అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను..........!!
**
'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే బ్రహ్మను, నేను ఏం చేసిన అది బ్రహ్మాజ్ఞ అంటే కుదరదు!
మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం 'బ్రహ్మమే"! దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం చెబుతుంద. ఇక మరో మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు, నువ్వు కూడా బ్రహ్మవే అని దీని అర్థం.
సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన వాక్యం ఇది. మరో మహత్తర వాక్యం 'అయమాత్మా బ్రహ్మ'. అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం.
అధర్వణవేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ వాక్యం వచ్చింది. ఈ మహత్తర వాక్యాల సారాన్నంతా మళ్లీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పటం జరిగింది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు!ఈ వాక్యాల సారం అర్థమయితే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు-మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన వస్తుంది.
మన అంతరంగంలో అన్వేషిస్తే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే ఏమీ లభించదు .శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు. మరి కొందరు అహంకారులు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు.
ఇంకా కొందరు అహంకారులు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. బ్రహ్మమగు శంకరులు చెప్పిన విషయాన్నిఎవరూ గ్రహించలేక పోయారు! ఈ తత్వసారాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని పూర్తిగా వదలివేయాలి! చాలా మంది అహంకారం, గర్వం ఒకటే అని అనుకుంటారు . గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన ఎక్కువైతే వచ్చేది.
'నేను' కు మూలంలోకి వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు.
' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు.' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. నిర్గుణబ్రహ్మస్థితి కలిగి 'సోహం' మంత్రమును శ్వాస, నిశ్వాసాల ద్వారా నిరంతరము జపించేవారికి ఆత్మతత్త్వము తెలుస్తుందని కొందరి అభిప్రాయం. 'సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతివ్యక్తిలోను వారికి తెలియకుండా ఉఛ్వాసలో 'సో' అని, నిశ్వాసలో 'హం' అని నిత్య సాధన జరుగుతుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అని అంటారు.
పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు
ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మాడు.
పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు. "తానూ, దైవమూ ఒక్కటేనని, అలాంటి ప్రజ్ఞ కలిగినప్పుడు ఆ మనిషి దివ్యాత్మని అనుభవిస్తాడనే " ఆత్మ జ్ఞానాన్ని మహనీయులు కొందరు చెప్పారు..
ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు "అహం బ్రహ్మస్మి" అని !కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి! శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. ఆత్మ నాశనం కానిదని, శస్త్రం ఏదీ ఛేదించలేనిదని , అగ్ని దహించలేనిదని, నీరు తడపలేనిదని, వాయువు ఆర్పలేనిదని అని వివరించాడు.
అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, పరమ చైతన్యం) అని అర్ధం! కాబట్టి ప్రతి ప్రాణి ఆ చైతన్యమే! దేవుడు మనలోనే ఉన్నాడు, మనం దేవుడిలో ఉన్నాం. ఆ దివ్య చైతన్యంలో మనం కూడా భాగం అవ్వటం గురించి సాధన చేయాలి.
ఆత్మ ఒక్కటే. అది పరిమితమైతే అహంకరణం, పరిమితం కానప్పుడు అది అనంతము, సత్యమూనూ అని శ్రీ రమణులు చెప్పారు. ''నేనెవ్వరు?'' అన్న విచారణా మార్గం సాధకులకు తెలియాలి. శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు. శివుడు అవసరమైతే విషం పుచ్చుకుంటాడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చినవాడే, పార్వతిని వివాహమాడి
సంసారి అయ్యాడు.
మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్న తత్వాల ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం. శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు. శివపార్వతుల (దేహత్మల) కలయికే మానవుడు. అంతా నేనే అయినపుడు, ఇతరులను హింసించడమంటే, నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది!
No comments:
Post a Comment