణ కలిగిస్తుంది . కానీ పాము దాన్ని ఉంచుకోదు వదిలేస్తుంది. దానిని అదెలా విడిచిపెట్టేస్తుందో అలాగే మనిషి కూడా తనకు వచ్చిన కోపాన్ని ఓర్పుద్వారా పోగొట్టుకోవాలి.
ఉన్నట్టుండి చాలా కోపం వచ్చేసింది. వెంటనే మనం అక్కడి నుండి తప్పుకోవాలి. ఒంటరిగా దూరంగా వెళ్లి మనకు ఎవరి మీద కోపం వచ్చిందో వారిని గురించి సానుకూల ధోరణితో ఆలోచించాలి. కానీ దానికి ఆ క్షణంలో మనసు మొరాయించి తీరుతుంది. ‘ప్రయత్న పూర్వకంగా’ అలవాటు చేసుకోవాలి.. "ఆయనెంత మంచివాడు. ఎన్ని ఉపకారాలు చేశాడు. మనమీద ఎంత ప్రేమ ఉన్నవాడు. మనమంటే ఎంతో ఆప్యాయత ... ఏదో ఒక తప్పు చేశాడు. అంతమాత్రం చేత అంతగా కోప్పడాలా... వద్దు..." అంటూ మీ మనసుకు సర్ది చెప్పుకున్నారనుకోండి. అగ్నిహోత్రం మీద నీళ్లు చల్లినట్లే, ఆ కోపం చప్పున చల్లారిపోతుంది.
కోపం వచ్చినప్పుడు ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూసుకోండి. మీ రూపం మీకే వికారంగా కనబడుతుంది. ఇంత చెడ్డది కదా కోపం, మరి భగవంతుడు కోపాన్ని ఎందుకు సృష్టించినట్లు ? అంటే... కోపం మనిషికి ఉండాల్సిందే. ఎలా ఉండాలి అంటే.. చేతిలో ఒక సాధనంగాఉండాలి. చీకట్లో నడిచి వెడుతున్నారనుకోండి. ఒక కర్రచేత్తో పట్టుకుని వెడతాం. ఎందుకు అంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఆపదను అడ్డుకోవడానికి, ఆత్మ రక్షణకు.. అలాగే... వ్యవస్థలను చక్కదిద్దడం కోసం, అటువంటి తప్పులు మరలా జరగకుండా నివారించడం కోసం కోపాన్ని నటించాలని. ఆ కొద్దిసేపు, అవసరం మేరకు దానిని ధరించాలి. ఆ తరువాత పాము కుబుసాన్ని వదిలి పెట్టినట్టు వదిలేయాలి. ఇక దాని జోలికి వెళ్లకూడదు. అంతకు పూర్వం ఎలా ప్రేమ స్వరూపులుగా ఉన్నారో.. అలాగే అంత ప్రేమగా మెలగాలి
కోపం విషయంలో అందరూ తెలుసుకోవాల్సిన పరమ రహస్యం ఒకటుంది. బాగా కోప్పడిన తరువాత మీరు కోరుకున్న మార్పు శాశ్వతంగా మాత్రం రాదు. అప్పటికి మీ విద్యకు,మీ అధికారానికి లేదా మీ పెద్దరికానికో భయపడో, మీ డబ్బుకు భయపడో ఎదుటివారు ఒకటి రెండు రోజులు మారినట్లు కనిపించ వచ్చు. అది మనసులో వచ్చిన మార్పు కాదు. అదేవిధంగా *కోపానికి విరుగుడు "ప్రేమ"తప్ప మరొకటి లేదనే విషయాన్ని తెలుసుకోవాలి.* దానితో శాశ్వత ప్రయోజనాలను ఎన్నిటినో సాధించగలరు.
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment