అమ్మకు వందనం
అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ,గౌరవం ఉంటాయి.అమ్మ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఒకే రకమైన భావన వ్యక్తం చేస్తారు.అయితే ప్రపంచీకరణ పేగు బంధాన్ని దూరం చేస్తుంది.అలాగనీ కొత్త తరాన్ని పూర్తిగా నిందించలేము.తాము చదువుకున్న చదువుకు తాను నివసించే ప్రాంతంలో సరైన అవకాశాలు లభించనప్పుడు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళతారు. అవసరమైతే విదేశాలకు వెళతారు.మానవ జీవన గమనంలో ఇది ఒక ప్రక్రియ.
బంధాలు దూరమయినప్పుడే దినోత్సవాల ఆవశ్యకత తెలుస్తుంది. ఓ ఇరవై ఏళ్ళ క్రితం వరకు మన దేశంలో మాతృ దినోత్సవం యొక్క అవసరం పెద్దగా రాలేదు.ఇప్పటికీ మన దగ్గర చాలా కుటుంబాలలో పిల్లలు 15 నుంచి 20 ఏళ్ల వరకు తల్లి తండ్రుల వద్దే పెరుగుతుంటారు.
ఎక్కడైనా తల్లిదండ్రులను గౌరవించాల్సిదే. ఎందుకంటే వారి
ప్రేమను వివరించలేము. త్యాగానికి చిరునామా అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు. నవమాసాలు మోసి కష్ట పడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తయితే... రెక్కలు ముక్కలు చేసుకుని సరైన దారిలో పెట్టి ఎంతో కష్ట పడేది అమ్మ. ఇలా మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారకురాలైన అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా తక్కువే అవుతుంది.ప్రతి ఏటా మే రెండవ ఆదివారం మాతృ దినోత్సవం జరుపుతారు.
గ్రీస్ దేశంలో ‘రియా' అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్'గా భావించి సంవత్సరానికి ఒకసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో బ్రిటన్లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్ సండే' పేరిట ఉత్సవాన్ని నిర్వహించేవారు. ‘జూలియవర్డ్ హోవే' అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది.
మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు అన్న మేరీ జర్విస్ అనే మహిళ ఎంతో కృషి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంత గానో ప్రచారం చేయడం జరిగింది.
అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. అధికారికంగా 1914 నుంచి దీనిని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి కూడా మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
కాలానుగుణంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోయి చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి.సంప్రదాయ వృత్తుల స్థానంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరిగింది.ఇందుకు ఆధునిక విద్య అవసరం అయింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు కోసం వలసలు పెరిగాయి. అందువల్ల గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలను అక్కడ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి.స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలి.వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి. మేధో వలసని ఆపాలి.విద్య,వైద్యం లో నాణ్యత పెంచాలి. అప్పుడే బంధం ఒక సామాజిక సమస్య అవకుండా ఉంటుంది.
యం. రాం ప్రదీప్
తిరువూరు
9492712836
No comments:
Post a Comment