నిత్యసత్సంగం
జ్ఞానికి ఈ ప్రపంచం ఓ మట్టిబొమ్మ...అంతే.
మట్టి అనేది జ్ఞాపకం ఉండి, బొమ్మతో ఆడుకునేవాడు ఆధ్యాత్మికుడు.
మట్టి అనేది మరచి, బొమ్మతో ఆడుకునేవాడు లౌకికుడు.
ఇద్దరిదీ ఆటే.
ఒకని ఆటలో సంఘర్షణ ఉంటుంది.
ఇంకొకని ఆటలో సంఘర్షణ ఉండదు.
* * *
దశరధుని సభలో రామ-వశిష్ఠ సంవాదం జరుగతోందని తెలిసి
ఆకాశమార్గం గుండా అనేకమంది దేవతలు, సిద్ధులు హాజరైనారని వాశిష్ఠంలో ఉంది. కారణమిదే.
స్వతహాగా వారందరూ పరిపూర్ణజ్ఞానులే ఐనప్పటికీ
ఆ సంవాదం వారి ఆత్మనిష్ఠను మరింతగా బలపరచి
స్వరూపస్థితి నుండి జారనీయకుండా చేస్తుంది.
ఈ జగత్తొక బొమ్మలాట అని మరపుకు రానీయకుండా చేస్తుంది.
కాబట్టి నిత్యసత్సంగం అనేది సాధకులకేగాదు, సిద్ధులకు కూడా అవసరమే అనేది తేటతెల్లము.
* * *
ఒకసారి ఆ "స్థితి"ని చేరుకున్నాక, మళ్లీ జారే అవకాశం ఉందా? అని అడిగారొకరు భగవాన్ను.
"ఉంది" అని సమాధానమిచ్చారు భగవాను.
కాబట్టి ఆ స్థితికి చేరడానికి ప్రయత్నించే సాధకులకు... ఆ స్థితి నుండి జారకుండా ఉండటానికిగాను సిద్ధులకు...
ఇరువురికి కూడా నిత్యసత్సంగం అవసరం.
శుద్ధపరబ్రహ్మం తప్పితే మరో పదార్థం ప్రపంచంలో లేదు.
కనుక, చెట్లుగా, పుట్టలుగా, కనిపించే నానా రకాల ప్రాపంచిక పదార్థాలు కూడా పరమాత్మ యొక్క రూపాంతరాలే అన్న భావన నిరంతరం కొనసాగడమే నిత్యసత్సంగం.
తచ్చింతనం తఛ్రవణ
మన్యోన్యం తత్ప్రబోధనం |
ఏతదేక పర్వతం చ
బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః ||
దానినే ఆలోచించడం, దాన్ని గురించే వినడం, ఒకరినొకరు అదే చెప్పుకోవడం, ఎప్పుడు చూసినా అదే ఆసక్తి... ఈ బ్రహ్మాభ్యాసమే నిత్యసత్సంగం.
(నామరూపములు కలిగిన) తాను
(నామరూపములు లేని) తనతో గడపడమే నిత్యసత్సంగం.
అనగా నామరూపాలను కాక,
"కేవల ఉనికి"ని చూడడమే నిత్యసత్సంగం.
కర్త ఈశ్వరుడని
కర్మ జడమని
క్రియ క్రీడయని
ఎఱిగిన కర్మయోగి యొక్క దినచర్య నిత్యసత్సంగం.
సమాధానం దొరికే వరకు రాముడువశిష్ఠునితో సలిపిన సంభాషణం నిత్యసత్సంగం.
భక్తుడు భగవంతుని యెడల యెడతెగని భావపరంపరయే నిత్యసత్సంగం.
ద్రష్టనే తప్ప దృశ్యాన్ని చూడని సద్గురు అర్థనిమీలిత నేత్రాలను స్మరించడం నిత్యసత్సంగం.
నీవు సత్సంగంలో ఉండడం కాదు,
నీవు ఎక్కడ ఉంటే, ఆ చోట సత్సంగం కావాలి....
అన్నారు గురుదేవులు.
* * *
No comments:
Post a Comment