Friday, August 26, 2022

సందేహం - సందేశం

 🪴🌾🌴🌿🌵☘️🌳🍃🍂🌱🍀
         *సందేహం-సందేశం*
        ➖️➖️➖️➖️➖️➖️➖️

‘ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కడం లేదు. ఎంతసేపు చెప్పినా నిష్ప్రయోజనంగా ఉంది...’ ఇలాంటి మాటలు తరచూ వినబడుతూ ఉంటాయి. మరి ఇక మార్గం ఏమిటి? బుద్ధభగవానుడు శిష్యులతో ఇలా చెప్పాడు- ‘తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పనిచేయాలి. ఎక్కువ మాట్లాడే వ్యక్తికి క్రమంగా విలువ తగ్గిపోతుంది. మాటలకంటే భావం ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. ప్రతిమాటలో మర్యాద,  సానుభూతి, విశ్వాసం, దృఢత్వం తప్పనిసరిగా ఉండాలి. అఖిల మానవాళికీ బుద్ధుడి సందేశమిది!
దేహమున్నంతకాలం సందేహాలు సామాన్యం. సామాన్యుల కంటే మాన్యులకు ఇవి మరీ ఎక్కువ. అర్జునుడు గొప్ప గురువుల వద్ద విద్యలను అభ్యసించాడు. విద్యానిపుణుడు; మహావీరుడు. తీరా యుద్ధం వచ్చేసరికి అతడికి గొప్ప సందేహం కలిగి ఆయుధాలను అవతల పెట్టేశాడు. ‘ఇంతమంది బంధువులు ఎదురుగా ఉన్నారు. వీళ్ళనందర్నీ చంపి, ఆ రక్తపుకూడు తినడం అవసరమా?’ అని అర్జునుడికి ఆలోచన వచ్చింది. శ్రీకృష్ణభగవానుడు తన గీతోపదేశంతో తిరిగి అర్జునుణ్ని కార్యోన్ముఖుణ్ని గావించాడు. ‘నా కర్తవ్యాన్ని నేను ఆచరిస్తున్నాను. దీనివల్ల సత్ఫలితం కలగవచ్చు, కలగకపోవచ్చు. కలగకపోతే విచారించనవసరం లేదు... సమదృష్టితో ఉండాలి!’ అని కృష్ణుడు బోధించిన తరవాత, అర్జునుడి సందేహం తీరి, మళ్ళా విల్లు పట్టాడు.
విద్యార్థులను వారి పాఠ్యాంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుంది. విద్యార్థులందరూ ఆ సమాధానాన్నే రాయాలి. లేకపోతే ఉత్తీర్ణులు కారు. జీవితం అలా కాదు. ఒకే అంశంపై వివిధ వ్యక్తులు పలురకాలుగా సమాధానాలు చెప్పవచ్చు. వ్యక్తుల అనుభవాన్ని బట్టి, వారి దృష్టిలో తమతమ సమాధానాలు సరైనవే అవుతాయి.
ఒక పుణ్యాత్ముడు అడవిలో ఒక సుందర భవనాన్ని నిర్మించాడు. దానిచుట్టూ మనోహరమైన పూలతోటను వేయించాడు. బాటసారులకు కావలసిన సౌకర్యాలన్నీ అక్కడ ఏర్పాటు గావించాడు. ఆ ధర్మాత్ముడికి తాను చేసిన పని ప్రజల్లో ఎవరెవరికి ఎంతవరకు ఉపయోగ పడుతున్నదా అనే సందేహం వచ్చింది. మారువేషంలో వచ్చి అక్కడ కూర్చుని వారి మాటలను ఆలకించసాగాడు. ఇద్దరు బాటసారులు అక్కడ పడుకొని సేదతీరు తున్నారు. అందులో ఒకడు ధనవంతుడు. అతడు ‘ఈ దాతకు బుద్ధిలేదు! ఈ నిర్జనారణ్యంలో ఇంత పెద్ద నిర్మాణం అవసరమా?’ అన్నాడు. ఆ మాటలు విని దాత మిక్కిలి నిరుత్సాహపడ్డాడు. రెండో బాటసారి పేదవాడు. ‘ఈ అరణ్యంగుండా పోవలసి వచ్చిన మనలాంటి బాటసారులకు ఇదే కదా దిక్కు! ఆ రకంగా ఇది మనలాంటి వారికెంత మేలుచేస్తున్నదో గుర్తుతెచ్చుకో!’ అని బదులిచ్చాడు. ఇంతలో నలుగురు దొంగలు వచ్చి అక్కడ కూర్చున్నారు. తాము దోచుకు వచ్చిన సొమ్మును పంచుకుంటున్నారు. ఒకడు అంటున్నాడు- ‘ఇది మనకు సురక్షిత ప్రదేశం. ఇక్కడికి రక్షకభటులెవరూ రారు!’ వాళ్ల మాటలతో ఆ దాతకు సందేహం తీరింది. సామాన్య ప్రజలకు ఉపయోగపడని దాతృత్వం వ్యర్థమని, పైగా అది చెరుపు చేస్తుందని దుర్వినియోగం అవుతుందని ఆ దాత గ్రహించాడు.
వివేకానందుడికి ‘అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా?’ అని సందేహం కలిగింది. చాలా మందిని అడిగాడు. సరైన సమాధానం రామకృష్ణ పరమహంస మాత్రమే చెప్పగలిగారు. ‘ఆ! ఉన్నాడు! నేను చూశాను! నేను నిన్ను ఇప్పుడు చూస్తున్న దానికంటే ఇంకా స్పష్టంగా చూశాను!’ కావాలంటే నీకుకూడా చూపిస్తాను!’ అన్నాడు పరమహంస. దానితో వివేకానందుడి జీవితమే మారిపోయింది!

🌷💐🌷💐🌷💐🌷💐🌷💐🌷

No comments:

Post a Comment