✍️🌹🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹🌹✍️
*కోరికలను హద్దులో ఉంచేది??*
--డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి
♾♾♾♾♾♾♾️🔘♾️♾♾♾♾♾♾
విద్యకు, జ్ఞానానికి సమానమైన వస్తువు ఈ లోకంలో మరొకటి లేదు. మనం సన్మార్గంలో నడవాలంటే దానికి విద్య, జ్ఞానం రెండూ కావాలి. ఈ రెండూ ఎవరిలో ఉన్నాయో వారిని ఆశ్రయించి వాటిని పొందాలి.
విద్య ద్వారా వ్యక్తి చరిత్ర నిర్మాణం జరుగుతుంది. జ్ఞానం ద్వారా శీలం నిర్మాణమవుతుంది. ఇవి రెండూ ఒకదానిని ఆశ్రయించి మరొకటి ఉంటాయి. మనిషి నడవడికకు, వినయవిధేయతలకు, ఆచార వ్యవహారాలకు ఇవే కారణాలు. ఈ మంచి లక్షణాలున్నవారే బుద్ధిమంతులు. సుస్థిరమైన బుద్ధి కలవాడే బలవంతుడు.
మానవ సమాజం బుద్ధి మంతుల మీదే ఆధారపడి ఉంటుంది. వీరిద్వారా సంపూర్ణమైన మానవతా విలువలతో కూడిన నైతిక సమాజాన్ని నిర్మించుకోవచ్చు.
జ్ఞానం ద్వారా వివేకం కలుగుతుంది. దానివల్ల సత్యాసత్యాల విచక్షణ ఏర్పడుతుంది. అదే అతణ్ని సన్మార్గంలో నడిపిస్తుంది. అజ్ఞానం, అంధకారం తొలగిపోవాలంటే జ్ఞానులను ఆశ్రయించాలి. తనకంటే తక్కువైన వారి సాంగత్యం చేయడం వల్ల లాభమేమీ లేకపోగా, తానే అల్పుడైపోతాడు. తనతో సమానమైనవారితో స్నేహం కూడా విశేష లాభకారి కాదు. కాని తనకంటే శ్రేష్ఠులైన వారిని ఆశ్రయించడం వల్ల స్వయంగా వ్యక్తి విజ్ఞతను పొందుతాడు. అందుకే గుణవంతులు, సాధువులు, మహాత్ములను ఆశ్రయించి ఉండటమే శ్రేయస్కరం. దీనికి నీతిశాస్త్రాల్లో ఒక దృష్టాంతం ఉంది.
ఒక మహాత్ముడు భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి గృహలక్ష్మి భిక్షనిచ్చి చేతులు జోడించి 'మహాత్మా! నాకు జ్ఞానోపదేశం చేయండి' అని ప్రార్ధించింది. అందుకు ఆ సాధువు 'అమ్మా! ఈరోజు కాదు రేపు ఉపదేశం చేస్తాను' అని చెప్పాడు. 'అయితే రేపు మీరు మా ఇంటికే ముందుగా వచ్చి భిక్ష స్వీకరించాలి' అని ఆ ఇల్లాలు కోరింది. అట్లాగేనని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు. తెల్లవారిన తరవాత తన భిక్షాపాత్రలో కొంత చెత్తా చెదారం వేసుకొని ఆ గృహిణి ఇంటిముందు నిలబడి, 'ఓం తత్సత్' అన్నాడు.
సాధువు కోసం ఎదురుచూస్తున్న గృహిణి ప్రత్యేకంగా తయారుచేసిన పరమాన్నాన్ని పాత్రలో వేయబోయింది. అందులో ఉన్న చెత్తను చూసి, అయ్యా! ఇందులో వ్యర్థ పదార్థాలున్నాయని చెప్పింది. 'ఇట్లాంటి మురికిలో పాయసం వేస్తే చెడిపోదా? ఇలా ఇవ్వండి శుభ్రం చేసి తెస్తాను' అని అంది. అందుకు ఆ సాధువు - అమ్మా! దీన్ని శుభ్రం చేసిన తరువాత పాయసం వేస్తే చెడిపోదు కదా! అలాగే, నా ఉపదేశం వినేందుకు, ముందు నీలోని 'చింతలు' అనే చెత్తను, చెడు సంస్కారాలనే పేడను తొలగించుకో. ఆ తరువాత ఙ్ఞానోపదేశమనే అమృతం అందులో వేయవచ్చు. అపుడే బుధ్ధి వికసిస్తుంది. లాభం కలుగుతుంది. ఉపదేశమనే అమృతాన్ని స్వీకరించాలంటే ముందుగా మనసును శుభ్రం చేసుకోవాలి. అందులోని కుసంస్కారాలను విడిచిపెట్టాలి. అప్పుడే జ్ఞానజ్యోతి 'హృదయంలో ప్రకాశిస్తుంది' అని ప్రబోధించాడు.
బుద్ధి నశిస్తే మనిషికి సమస్తం నశిస్తుంది. సమస్త రోగాలకు మూల కారణం బుద్ది నాశనమే. దీనివల్ల శారీరక రోగాలే కాదు. సామాజిక, రాజకీయ, నైతిక, ఆర్థిక, ఆధ్యాత్మికమైన అనేక వ్యాధులు కలుగుతాయి.
శ్రీకృష్ణ భగవానుడు బుద్ధి నాశనమైతే మహావినాశం సంభవిస్తుందని ఉపదేశించాడు. సమస్త జీవన వ్యవహారాలకు బుద్ధి ప్రధానమైంది. జ్ఞానం వల్ల మనసు పవిత్రమవుతుంది. జీవనం సఫలమవుతుంది. సమాజంలో సమగ్ర వికాసం కలుగుతుంది.
మన కోరికలను హద్దులో ఉంచేదే బుద్ధి. మర్యాదలను అతిక్రమించకుండా చూసేదే బుద్ధి. నదులు హద్దు మీరనంత వరకు పైరులు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ఆ నదులే హద్దుమీరితే వరద రూపంలో గ్రామాలను, పట్టణాలను, పాడి పంటలను ముంచేస్తాయి. అందుకే మన శాస్త్రాలు *'అతి సర్వత్ర వర్జయేత్'* అని ఘోషించాయి.
*లోకాస్సమస్తా సుఖినోభవంతు*
*Courtesy* : 'ఈనాడు'
No comments:
Post a Comment