Sunday, September 24, 2023

రామాయణ కాలంలో హిమాలయాలలో ఉన్న , నాటి ఓషధులు

 *రామాయణ కాలంలో హిమాలయాలలో ఉన్న , నాటి ఓషధులు*

యుద్దకాండ పరిశీలిస్తే, మనకి ఇలా తెలుస్తోంది..

పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణునికి ధైర్యం చెప్పి ఇంద్రజిత్తు యుద్ధ రంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను నిశిత శరాలతో చీల్చి చెండాడ సాగాడు. 

వానర వీరులంతా సంజ్ఞా విహీనులై పోయారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. 

అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.

మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని 

*"అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?"* అని అడిగాడు.

అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు 

*"హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది"* 

అని జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది 
*మృత సంజీవని*, 
*విశల్యకరణి*, 
*సౌవర్ణకరణి*, 
*సంధాన కరణి* 
అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు..

ఈ సందర్భములో వాల్మీకి మహర్షి 74 సర్గలో చెప్పిన శ్లోకాలు కొన్ని పరిశీలిద్దాము. 30వ శ్లోకము నుండి మహర్షి విశేషంగా *రిషిభ*, *కైలాస* పర్వతముల మధ్యన దేదీప్యమానంగా వెలుగుతున్న సంజీవనీ గురుంచి చెపుతారు..

ततः काञ्चनमत्युग्रमृषभं पर्वतोत्तमम् |
कैलासशिखरं चापि द्रक्ष्यस्यरिनिषूदन || ६-७४-३०
తతః కా౦చనమత్యుచ్ఛమ్ ఋషభం పర్వతోత్తమమ్
కైలాస శిఖరం చాపి ద్రక్ష్యస్యరినిషూదన 30

तयोः शिखरयोर्मध्ये प्रदीप्तमतुलप्रभम् |
सर्वौषधियुतं वीर द्रक्ष्यस्यौषधिपर्वतम् || ६-७४-३१
తయోః శిఖరయోర్మధ్యే ప్రదీప్తమతుల ప్రభమ్
సర్వౌషధి యుతం వీర ద్రక్ష్యసి ఔషధి పర్వతమ్ 31

मृतसञ्जीवनीं चैव विशल्यकरणीम् अपि |
सौवर्णकरणीं चैव सन्धानीं च महौषधीम् || ६-७४-३३.
మృత సంజీవనీం చైవ విశల్య కరణీమ్ అపి
సావర్ణ్య కరణీం చైవ సంధాన కరణీ౦ తథా 33

*మృతసంజీవిని* : వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు.,

*విశల్యకరణీ* : దీనిని వాసనచూస్తే, శరీరంలోని గాయాలు మానుతవి. 

*సావర్ణ్యకరణీ* : దీనిని వాసన చూస్తే పెద్దగాయలతో మూర్చపోయినవారికి తెలివి వస్తుంది.

*సంధానకరణీ* : విరిగిన ఎముకలు దీనిని వాసనచూస్తే అతుకుబడుతవి..

तस्य वानरशार्दूलचतस्रो मूर्ध्नि सम्भवाः |
द्रक्ष्यस्योषधयो दीप्ता दीपयन्त्यो दिशो दश || ६-७४-३२.
తస్య వానర శార్దూల చతస్రో మూర్ధ్ని సంభవాః
ద్రక్ష్యస్యోషధయో దీప్తా దీపయన్త్యో దిశో దశ 32

तावप्युभौ मानुषराजपुत्रौ |
तं गन्धमाघ्राय महौषधीनाम् |
बभूवतुस्तत्र तदा विशल्या |
उत्तस्थुरन्ये च हरिप्रवीराः || ६-७४-७३.
తావప్యుభౌ మానుష రాజపుత్రౌ
తం గన్ధమాఘ్రాయ మహౌషధీనామ్
బభూవతుస్తత్ర తదా విశల్యౌ
ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః 73

ఈ సర్గలోని 32, 73 శ్లోకాలు హనుమ ఆ ఓషధీ పర్వతం ఎక్కడ ఉన్నదా అని చూస్తున్నప్పుడు తనకు కనబడిన దృశ్యాలను మహర్షి చెపుతారు.

అప్పుడు ఆ ఓషధులు హనుమ తమను తీసుకుపోతాడని *తమ ప్రకాశము తగ్గించుకుని, లొపలికి అణగిపోయాయి*. దీనిని హనుమ గ్రహించి *"రామకార్యమునము మీరు సాయం చెయ్యరా"* అని ఆగ్రహించి మొత్తం పర్వతశిఖరము పెల్లగించాడని వాల్మీకి రామాయణములొ ఉంటంకించారు. 

. ..(స్వస్తి)...

No comments:

Post a Comment