Thursday, September 28, 2023

జ్ఞానదానం!

 *జ్ఞానదానం!*
                   

*జ్ఞాన సముపార్జన     మనిషికి అత్యంతావశ్యకం. జ్ఞానులు తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచి సమాజ శ్రేయానికి తోడ్పడతారు. సమాజానికి మహోపకారులవుతారు.* 

*తనకు తెలిసిన విద్యను, జ్ఞానాన్ని ఇతరులకు బోధించడమనేది సర్వశ్రేష్ఠ దానం.*

*భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలిసిన వ్యాసమహర్షి కాలగమనంలో లోకంలోని యుగధర్మాలు గతి తప్పుతాయని, పాంచ  భౌతిక   శరీరాలకు   శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సార విహీనులు,    అల్పాయుష్కులు, దుర్బలురు అవుతారని దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. అన్ని వర్గాలకూ మేలు కలగాలనే ఆశయంతో ఒకటిగా ఉన్న వేదాలను విభజించాడు.* 

*పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతులనే పూజ్యులు నాలుగు వేదాలను లోకోపకారార్థం శిష్య ప్రశిష్య సంప్రదాయ రూపంలో లోకంలో వ్యాప్తి చేశారని భాగవత పురాణం చెబుతోంది. ఆ విధంగా వేదం భూమిమీద భాసిల్లింది.*

*విశ్వశ్రేయాన్ని కాంక్షిస్తూ వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు, మహాభారతం, భాగవతం రచించాడు.* 

*ఆయన కుమారుడైన శుకమహర్షి భాగవత కథను పరీక్షిన్మహారాజుకు వినిపించాడు.* 

*కవిత్రయం భారతాన్ని,    పోతన భాగవతాన్ని తెలుగులోకి అనువదించి అమూల్యమైన పద్యసంపదను మనకందించారు.*

*పూర్వం    నైమిశారణ్యంలో    సూత మునీంద్రుడు శౌనకాది మహర్షులకు పురాణాలు, ధర్మశాస్త్రాలు వివరించాడు.* 

*ఆనాటి మహర్షులు విశదీకరించిన పురాణాలు నేటి మానవులకు ప్రవర్తనా నియమావళులై ధర్మమార్గాన్ని  ప్రబోధి స్తున్నాయి.* ఆదిత్యయోగి *

*విశ్వామిత్రుడు శ్రీరాముడికి బల, అతి బల అనే  రెండు విద్యలు ఉపదేశించాడు.*

*కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు బంధుశోకంతో వ్యాకులుడై దుఃఖంతో విలపించాడు. తనకు రాజ్యంపైన గాని, భోగభాగ్యాలపైన గాని ఆసక్తి లేదన్నాడు. తాను అరణ్యానికి వెళ్ళి శరీరాన్ని శుష్కింపజేసుకుంటా నన్నాడు. ధర్మరాజు విరక్తితో మాట్లాడుతున్నప్పుడు వేదవ్యాసుడు దివంగతులైన రాజుల కథలతోపాటు అనేక ధర్మసూత్రాలు వివరించి, ధర్మరాజు యొక్క దుఃఖాన్ని ఉపశమింపజేశాడు. వేదవ్యాసుడి ఉపదేశంతో ఊరట చెందిన ధర్మరాజు రాజ్యపాలనకు అంగీకరించాడు.*

*శంకర భగవత్పాదులవారు తరతరాలకు తరగని ఆధ్యాత్మిక సంపదను అనుగ్రహించారు. మనసును స్థిరపరచే మహిమాన్విత స్తోత్రాలను ప్రసాదించి మానవజాతికి మహోపకారం చేశారు. జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుందని శంకరులు నిర్ణయించారు. జ్ఞాన సంపాదన ఆవశ్యకతను వివరించారు.*

*రామకృష్ణ పరమహంస, వివేకానందులు, రమణ మహర్షులు తమ జ్ఞానామృతాన్ని లోకానికి పంచి విశ్వమానవాళిని చైతన్యవంతం చేశారు. చంద్రగుప్త మౌర్యుడి గురువైన చాణక్యుడు విలువైన అర్థశాస్త్ర జ్ఞానాన్ని శిష్యులకు అందించాడు. జ్ఞానం పెన్నిధి వంటిది. దాన్ని జ్ఞాతులు వంచించి తీసుకోలేరు. దానం చేసినా తరగదు!*

*మనిషి మేధకు అపారమైన శక్తి ఉంది. నూతన శాస్త్రాలు ఆవిష్కరించాలనే తపనతో విద్యావంతులు నిరంతరం తమ మేధకు పదునుపెడుతూ మానవాభ్యుదయానికి పాటుపడుతున్నారు. కొందరి జ్ఞానం ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. జ్ఞానం ఆత్మశోధనకు ఉపకరిస్తుంది.* 

*భగవంతుడు అనుగ్రహించిన బుద్ధిని సక్రమంగా వినియోగించగలవారు అద్భుతాలు సృష్టించగలుగుతారు.* 

*గురువుల బోధనలను ఏకాగ్రతతో ఆకళించుకుని క్రమశిక్షణతో ఎదిగిన శిష్యులు జ్ఞానవంతులవుతారు. నేటి శిష్యులే రేపటి గురువులై తమ జ్ఞానాన్ని వారి శిష్యులకు పంచుతారు. గురుశిష్య పరంపర నిరంతరం సాగుతూనే ఉంటుంది.....
                     

🙏లోకా సమస్తా సుఖినోభవంతు !🙏

No comments:

Post a Comment