ఈ మూడింటి విశిష్ఠతను అర్ధము చేసుకొని తదనుగుణంగా సాధనచేయువాడు ఆత్మజ్ఞానమును పొందగలడు.
సులువుగా చెప్పాలంటే మనుజులు ఆత్మజ్ఞానం పొందుటకు మధ్వాచార్యులంత భక్తి భావం,
రామానుజాచార్యులంత నిష్కామకర్మభావం,
శంకరాచార్యులంత జ్ఞానభావం కలిగుండాలి.
గీతలో శ్రీకృష్ణపరమాత్మ, ఓ పార్థా! ఎవరు నాకు ఇష్టమైన కర్మలు నిష్కామముతో చేయుదురో (కర్మయోగము), నిత్యము నన్నే ధ్యానించుదురో (ధ్యానయోగము), నాయందు అనన్యమైన భక్తి కలిగియుండెదరో (భక్తియోగము), దృశ్య వస్తువులందు బంధము పెంచుకొనక జ్ఞానవంతులై వుండెదరో (జ్ఞానయోగము) అట్టివారు నన్ను పొందెదరు. అంతేకాదు, ఎవరైతే మూర్ఖత్వముతో కర్మేంద్రియాలను బంధించి, ఇంద్రియ విషయాలను మనస్సుతో ఆలోచిస్తారో వారు మిధ్యాచారులు. వారు స్వయంగా నష్టపోవడమే గాక, ఇతరులకు ఏ మాత్రమూ వుపయోగపడరు. వారు నన్ను పొందడము సాధ్యం కాదు. ఇది యదార్ధమని వివిధ సందర్భాల్లో తెలియజేశాడు.
ఇచ్చట కర్మ చేయడంగాని, చేయకపోవడంగాని
ముఖ్యంకాదు. మనస్సునందు మాలిన్యము అంతరించడమే ప్రధానము. వాటిని మనసా, వాచా, కర్మణా తొలగించకుండా ఒంటరిగా జనసంద్రమునకు దూరంగా పోయి తపమాచరించుట వలన ఉపయోగముండదు. అలాగే ఈ వాసనల నుండీ ముక్తుడైనవాడు జనసంద్రమున నున్నప్పటికీ
కూడా మోక్షమును పొందగలడు.
ఇదంత సులభం కాదు. మొదటి మెట్టుగా మానవులు
దుష్కర్మనుండి (చెడ్డ పనులు) సత్కర్మకు (మంచి పనులు) మారాలి, అందుకోసం భగవతార్పణ బుద్ధితో కర్మలనాచరించాలని బోధించింది. ఎందుకంటే ఏదైనా భగవంతునికి అర్పించేటప్పుడు జాగ్రత్తగా ఉంటాము కాబట్టి. ఇలా చేయడంవలన మానవులు చేయు దుష్కర్మలు కొన్నాళ్ళకు సత్కర్మలుగా మారతాయి. సత్కర్మల వలన శాంతి కలుగుతుంది
పిమ్మట సత్కర్మనుండి నిష్కామకర్మకు (ఎటువంటి
ఫలితం ఆశించకుండా చేసే సుకర్మలు) మారే ప్రయత్నము చేయాలి. దీనివలన చిత్తశుద్ధి కలిగి త్వరలోనే జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానంతో మోక్షము లభిస్తుంది...
చూడటానికి జ్ఞాని, అజ్ఞాని చేయుకర్మలు ఒకేలా
వుంటాయి. అజ్ఞాని, నేను చేస్తున్నానని భావిస్తూ (కర్తృత్యము) ఫలితముల యందు ఆసక్తితో కర్మలను ఆచరిస్తూ, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. కర్మఫలితాలతో బంధము ఏర్పడుతుంది.
జ్ఞాని, ఆత్మస్థితి యందుండి, ఎటువంటి ఫలితములను ఆశింపకా దైవబుద్ధితో కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానము పొంది బంధాలనుండి విముక్తి పొందుతాడు.
ఈ కర్తృత్యమును మానవుడు అనవసరంగా తన
నెత్తినవేసుకొని బాధపడుతున్నాడు. తను తెచ్చింది లేదు, వెంట తీసుకుపోతున్నది లేదు! తానూ పుట్టక మునుపు, మరణము పిమ్మట ఇదంతా ఎవరిదో? అది ఎవరో తెలుసుకొనుటకు సాధనచేయాలి! అప్పుడు బ్రహ్మాండమును నడుపువాడు దైవమని తెలుస్తుంది.
అతడినే పరమాత్మ అన్నారు విజ్ఞులు. అతని ప్రమేయంతోనే విశ్వముదయించిది. అతని అంశయే ఈ చరాచర జగత్తు. మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు. మనతో పనులు చేయుంచునదియు అతడే. అతడే సూత్రధారి. అనంత కాలమును, అనంత సృష్టిని అతడే నడుపుతున్నాడు. ఇక డబై, ఎనభై యేళ్లు జీవించే మానవుడు తానె అంతా చేస్తున్నానని అనుకోవడము హాస్యాస్పదము.
కావునా “నా ఆత్మయే నీవు”, “నాచే చేయిస్తున్నది నీవు” అన్న సంకల్పంతో కర్మలుచెయ్యాలని గీత సూచించింది. ఎవరి కర్మ శుద్ధముగా, పాపరహితముగా వుంటుందో అతడు ఎవరికీ భయపడ నవసరంలేదు. అందుకే మానవుడు ముందుగా నమస్కరించవలసినది కర్మకే (తస్మై నమః కర్మణే).
అయితే, బలవంతముగా మానవునిచేత కర్మలను
చేయించేది ఏది? అన్న సంశయం కలుగుతుంది! కామమే (కోరికలు) మనుజులచేత బలవంతంగా కర్మలను చేయిస్తుంది. కామము తీరకపోతే క్రోధంగా(కోపంగా) మారుతుంది.
కామాన్నే క్రోధమని చెప్పవచ్చు. ఇదే మానవునికి మహాశత్రువు, మహాపాపకారి. ధూళి అద్దమును కప్పేసినటులు కోపము మనుజుని జ్ఞానాన్ని కమ్మేస్తుంది. కామానికి ఆధారములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇంద్రియముల కంటే బలీయమైనది మనస్సు. మనస్సు కంటే అత్యంత బలమైనది
బుద్ధి.
అంటే, ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకొని, బుద్ధితో ఆత్మను కనుగొని, జ్ఞానంతో పరమాత్మను చేరుకోవాలన్న మాట! ఎందుచేతనంటే మానవుడు ఏ యుగంలో పుట్టినప్పటికీ తనలో యున్న ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యొక్క వికారములు మారలేదు. వీటి వికారముల వలన తనలో నున్న అఖండమైన ఆత్మశక్తిని కనుగొనలేక వివిధ కర్మలు చేస్తూ వాటి ఫలములు పొందుతూ, సుఖదుఃఖములను అనుభవిస్తూ, తుదకు మరణించి మరల జన్మించి ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ జన్మకర్మల తత్వమును పూర్తిగా అర్ధంచేసుకుని తదనుగుణంగా జీవించువాడు మరణానంతరము తిరిగి జన్మనెత్తడు..🙏
No comments:
Post a Comment