Wednesday, March 22, 2023

హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో ♥️ కథ-257♥ మన ప్రియమైన వారిని కలుసుకునేందుకు మనం అవకాశం కోసం ఎదురు చూస్తున్నామా?

 హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో

♥️ కథ-257♥

మన ప్రియమైన వారిని కలుసుకునేందుకు మనం అవకాశం కోసం ఎదురు చూస్తున్నామా?

సంబంధాల సమయం

SSC వరకు ఒకే పాఠశాలలో చదువుకున్న నలుగురు సన్నిహిత మిత్రుల కథ ఇది.

అప్పట్లో ఆ నగరంలో ఒకే ఒక (లగ్జరీ) విలాసవంతమైన హోటల్ ఉండేది.

SSC పరీక్ష వ్రాసిన తర్వాత, ఆ హోటల్‌ కి వెళ్లి టీ, అల్పాహారం చేద్దామని  నలుగురు స్నేహితులు నిర్ణయించుకున్నారు. ఆ నలుగురూ దానికోసం నలభై రూపాయలు పోగుచేయడానికి చాలా కష్టపడవలసివచ్చింది. ఆదివారం కావడంతో నలుగురూ సైకిల్ ఎక్కి పదిన్నరకి హోటల్ చేరుకున్నారు.

అల్పాహారం, టీ తీసుకుంటూ దినేష్, సంతోష్, మనీష్, ప్రవీణ్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఏప్రిల్ 1న అదే హోటల్‌ లో నలుగురూ కలవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

"అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి. 40 ఏళ్ల తర్వాత ఎంత పురోగతి సాధించాం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది" అని వారు చర్చించుకున్నారు.
ఆ రోజు హోటల్‌ కి చివరగా వచ్చే వ్యక్తి, ఆ రోజు అయిన బిల్లు చెల్లించాలని కూడా నిర్ణయించుకున్నారు.
     
వాళ్ళకి టీ, స్నాక్స్ అందిస్తున్న 'కాలూ', ఒక వెయిటర్ ఇదంతా వింటున్నాడు. 'అప్పటిదాకా ఇక్కడే పనిచేస్తూ వుంటే మీ అందరికోసం నేనూ ఎదురుచూస్తాను', అన్నాడు.

నలుగురూ ఉన్నత విద్యను అభ్యసించడానికి విడిపోయారు.
   
తండ్రి ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళవలసిరావడంతో దినేష్ నగరం విడిచి వెళ్లిపోయాడు, సంతోష్ పై చదువుల కోసం తన మేనమామ వద్దకు వెళ్లాడు, మనీష్,  ప్రవీణ్ ఆ నగరంలోని కళాశాలల్లో అడ్మిషన్ తీసుకున్నారు.

కొంతకాలానికి మనీష్ కూడా ఊరు విడిచి వెళ్లిపోయాడు.
     
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి.
  
నలభై సంవత్సరాలలో, ఆ నగరం సమూలమైన మార్పుకు గురైంది. నగర జనాభా పెరిగింది, రోడ్లు, ఫ్లై ఓవర్లు, మాల్స్, ఇలాంటివి ఆ నగరం యొక్క రూపురేఖలను మార్చేశాయి.

ఇప్పుడు వారి హోటల్‌ ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గా మారింది, వెయిటర్‌ కాలూ ఇప్పుడు ఈ హోటల్‌ యజమాని మిస్టర్‌ కాలూగా మారాడు.
      
నలభై ఏళ్ల తర్వాత, అనుకున్న నిర్ణీత తేదీ ఏప్రిల్ 1 మధ్యాహ్నం, హోటల్ వద్దకు ఒక విలాసవంతమైన కారు వచ్చింది.

దినేష్ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు. అతనికి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూమ్‌ లు ఉన్నాయి.

దినేష్ హోటల్ యజమాని మిస్టర్ కాలూ వద్దకు వెళ్ళాడు, ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు.
 "ప్రవీణ్ సార్ మీ కోసం ఒక నెల క్రితమే టేబుల్ బుక్ చేసారు" అని మిస్టర్ కాలూ చెప్పాడు.

ఆ నలుగురిలో తానే మొదటగా వచ్చాడు కాబట్టి ఆ రోజు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని, బదులుగా తన స్నేహితులనే ఎగతాళి చేయవచ్చని దినేష్ చాలా సంతోషించాడు.

కొద్దిసేపటికి సంతోష్ వచ్చాడు. సంతోష్ నగరంలోనే ఒక పెద్ద బిల్డర్ అయ్యాడు. తన వయసు కంటే కూడా  కొంచెం పెద్దవయసులో ఉన్నవాడిలా కనిపించాడు.

 వారిద్దరూ మాట్లాడుకుంటూ, మిగిలిన ఇద్దరు స్నేహితుల కోసం వేచి ఉన్నారు. మూడో మిత్రుడు మనీష్ కూడా ఇంకో అరగంటలో వచ్చాడు. మాటల్లో మనీష్ ఒక వ్యాపారవేత్త అని ఇద్దరూ తెలుసుకున్నారు.

కాసేపటికి, మిస్టర్ కాలూ వారి వద్దకు వచ్చి, "ప్రవీణ్ సార్ నుండి ఒక సందేశం వచ్చింది. అతను మీ అందరినీ మొదలుపెట్టమని చెప్పాడు, తాను మీతో కలుస్తానని చెప్పమన్నాడు", అని చెప్పాడు.

ముగ్గురూ నలభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం వల్ల సంతోషంలో, గంటల తరబడి నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, సమయం ఇట్టే గడిచిపోయింది. ప్రవీణ్ మాత్రం రాలేదు.
 
"ప్రవీణ్ సార్ ఇంకో మెసేజ్ పంపారు, మీ ముగ్గుర్నీ మెనూలో మీకు ఇష్టమైనవి ఆర్డర్ చేసి తినడం ప్రారంభించామన్నారు" అన్నాడు మిస్టర్ కాలూ.

భోజనం ఆర్డర్ చేసారు కానీ వాళ్ళు తినేసిన తర్వాత కూడా ప్రవీణ్ కనిపించలేదు. ముగ్గురు బిల్లు అడగగా ఆన్‌ లైన్‌ లో బిల్లు చెల్లించబడినది కాలూ చెప్పాడు.

సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో, బరువెక్కిన హృదయంతో హోటల్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు ఓ యువకుడు కారు దిగి వచ్చాడు. ఆ ముగ్గురూ ఆ వ్యక్తిని తదేకంగా చూస్తూ ఉండిపోయారు.

ఆ యువకుడు ఇలా అన్నాడు, "నేను మీ స్నేహితుడి కొడుకు రవిని, మా నాన్న పేరు ప్రవీణ్, ఈ రోజు మీ సమావేశం గురించి నాన్న చెప్పారు, ఆయన ఈ రోజు కోసం చాలా ఎదురుచూసారు, కాని దురదృష్టవశాత్తు తీవ్ర అనారోగ్యంతో క్రిందటి నెలలో మరణించారు ...
నేను తొందరగా వచ్చి ఉంటే విషయం చెప్పి, మీ అందరినీ బాధపెడతానని, నన్ను ఆలస్యంగా వెళ్ళమని నాన్న చెప్పారు.
- “నేను ఈ లోకంలో లేనని తెలిస్తే, నా స్నేహితులు నవ్వరు, ఒకరినొకరు కలుసుకున్నామన్న ఆనందాన్ని కోల్పోతారు.. అది నాకు ఇష్టం లేదు”, అని నాన్న చెప్పారు.

అందుకే ఆలస్యంగా వెళ్ళమని నన్ను ఆదేశించారు. ఆయన తరఫున నన్ను కౌగిలించుకొమ్మని కూడా అడిగారు’, అంటూ రవి కళ్ళ నిండా నీళ్లతో తన రెండు చేతులను చాపాడు.

 ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్న చుట్టుపక్కల వారందరికీ  ఈ యువకుడు బాగా తెలిసినట్లుగా, ఒక పరిచయస్తుడిగా అనిపించాడు.
    
" మా నాన్నగారు ఒక టీచర్‌ అయ్యి నన్ను బాగా చదివించారు.... నేను కలెక్టర్‌ ని అయ్యాను. నేను ఈ నగరానికి కలెక్టర్‌ ని...’’ అన్నాడు రవి.

అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. 

అప్పుడు కాలూ ఇలా అన్నాడు, "ఇప్పుడు ఇది నలభై సంవత్సరాల పార్టీ కాదు, కానీ మనం ప్రతి నెలా మన ఈ హోటల్‌ లో కలుద్దాం, కలిసిన ప్రతిసారీ నా వైపు నుండి ఘనమైన పార్టీ ఉంటుంది....".

మిత్రులారా, మీ ప్రియమైన వారిని కలుసుకుంటూ ఉండండి, ఎవరినైనా కలవడానికి అవకాశం కోసం ఎదురుచూడకండి. విడిపోయే సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం మళ్లీ కలుసుకునే అవకాశం అసలు వస్తుందో లేదో కూడా …

మన జీవిత ప్రయాణం కూడా ఒక రైలు ప్రయాణం వంటిదే. ఎవరి స్టేషన్ వస్తే, ఆ క్షణంలో వారు దిగిపోవాల్సివస్తుంది. కొన్ని అస్పష్టమైన జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోతాయి!

కుటుంబంతో ఉండండి, జీవించి ఉన్నందుకు ఆనందంగా ఉండండి ....

ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే కాకుండా ఇతర రోజులలో కూడా, కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా కూడా మీ ప్రియమైన వారిని కలుసుకుంటూ ఉండండి. మన బాంధవ్యాల వృక్షం ప్రేమ అనే నీటి ద్వారా పోషించబడనివ్వండి, దీని కోసం మనం ఏ కారణం లేకుండా లేదా కలిసే అవకాశం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ప్రియమైన మిత్రులారా, మీరు ఈ కథను చదువుతున్నప్పుడు, ఎవరైనా మీకు గుర్తుకొస్తే, వారితో రెండు నిమిషాలు మాట్లాడండి. 
దానికి మన వద్ద అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా!
♾️
మన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం మనం సమయాన్ని వెచ్చించాలి, జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలి.
దాజీ

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
🙏🙏🙏

No comments:

Post a Comment