Wednesday, May 24, 2023

మనమున్న చోటు కూడా పుణ్యక్షేత్రమే

 మనమున్న చోటు కూడా పుణ్యక్షేత్రమే

సాధన ఏం చేయాలి...?
అని తరచూ పృచ్ఛకులు అడిగే ప్రశ్నకు...
రమణులు ఇచ్చిన బ్రహ్మాస్త్రం లాంటి ఉపదేశం-

"నిన్ను నీవు విడవకుండా ఉండు...."

అనే మాట నన్ను విడవకుండా ఉందికాబట్టే-
నేను ఉన్న చోటే...నేను అన్న చోటే...
అదే అత్యాశ్రమమై...ప్రశాంతంగా...ఆనందంగా ఉన్న నేను...

"మాతో గురువాయూర్ కు రా మావా...!"
అన్న మా మరదలు కోరికపై...వారి కుటుంబంతో కలిసి...
గురువాయూరుకు బయలుదేరాల్సి వచ్చింది...

* * *

భవానీశ్వరిని చూశాను...
కాలడిశంకర జన్మస్థానాన్ని చూశాను...
గురువాయూరప్పను చూశాను...
అనంతపద్మనాభుణ్ణి చూశాను...
కన్యాకుమారిని చూశాను...
భారతీయభవితవ్యం కోసం... 
వివేకానంద చేసిన సంకల్పానికి సాక్ష్యంగా నిలచిన...
'వివేకానంద రాక్' ను చూశాను...

* * *
మా గురువుగారనేవారు-
ఇన్ని గొప్ప క్షేత్రాలను మోస్తోంది భూమి...అది ఇంకెంత గొప్పది!
మన కాళ్లక్రింద ఉండేది కూడా ఆ భూమే... మనమున్న చోటు కూడా పుణ్యక్షేత్రమే...అని అన్నారు.

* * *

ఎక్కడైనా-
"ఇప్పుడు-ఇక్కడ- ఇలాగు..."
అనే సద్గురు సూక్తి గుర్తుకొస్తోంది...

ఎవరి దర్శనం చేసుకున్నా-
"ద్రష్ట లేక దర్శనం సున్నా..."
అనే రమణుని సూక్తి గుర్తుకువస్తోంది...

ఏ ప్రదేశానికి వెళ్లినా-
"అవే గోడలు, అవే చెట్లు..."
అనే యోగిరాజారాం సూక్తి గుర్తుకువస్తోంది...

నపుంసకునికి కామశాస్త్రంతో పనిలేనట్లు...
తనలో తాను రమించేవానికి యాత్రలతో పనిలేదు అనిపించింది...

నా అంగట్లో కూర్చున్నట్టే... 
కార్లోనూ కూర్చున్నాను...
"ఉండటం" ఎక్కడైనా "ఉండటమే"గా...
దృశ్యం మారుతుంటుందే గాని ద్రష్ట మారడుగా...

దృశ్యంలో భాగంగా ఉండడం - లౌకికం.
ద్రష్టగా ఉండడం - ఆధ్యాత్మికం.

దృశ్యం - లీల.
ద్రష్ట - నిత్యం.

లీల క్రీడగా అనిపిస్తే దృశ్యంలో ఉండు.
లీల గోలగా అనిపిస్తే ద్రష్టగా ఉండు.

లీలలో- 
ద్వంద్వాలు త్రిపుటాలు తగులుకొని వుంటాయి...

నిత్యంలో- 
ద్వంద్వాలు త్రిపుటులు విడివడి వుంటాయి...

వెలుపల - లీల.
లోపల - నిత్యం.

మెలకువ - లీల.
గాఢనిద్ర - నిత్యం.

* * *

పిల్లలకు మనం చాక్లెట్ ఇచ్చి సంతోషపెట్టినట్టు...
మనమూ సంతోషిస్తున్నట్టు...
వ్యాసం వ్రాస్తూ ఉండగా...
జ్ఞానాంబ ఒకరి ద్వారా నాకు దక్షిణ పంపి నన్ను సంతోషపెట్టింది...
మరి నేనూ (జ్ఞాన)శిశువునే కదా!

మా జ్ఞానాంబ శివుని భార్య కాదు...
మా జ్ఞానాంబ శివునికి కూడా అమ్మే...
మా జ్ఞానాంబ పరబ్రహ్మస్వరూపం...

జ్ఞానం - జ్ఞానప్రసూనాంబ(పార్వతి)
మౌనం - దక్షిణామూర్తి(శివుడు)

జ్ఞానాంబను అమ్మా...! అని సంబోధించడమేకాదు,
ఒక్కోసారి ప్రేమ మితిమీరినప్పుడు-
ఒసే పిచ్చిమాలోకం...! అని...సంబోధించడం కూడా కద్దు.

అంతగా తన ఇష్టదైవాన్ని స్వంతం చేసుకున్నప్పుడే
ఉపాసన ఫలించేది...

భక్తి అనేది ప్రయత్నపూర్వకంగా 
ఎవడికివాడు పండించుకుని తినవలసిన పంట లాంటిది.

జ్ఞానం అనేది అప్రయత్నంగా 
చెట్టు నుండి రాలి నీ చేతిలో పడే పండు లాంటిది. 

భక్తిని మనం పొందాలి.
జ్ఞానం మనల్ని పొందుతుంది.

భక్తి అనేది రసాత్మకం...చలిస్తుంటుంది...
జ్ఞానం అనేది శిలాత్మకం...అచలంగా ఉంటుంది...

* * *

యాత్రకెళితే పాత్రకొనాలి...అంటారు.
నేను మాత్రం-
ముందుగా 'బాబు' అనే పాత్రను ఎన్ను'కొన్నాకే'
'నా' ఇహలోకయాత్ర మొదలయ్యింది...

* * *

ఇహలోకం ఎలా ఉంది? అని ప్రశ్నించింది 
మా సోదరి...

నేను అన్నాను-

ఉండేది ఒక లోకమే....        
ఒకడికి అదే ఇహలోకంగా ఉంటుంది.  
మరొకడికి అదే పరలోకంగా ఉంటుంది...అని.

"నేను"గా ఉంటే పరలోకం...
"బాబు"గా ఉంటే ఇహలోకం...
అర్థమైందా పిచ్చిమాలోకం...?

 * * *

No comments:

Post a Comment