Sunday, March 12, 2023

అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు...

 ఒక అడవిలో ఒక అందమైన కుందేలు అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. 

తన స్నేహితులను చూసుకుని ఎంతో గర్వపడేది. ఒకరోజు కొన్ని వేటకుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది.

వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరుగెత్తి ‘‘మిత్రమా! కొన్ని వేటకుక్కలు ఇటు వైపే వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి’’ అని అడిగింది కుందేలు.

‘‘నిజమే! చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ఎలుగుబంటిని అడుగు’’ అని చెప్పింది దుప్పి.

కుందేలు  అక్కడి నుండి ఎలుగుబంటి దగ్గరకు పరిగెత్తి. ‘‘నేస్తం! నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేటకుక్కలు నా వెంటబడ్డాయి. వాటిని తరిమేసి నన్ను కాపాడు’’ అని ప్రాధేయపడింది. ‘‘నన్ను క్షమించు. నేనిప్పుడు చాలా అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఆహారం వెతుక్కోవాలి. నీకు సహాయం చేయలేను’’ అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఎలుగుబంటి.

కుందేలు ...  కోతి దగ్గరకు వెళ్ళి అడిగింది. ‘‘అమ్మో  నేనా? ఆ కుక్కలు నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను రాను’’ అంది కోతి.

ఏనుగు, పొట్టేలు, జింక ఇలా బుల్లి కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు.  

వేటకుక్కల బారినుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది.

కాసేపటికి వేటకుక్కలు అటువైపు వచ్చి అది  దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనేం, వాటి బారి నుంచి తన ప్రాణాలు కాపాడుకుంది.

ఆ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. "తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నo చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని  తెలుసుకుంది."

మన శక్తిని మనం గుర్తించాలి. అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు... 
                   🙏 ఓం నమః శివాయ 🙏

No comments:

Post a Comment