దేవుడు అంటే మొత్తం
వందరూపాయిల నోటుగా ఉన్నప్పుడు అది దైవం.
దానిని చిల్లరగా మార్చేసుకున్నాం - అప్పుడది ప్రపంచం.
అది నోటుగా ఉన్నప్పుడుగాని...
లేదా చిల్లరగా మారినప్పుడుగాని...
"వంద విలువ" మారలేదు.
అనే విషయం గుర్తెఱగడమే జ్ఞానం.
పూర్ణం సదా పూర్ణంగానే ఉంది.
దానికి ఏమైనా చేర్చు, లేదా ఏమైనా తీసివేయి...
అది పూర్ణంగానే ఉంటుంది.
ఆధ్యాత్మికం అనేది లాభనష్టములు లేని వ్యాపారం
అని అంటుంటారు గురువుగారు.
నీవు సాధనా చేయడం వలన లాభమూ లేదు.
చేయకపోవడం వల్ల నష్టమూ లేదు.
ఊరక ఉండగలిగితే ఊరికే ఉండు.
లేకుంటే సాధన చేసుకో.
రెండూ ఒకటే.
లాభమూ లేదు; నష్టమూ లేదు....అని తెలుసుకుని
ఎలా అయినా ఉండు.
ఏమైనా చేసుకో.
ఎవరు ఏది ఏలాగున్నా, ఏమిగా ఉన్నా
వంద వందగానే ఉంటుంది.
పూర్ణం పూర్ణంగానే ఉంటుంది.
పూర్ణాన్ని పూర్ణం చేయనక్కర్లేదు.
అది ఉన్నరీతిన అది ఉంటుంది.
ఆకాశాన్ని ఇంకా విస్తరింపజేయగలమా?
నీటిని ఇంకా పలుచన చేయగలమా?
నీవు పొందేదీ కాదు.
అది పొందబడేదీ కాదు.
పొందేదానికి ఉనికి లేదు.
పొందబడేదానికి అన్యం లేదు.
* * *
ఇక గురువు విషయానికొస్తే-
అతడు విభజన లేని చైతన్యంగా ఉంటాడు.
"నేను ముక్తుణ్ణి" అనే భావన కూడా అతనికి ఉండదు.
అందువల్ల ఇతరులను బంధవిముక్తి చేయాలనే ప్రయత్నమే
అతనికి ఉండదు.
అతడు అచలరూపుడు...
మనం కదిలిస్తే కదులుతాడు...
అతడు మౌనస్వరూపుడు...
మనం పలకరిస్తే పలుకుతాడు...
తప్పితే అతనికి ఏ కర్తవ్యమూ లేదు.
మన ప్రశ్నలకు అతడు సమాధానం ఇవ్వాలనే
విధి కూడా ఏమీలేదు.
ప్రశ్నించేవాడికి ఉనికి లేదు.
సమాధానమిచ్చేవాడికి అన్యం లేదు.
అందుకే పృచ్ఛకుని ప్రశ్న గురువు వద్దకు చేరనే చేరదు.
గురువు సమాధానం పృచ్ఛకుని వద్దకు చేరనే చేరదు.
అందువల్లనే యుగాలపర్యంతం ఈ సమస్య సమస్యగానే ఉండటానికి కారణం.
* * *
ప్రశ్నలు అనేకం.
సమాధానం ఒక్కటే.
అనంతమైనవస్తువును ఎలా పొందటం? ఎలా పోగొట్టుకోవడం? అనేదే ఏకైక సమాధానం.
* * *
కలడంభోధిఁ, గలండు గాలిఁ, గలడాకాశంబునం, గుంభినిం
గల డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ డీశుండు గలండు, తండ్రీ! వెదకంగా నేల నీ యా యెడన్
భగవంతుడైన విష్ణువు లేని చోటు ఈ విశ్వంలో లేదు.
సముద్రంలో ఉన్నాడు...
ఆకాశంలో ఉన్నాడు...
పుడమిపైనున్నాడు...
అగ్నిలో ఉన్నాడు...
అన్ని దిశలలోనూ ఉన్నాడు...
పగటిలో ఉన్నాడు...
సూర్యునిలో ఉన్నాడు...
చంద్రునిలో ఉన్నాడు...
ఓంకారంలో ఉన్నాడు...
త్రిమూర్తులలో ఉన్నాడు...
స్త్రీ, పురుష, నపుంసక వ్యక్తులలో ఉన్నాడు...
ఇక్కడా, అక్కడా, వెతకడం దేనికి?
సర్వేశ్వరుడు అంతటా నిండివున్నాడు.
* * *
ఇందు గల డందు లేడని, సందేహము వలదు,
చక్రి సర్వోపగతుం డెం దెందు వెదకి చూచిన,
నందందే కలడు....
* * *
జగత్తులో భగవంతుణ్ణి వెతకడం మాని,
జగత్తును భగవద్రూపంగా దర్శించడమే
భగవత్సాక్షాత్కారము.
* * *
వంద రూపాయిల మొత్తము "వంద".
అందులో ఏ ఒక్క రూపాయి మాత్రమే వంద కాదు; కాలేదు.
* * *
దేవుడు అంటే మొత్తము.
God is the whole.
* * *
No comments:
Post a Comment