'రంగమార్తాండ' సినిమా సాయంత్రం అమెజాన్ ప్రైమ లో చూసాం. మీరంతా కూడా చూసారనే అనుకుంటా. సినిమా ఎలా ఉంది అనేకంటే తల్లిదండ్రులు కు ఒక అంకుశం లాంటి సందేశం చెప్పాడు. ఇవి అందరిళ్ళలో సహజంగా జరిగేవే ఐనా సినిమా ద్వారా చెప్పిన సందేశం పెద్దలు తప్పక అన్వయించుకోవాలని నా ఉద్దేశం.
ఇక రివ్యూ విషయానికి వస్తే పిల్లల దగ్గర ఉండేటప్పుడు కొన్ని విషయాలు అవి చేదు అని నేననను కానీ అవి అర్థం చేసుకొని జీర్ణించుకుంటే తల్లిదండ్రులు జీవితం సాఫీగా సాగిపోతుంది.
పిల్లలు కొడుకులైనా కూతుర్లైనా పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ రూట్ వేరే ఉంటుంది. వాళ్ళ ప్రాధాన్యాలు, ఉద్యోగాలు, విందులు వినోదాలు, వాళ్ళ పిల్లల పెంపకాలు వేరే ఉంటాయి. వాటిలో మన ప్రమేయం ఎంత పరిమితిగా ఉంటే అంత మనకి సుఖం. మన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, మన ఆస్తిపాస్తులు వాళ్ళకి తృణప్రాయం. మనల్ని ఆదరంగా చూస్తుంటే అదే పదివేలు. వాళ్ళ భాగస్వాముల దగ్గర వాళ్ళకి కొన్ని మొహమాటాలు ఉంటాయి. అవి మనం గుర్తెరిగి మసలుకోవాలి.
ఈ సినిమాలో తల్లితండ్రులు కొడుకు, కోడలు వల్ల ఇమడలేక వేరే ఉండ వలసి వచ్చినప్పుడు కూతురు చేరదీస్తుంది. అది బాగానే చూపించాడు కానీ ఒక సందర్భంలో కూతురు కూడా తండ్రి కి దొంగతనం అంటగడుతుంది. తరువాత నిజం తెలుసుకొని క్షమాపణ అడుగుతుంది కానీ అప్పటికి పరిస్థితి చేయ్యిదాటి పోతుంది.
కోడలు సూటిపోటి మాటలంటే కూతురు ఐతే డైరెక్ట్ గా మొహం మీద అనేస్తుంది. తల్లిదండ్రులు లంటే ఒక విధమైన చులకన భావం ఉంటుంది. మీరు ఊరుకోండి మీకేమీ తెలియదు లాంటి మాటలు కూడా వినవలసి వస్తుంది.
చివరిగా ఏతావాతా అర్థమైందేమిటంటే కడుపున పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు పానకంలో పుడకల్లా అనిపిస్తారని నాకర్థమైంది.
కాబట్టి తల్లిదండ్రులు ఎంత ఒబ్బిడిగా పిల్లలతో మసలుకుంటే వారి శేష జీవితం అంత సుఖమయం అవుతుంది.
చిట్టచివరి గా ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే పెద్దల తదనంతరమే రాయాలి అంటాడు దర్శకుడు. నాకా విషయం నా మధ్య వయసులో నే ఒక కొలీగ్ జీవితం ద్వారా అవగతమైంది.
ఇదీ సినిమా రివ్యూ. మీలో ఎవరైనా చూడకపోతే చూడండి.
No comments:
Post a Comment