X7. X. 1-3. 281022-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
‘అల్లసాని పెద్దన’ గారి…
ప్రవరాఖ్యుని కథ
➖➖➖✍️
శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర (శ్రీ మార్కండేయ పురాణము) లోని కథ
అరుణాస్పదం అనే పట్టణములో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడుండే వాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పుకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన మాతాపితసేవ అతిథి అభ్యాగతసేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికీ వెళ్ళటానికి కుదిరేది కాదు.
భార్యాపిల్లలను చూసుకోవడం, చెట్లను పశుపక్షాదులను పోషించడం ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళలేకపోయేవాడు. తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు.
ఒక రోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకోని ప్రవరడు “స్వామీ! కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తిలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కాని ప్రతిదినమూ కర్తవ్య నిర్వహణతోనే గడచిపోతున్నది. నేను తీర్థయాత్రలు చేసే ఉపాయము బోధించండి” అని ప్రార్థించాడు.
ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు…
“నాయనా ప్రవరా! మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాలకోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు, నీ కర్తవ్యాలనూ పాటించ వచ్చు. నా వద్ద ఒక పాద లేహ్యమున్నది (పసరు). దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు”.
మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్దనుండి స్వీకరించాడు ప్రవరుడు.
మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకుని అందఱి అవసరాలు తీర్చి, కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగతసేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల లోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు.
ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమా! కోండల కోనలనుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల,సరోవరాల అలల చప్పుళ్ళు, పింఛాలు విప్పి ఆధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు.
ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్న ప్రవరుడు ఊరుచేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేక పోయాడు! మంచునీటిలో పాదలేపనం కరిగి పోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు. “ఓ భగవంతుడా! ఇది ఎక్కడి కర్మపాశం! ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనా రహితముగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను”! నిమిషము కనిపించక పోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతీ సాధ్వి అయిన అర్థాంగినీ తలుచుకుని బాధపడ్డాడు.
“ఆడుతూపాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో? అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో? అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవఱికీ రాకూడదు” అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు.
ఇంతలో వరూధినీ అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠానాలు చేయలేక పోతానేమో అన్న దుఃఖం ఒక వైపు వరూధినీ శృంగారచేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి. “ఇన్నాళ్ళూ నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా”? అని అనుకుని భ్రాంతిచెందాడు.
ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పముతో అగ్నిదేవుని మనసులో తలచి “నేనే కనక నిత్యానుష్ఠాన తత్పరుడనైతే కర్తవ్య పాలనా దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక”! అని అనుకున్న మఱుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు.
కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్ల పాదిని ఆనందపఱచాడు ప్రవరుడు.
ఈ కథలోని నీతులను చూద్దాం....
నిత్యకర్మలను కర్తవ్యాలను మనసా వాచా కర్మణా ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్ఠకు అంతరాయం కలుగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా?
గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్చన మాతాపితసేవ మానవసేవ (అతిథిసేవ) పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము (శాస్త్ర పురాణ పఠనం) విడువకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపినాడు.
ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధినీ ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి. ✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment