Sunday, March 12, 2023

జ్ఞానం ఉన్న మానవుడు అనేక విషయాలకు భయపడుతూనే ఉంటాడు దీని గురించి తెలుసుకుందాం.

 జ్ఞానం ఉన్న మానవుడు అనేక విషయాలకు భయపడుతూనే ఉంటాడు దీని గురించి తెలుసుకుందాం.

"ఈరోజు అష్టమి, రేపు నవమి, ఆ తర్వాత ఎప్పుడో వచ్చేది చతుర్దశి", అనుకుంటూ లోకంలో జ్యోతిష్యుల వాక్కులను అందరూ భయంతోనో, భక్తితోనో స్వీకరించి అనుసరిస్తుంటారు. అయితే, అన్నింటికీ ప్రమాణమైన శ్రుతులు, 'తత్వమసి' అని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తున్నా, ఒక్కడూ వినిపించుకోడు, విశ్వసించడు. ఇది అద్భుతాల్లో పరమాద్భుతమే అంటారు శంకరులు.

మామూలుగా మనం ఎదుర్కొనే అక్కరలేని, అనవసరపు వేదాంత భయాన్ని 'రజ్జు సర్ప భ్రాంతి' అంటారు. అంటే, చీకట్లో ఒక తాడు వంకరటింకరగా, హఠాత్తుగా కనిపించగానే పామేమోనని భయమేస్తుంటుంది. తీరా చూస్తే అది తాడే. వైరాగ్య భావన ఉంటే, ఇలాంటి వాటికి అవకాశమే లేదంటాడు భర్తృహరి. భయంగల వ్యక్తులు, వారి వారి పనులను సక్రమంగా నిర్వర్తించుకోలేరు. ఏదిఏమైనా, ఇలాంటి భ్రాంతి భయాల కంటే, మనల్ని మానవతా విలువలు కలిగిన వారిగా తీర్చిదిద్దే భయం చాలా అవసరం.
చాలా మంది అనవసరంగా చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు. పాపమో, అన్యాయమో చేస్తే భయపడాలి గానీ, మంచిపనులు చేయడానికి భయమెందుకు? అయితే, ధర్మ భీతి, పాప భీతి, న్యాయ భీతి ఉండడంలో తప్పు లేదు. ధర్మభీతితో పాండవులు 13 యేళ్ళు కష్టాలను ఎదుర్కొన్నారు. ధర్మ విరుద్ధంగా ఏ పని చేసినా, పాప భీతి కలుగుతుంది. పురాణ కథలలో అస్త్రం లేనివాడిని, అలసిపోయిన వాడిని న్యాయభీతితో యుద్ధంలో చంపేవారు కాదు. ఇది మన ఆర్ష సనాతన సంస్కృతి.
భయమనేది అందరికీ సర్వసాధారణం.  'ఆహార నిద్రా భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం' శ్లోకంలో, చెప్పిన నాలుగు అవస్థలు, మనుషులకు పశువులకు సమానంగా ఉంటాయి. అయితే, ఎక్కువ శాతం పశువులు కేవలం భయంతోనే జీవిస్తాయి. కారణం, వాటికి జ్ఙానం లేదు కనుక. జ్ఞానమున్న మానవుడు మాత్రం భయపడదగని అనేక విషయాలకు భయపడుతాడు.
జ్యోతిషంలో శని, రాహువులంటే భయం. ఆ రెండు గ్రహాలు కుజుడు, జాతక చక్రంలో అనుకూలం లేని రాశులలో ఉంటే భయం. అంతెందుకు? నెలలో రెండు సార్లు వచ్చే అష్టమి, నవమి, చతుర్దశులలో, ఏ మంచి పని చేయాలన్నా ఎక్కడి లేని భయం. ఎల్లప్పుడూ మనం కొలిచే శ్రీకృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు, శ్రీరాముడు నవమి నాడు జన్మించాడు, మనమంతా నవమి నాడే రామచంద్రుడి కల్యాణం చేస్తున్నాము. మనలో చాలా మంది, ఈ రెండు తిథులను మంచి పనులకు వర్జిస్తారు. అష్టమి, నవములను కేవలం ప్రయాణానికే నిషిద్ధమంటారు.
అలాగే, అద్వైత వేదాంతంలో నాలుగు మహావాక్యాలున్నాయి. అవి, 1. అయమాత్మా బ్రహ్మ, 2. ప్రజ్ఙానం బ్రహ్మ, 3. తత్వమసి, 4. అహం బ్రహ్మాస్మి. వీటి అర్థం, జీవుడు బ్రహ్మమూ వేరు కాదని రెండు కలసి ఒకే తత్వమని, జీవుడే బ్రహ్మమని బ్రహ్మం, జ్ఞాన స్వరూపమని, నువ్వే బ్రహ్మమని, నేను కేవలం బ్రహ్మమే ఇంకొకటి కాదని పై నాలుగు మహావాక్యాలకు అర్థం చెబుతారు. అందుకని, వీటిని శ్రవణం చేసి, వాటి అర్థాన్ని ఎప్పుడూ మననం చేసుకొని, సర్వాత్మ భావాన్ని మన అనుభవానికి తెచ్చుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం. ఇదే మన జీవితానికి పరమార్థమని విశ్వసించాలి.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment