తపస్సు చేయడం వల్ల కలిగే ఫలితమేంటి?
పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల కలిగే లాభం ఏంటి? అని ప్రతిఒక్కరికి సందేహం రాక తప్పదు.
ఏదో ఓ మంత్రాన్ని ఉపాసిస్తూ, నిరంతర ధ్యానంలో వుండడమే తపస్సు అనుకోవడం చాలా పొరపాటు.
తపస్సు అంటే ‘తపన’. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే ‘తపస్సు. అలా తపించడం వల్ల కచ్చితంగా ప్రయోజనం వుంటుంది. ఎందుకంటే.. మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము ఈ సృష్టిలో దేనికి లేదు.
ఇందుకు ఉదాహరణగా.. ఓ ఆయుధాన్ని చాలాకాలం వాడకుండా ఓ మూల పడేస్తే, అది తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. కానీ దాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి.. దాని పనితనాన్ని చూపిస్తుంది.
అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ అందరికి మరో సందేహం రావచ్చు. ‘మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా!
మరి తపస్సు ఎలా అవుతుంది’ అని ప్రశ్న మదిలో కచ్చితంగా పుట్టుకొస్తుంది. అప్పుడు ఓ విషయాన్ని గ్రహించాల్సి వుంటుంది. ఆలోచించడం వేరు, ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు.
చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే.. ‘తపస్సు’ అంటారు. అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది.
అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు. ఇందుకు ప్రకృతి పరమైన ఆధారం కూడా వుంది. అదే.. సృష్టిలో అందమైన కీటకం ‘సీతాకోకచిలుక’.
తపస్సుకు ప్రకృతి పరమైన ఆధారం :
సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. కానీ.. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రాకపోగా గొంగళిపురుగులు వస్తాయి. అవి చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.
ఆ దశలో అది రాళ్ళలో, రప్పల్లో, తిరుగుతూ… ఆకులు తింటూ కాలం గడుపుతుది. కొంత కాలం గడిచాక తన జీవితం మీద రోత కలిగి… ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి వెళ్లిపోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది.
అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. అప్పుడది గొంగళిపురుగులా కాకుండా అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. ఆకులు, అలములు తినకుండా. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది.
ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోకుండా భగవన్నామామృత పానంతో తరిస్తాడు...
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు.
తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.
కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు.
చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.
ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు.
"అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.
"ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ,
నేను జరగనిచ్చిందీ కాదు.
ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ.
యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు.కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు.
అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు.
మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం.....
.
No comments:
Post a Comment