మనసు, ఆలోచనలు,
వ్యక్తిత్వ వికాసం, భగవదనుగ్రహం
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినో ర్జున |
ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీచ భరతర్షభ ||
ఆపదలో ఉన్నవారు, భగవంతుడిని అన్వేషంచేవారు, కోరికలు కోరేవారు, జ్ఞానులు అని ఈ నాలుగురకాల తరగతులు చెందిన మనష్యులు సుకృతంచేత నన్ను పూజిస్తారు. వీరందరు ఉత్తములే అయినా జ్ఞాని నాకు ఇష్టుడు, అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పారు.
ఆర్తులు అర్ధార్ధులు - ఆపదలు కోరికలు ఉన్నప్పడే భగవంతుడిని ప్రార్ధించి తరువాత ప్రాపంచికతలో మునిగి పోతారు
జిజ్ఞాసులు భగవంతుడిని అన్వేషించేవారు
జ్ఞానులు భగవంతుడిని అనుభూతి చేసుకున్నవారు.
మొదట అందరు అర్ధార్ధులు అయినా అక్కడతో ఆగిపోకూడదు. భగవంతుడిని అన్వేషంచాలి అనుభూతి చేసుకోవాలి.
దానికి జపతపాదులతోపాటు ఆత్మ పరిశోధన అత్యంత అవసరము. ఆలోచనా పరంపరే మనస్సు అని మన శాస్త్రాలలో చెప్పారు. నది అంటే నీటి ప్రవాహమే, నీరు కలుషితమైతే దానిని శుభ్రపరుస్తాము. అలాగే భగవంతుడిని అనుభూతి చెందాలంటే ఎన్నో జన్మలనుండి కలుషితమైన మనస్సుని శుభ్రపరచాలి.
మన ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి అనేది నూటికి నూరు శాతం నిజం.
ప్రతి ఆలోచనలో రెండు ఇమిడి ఉంటాయి. ఒకటి చూసేనేను, రెండు చూడబడే వస్తువు (subject, object). దీనినే సంస్కృతంలో అహం వృత్తి, ఇదం వృత్తి అంటారు. ఈ రెండిటిలోను బేధము ఉంది అని అనుకోవడంవలననే ఇన్ని బాధలు సమస్యలు వచ్చాయని పెద్దలు చెప్తారు. జిడ్డుకృష్ణమూర్తిగారి ప్రసంగాలన్నీ ఈ రెండిటిమీదే (observer and observed, thinker and thought) ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని మనంచాలా జాగ్రత్తగా గమనించాలి. బయటి వస్తువులు నేను నీతో ఉంటాననికాని నన్ను కొనమని కాని చెప్పవు. మనస్సే వాటిని కావాలనుకుంటుంది. అందకపొేతే క్షోభ పడుతుంది. అందేదాకా మానసిక స్థాయినిబట్టి ఎంతదూరమైనా వెడుతుంది. ఏమైనా చేస్తుంది. అంటే మనస్సే ఆ వస్తువుగా మారిపోతుందని వేదాంతులు చెప్తారు. శాస్త్రాలు వస్తువులని అనుభవించద్దని చెప్పలేదు. న్యాయబద్ధంగా వచ్చినది దానిమీద మమకారం లేకుండా అనుభవించమని చెప్పాయి.
ఆలోచనలని మూడు తరగతులుగా విభజించవచ్చు. ఒకటి అడ్డు అదుపులేకుండా వచ్చే ఆలోచనలు, రెండు వాటి నాణ్యత, మూడు ఆలోచనా విధానం.
అదుపు లేకుండా ఆలోచనలను ఎలా అదుపుచేయాలి?
మనస్సుని ఒక ఉన్నతమైన లక్ష్యం మీద కేంద్రీకృతంచేయడం ద్వారాను, వీటిని నిర్లక్ష్యం చేయడం ద్వారాను అదుపులో పెట్టవచ్చని కొందరు మహాత్ములు చెప్తారు. అలా చేయలేనపుడు మనకి మనమే ఏదైనా అర్ధవంతమైన కల్పించుకుని దానిలో నిమగ్నం అవ్వడం ఒక విధానం.
ఆలోచనల నాణ్యత మన ఆలోచనలని నిరంతరం గమనిస్తూ (గమనించడం అంటే తప్పుఒప్పు అని నిర్ణఇంచకుండా గమనించడం), ఉన్నతమైన విషయాలను మననం చేయడం వలన మెరుగు అవుతుంది.
ఆలోచనావిధానం, సత్ సంఘం వలన, శాస్త్ర పఠనం వలన మారుతుంది.
ఆత్మపరిశోధన చాలా కఠినతరమైనా, వెయ్యిమైళ్ళ ప్రయాణమైనా, ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలాగే మొదలు పెడదాము.
No comments:
Post a Comment