స్వామీ... నిను తలంచి.... ఈ గుప్పెడు మెతుకులు
వరి కంకులు కన్నీరు కార్చడం చూసారా ఎప్పుడేనా..! గోధుమ గింజ గుండె కొట్టుకోవడం విన్నారా ఏనాడైనా...! నూర్పిళ్ల నవ్వులు నిలిచిపోవడం కంట పడిందా ఒక్కనాడైనా...! పొడుగ్గా, చిక్కి శల్యమై నేల చూపులు చూస్తున్న ఆనాటి సంప్రదాయ వంగడాలకు కండ పట్టించిందెవరో గుప్పెడన్నం తినే ముందైనా జ్ఞప్తికి వచ్చిందా. బిడ్డకి అన్నం పెట్టిన తల్లిని చూసారు కదా.... దేశానికి అన్నం పెట్టిన తండ్రిని కాంచారా కలలోనైనా. దేశం మనకేమిచ్చిందని కాదు... మనం దేశానికి ఏమిచ్చాం అనే దొంగ దేశభక్తి కబుర్లలో పడి బతుకులిడ్చేస్తున్న వాళ్లం కదా. ఇవేవీ కనిపించే అవకాశం లేదు. " రైస్ ట్రీస్ ఎలా ఉంటాయి డాడీ"... "షుగర్ ఏ ఫ్లవర్ నుంచి వస్తుంది మమ్మీ" అని ముద్దుగా అడుగుతున్న పిల్లల ముందు సగం కాలిన దేహాల్లా తచ్చాడవుతున్నాం కదా. మనకే తెలియని ఆ స్వామినాథన్ గురించి పిల్లలకేం చెబుతాం. వ్యవసాయం దండగన్న దోమల స్నేహితుడి గురించే నేటి చర్చంతా.
విదేశాల భోజనం తయార్ బోర్డుల ముందు చేతులు కట్టుకున్న ఆనాటి దేశం మా భోజనం మీ కోసం అంటూ గోనె సంచుల్లో కీర్తిని నింపుతోందంటే ఆ స్వామినాథన్‌దే కదా పుణ్యమంతా.
" బిక్షాందేహి కృపావలంబనకరీ" అన్న అన్నపూర్ణ స్తోత్రంలో అన్నపూర్ణేశ్వరి అనే పదం బదులుగా స్వామినాథన్ అనే పదాన్ని చేర్చాలనిపిస్తుంది నాకైతే. "సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే" అన్న ఆరుద్ర ఈ స్వామినాథన్ గురించే ఇలా రాసేరేమో అని కూడా అనిపిస్తుంది ఆ పాట విన్నప్పుడల్లా. నూటికి డబ్భై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో పుట్టిన వ్యవసాయ విప్లవకారుడు స్వామినాథన్. పదొమ్మిదేళ్ల ప్రాయంలో దేశం జీర్ణాశయంలో జెర్రి పిల్లల్ని పెట్టడం చూసాడాయన. కరవుకు అమెరికా నుంచి అరువు తెచ్చుకుంటున్న
గోధుమలకు దేశమే పుట్టినిల్లుగా మార్చింది స్వామినాథనే కదా. దేశ వ్యవసాయానికి కొత్త వంగడాలను కూర్చిపెట్టింది దేశం మీద ఈయనకున్న "స్వామి"భక్తే కదా. ఒక్కసారే కలిసాను. ఆ ఒక్కసారే చూసాను. నా వచ్చీ రాని ఇంగ్లీషులో ఆ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఒక్కసారంటే ఒక్కసారే మాట్లాడాను. నా జర్నలిస్టు వృత్తి నాకు ఇచ్చిన అపురూప అవకాశం అది. భూమి మట్టి రంగు కోటు తొడుక్కున్నట్లుగా ఉన్నారాయన. మొలకెత్తుతున్న కంకు నుంచి వస్తున్న లేత పాల నవ్వు. రిపోర్టర్‌గా అడుగుతున్న నా తెలుగు ప్రశ్నలకు ది హిందూ రెసిడెంట్ ఎడిటర్‌గా పదవీ విరమణ చేసిన ఆనాటి సీనియర్ రిపోర్టర్ నగేష్ ఇంగ్లీషులో అనువదిస్తుంటే నా వైపే చూస్తూ సమాధానాలు ఇస్తున్న ఆ స్వామి నాథన్ కళ్లు దేశ సేద్యానికి వాడుతున్న నాగళ్లలా కనిపించాయి. ఇప్పుడంటే ఓట్ల మాయాజాలంలో రైతు భరోసా, పెట్టుబడి పథకం వచ్చాయి కాని దిగువ, మధ్య తరగతి రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ నష్టనిధిని ఏర్పాటు చేయాలంటూ సూచించింది స్వామినాథనే. రాజకీయుడు కాదుగా... అందుకే పొద్దున్నే భుజాన నాగలి వేసుకుని పొలానికి వెళ్లే ప్రతి రైతు స్వామి నాథన్ కళ్లకు శిలువ మోస్తున్న జీసస్ క్రీస్తులాగే కనిపించాడు. రైతుల ఆత్మహత్యలన్నీ హత్యలే అని గ్రహించిన పెద్ద రైతు కదా అందుకే భూమి విలువతో పాటు కౌలు రౌక్కం, పొలం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయిని లెక్క కట్టి దానికి 50 శాతం ఎక్కువ గిట్టుబాటు ధర కల్పించాలని సూచించింది కూడా ఈ స్వామినాథనే. ఆ అద్భుత సూచన అమలు కావడానికి మనం ఉన్నది భారతదేశం కదా.... అందుకే ఆ సూచన పురుగు పట్టిన పంట చేనులా ఇంకా ఫైలులో ఉండిపోయింది. రైతుల చూపుడువేళ్లను తప్ప కడుపును చూడని వ్యవస్ధలో ఆ ఫైలుకి ఎరువులు దొరకకపోవచ్చు. నవ్వుకి పచ్చని రంగేసినట్లుగా ఉండే స్వామి నాథన్‌ను ఏలికలు పద్మవిభూషణుడు చేశాయి. బహుశా ఆయన్ని బాగా తెలిసిన వారికి స్వామినాథన్ వర్షం కోసం ఆకాశంలోకి చూస్తున్న రైతుగానే కనిపిస్తారు తప్ప పద్మవిభూషణుడిగా మాత్రం కనిపించరు.
అయినా, నాకు తెలీక అడుగుతాను. ఆయన వెళ్లిపోయారంటేమిటి అందరూ. కంటి ముందున్న ఆకుపచ్చని ఆకులో పున్నమి చంద్రుడిలా మిలమిలా మెరిసిపోతూంటే...
- ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్టు, 99120 19929