[9/29, 11:11] +91 94409 15570: *✈️ఫ్లయింగ్ సీక్రెట్స్ - 1 🛬*
✍️ మురళీ మోహన్
*👉విమానం టైర్లు పేలితే..*
గాల్లో ఉండగానే ఇంధనం అయిపోతే..
‘విమాన ప్రయాణం క్షేమమేనా?’,
‘అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే?, ‘విమానం టైర్లు పేలితే ఎలా?’... తరచూ ఇలాంటి ప్రశ్నలు అడుగు తుంటారు పిల్లలు.
ఏదో ఓ సందర్భంలో పెద్దలకూ వచ్చే అనుమానాలే ఇవి. ‘101 ఫ్లయింగ్ సీక్రెట్స్’ అనే ఆంగ్ల పుస్తకంలో ఆ ప్రశ్నలకు సవివరమైన, శాస్ర్తీయమైన సమాధానాలు ఇచ్చారు రాకేష్ ధన్నారపు. ఈ హైదరాబాద్ యువకుడు... ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్‌బోర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నాడు. విమానాలపై అధ్యయనాలు చేశాడు. ‘ఫోను, వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, వాచీ.. ఏది కొన్నా వినియోగదారుడికి ఓ మాన్యువల్ ఉంటుంది. విమాన ప్రయాణికుడికి మాత్రం ఎందుకు లేదు?’ అన్న ఆలోచనే అతడిని పుస్తక రచనకు పురిగొల్పింది. అందులోని విశేషాలు సంక్షిప్తంగా..
*ఇంధనం అయిపోతే?*
కారులో హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు బయల్దేరితే, దార్లో అవసరమైనంత పెట్రోలు పోయించుకుంటాం. ఒకవేళ మధ్యలోనే ఇంధనం అయిపోతే, బంకులో ట్యాంకు నింపుకుంటాం. ఆకాశంలో ఆ ఛాన్స్ ఉండదు. అందుకే విమానం ఓ ఐదొందల కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటే... ఆరొందల కిలోమీటర్లకు సరిపడా ఇంధనాన్ని నింపుతారు. వాతావరణం అనుకూలించకపోతే... ఆ విమానం సమీపంలోని మరో ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి ఉపద్రవాలన్నీ ముందే ఊహించి.. అదనపు ఇంధనాన్ని నింపుతారు. అయినా ఇబ్బంది అయితే, ‘మాండిటరీ ప్యూయల్’ ఉంటుంది. ఆఖరి అరగంటకు సరిపోతుంది. అప్పట్లోగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిపోతుంది కాబట్టి, సమస్య ఉండదు.
*కిటికీలు బద్దలైతే?*
పదునైన లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్‌కట్టర్లు విమానంలో తీసుకెళ్లనీయరు. ఇక, విమానం కిటికీలను పాలీ కార్బొనేట్‌తో తయారుచేస్తారు. బలమైన మనిషి పిడికిలితో బాదినా అది పగలదు. అంతేకాదు, విమానం గాల్లో అంత వేగంగా వెళుతున్నప్పుడు పడే ఒత్తిడినీ, గాలీ వానా ఎండలనూ తట్టుకునే శక్తి కిటికీ అద్దాలకు ఉంటుంది. అవీ మూడు పొరలుగా ఉంటాయి. కాబట్టి, భయపడాల్సిన పన్లేదు.
*ఆక్సిజన్ ఆగితే..*
ముప్పయివేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు.. హఠాత్తుగా ఆక్సిజన్ ఆగిపోతే.. ఆ విషయాన్ని సెన్సర్లు గుర్తిస్తాయి. వెంటనే సీటుపైనున్న ఆక్సిజన్ మాస్క్‌లు తెరుచు కుంటాయి. వాటిని నోటికి అమర్చుకోగానే, రసాయన చర్య జరిగిపోయి... ఆక్సిజన్ సరఫరా మొదలవుతుంది. అలా, ఇరవై నుంచి ముప్పయి నిమిషాల పాటు ప్రాణవాయువు అందుతుంది. అంత లోపు విమానం కిందికి వచ్చేస్తుంది. 20 వేల అడుగుల కిందికి విమానం రాగానే, ఇక ఆక్సిజన్ సమస్య ఉండదు. ఇంజన్ నుంచి గాలిని తీసుకుని.. లోపలికి పంపిస్తుంది. ఇక మాస్క్‌లు తీసేయొచ్చు. అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు.
*టైర్లు పేలిపోతే?*
మూడు నుంచి ఇరవై మూడు టైర్లున్న విమానాలు ఉన్నాయి. ప్రతి టైరూ అత్యంత నాణ్యమైన రబ్బరుతో తయారై ఉంటుంది. సాధారణంగా విమానాలు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి. అంత ఒత్తిడిని తట్టుకుని, విమానాన్ని రన్‌వే మీద బ్యాలెన్స్‌గా నిలిపేది టైర్లే! ఆ వేగంలోనూ ఏమాత్రం దెబ్బతినవు. ఒక విమానం ల్యాండ్ అయినప్పుడు... ఆ రాపిడికి రన్‌వే పైన 700 గ్రాములు రబ్బరు అంటుకుపోతుంది. అక్కడ నల్లటి చారలు పడేది అందుకే! విమానం రెండొందల సార్లు ల్యాండ్ అయిన ప్రతిసారీ టైర్లు మారుస్తుంటారు. కారు టైరు ఎంత సులభంగా మార్చవచ్చో.. విమానం టైరునూ అంతే సులభంగా మార్చవచ్చు.(సశేషం)🤘
[9/30, 10:50] +91 94409 15570: *✈️ఫ్లయింగ్ సీక్రెట్స్ -2*
✍️ మురళీ మోహన్
*పార్కింగ్ ఉందా?*
కార్లు, బైకులకు పార్కింగ్ ఉన్నట్టే విమానాలకూ ఉంటుందా? అంటే... ఉంటుంది. ఎయిర్‌పోర్టులలో రెండు రకాలు... ఒకటి ప్రైమరీ, రెండు సెకెండరీ. మనకు శంషాబాద్, బేగంపేటల్లా అన్నమాట. ప్రైమరీలో పార్కింగ్ ఫీజులు అధికం. ఎందుకంటే విమానాల రాకపోకల రద్దీ ఎక్కువ అక్కడ. విమానం లాంజ్ దగ్గరకు వచ్చి, ఎయిర్‌బ్రిడ్జి ద్వారా ప్రయాణికులను నేరుగా విమానంలోకి ఎక్కించు కోవాలంటే, పార్కింగ్ ఫీజు ఎక్కువగా చెల్లించాలి. అదే విమానాన్ని దూరంగా పార్క్ చేసి.. బస్సులో ప్రయాణికుల్ని విమానం వరకూ తీసుకెళ్లగలిగితే.. తక్కువ రుసుముతో సరిపెట్టుకోవచ్చు. అందుకనే ప్రైవేటు గగనయాన సంస్థలన్నీ సొంత బస్సుల్ని ఏర్పాటు చేసుకుంటాయి.
*ఎంత క్షేమం?*
మిగిలిన రవాణా సాధనాలతో పోలిస్తే, విమానాలే సురక్షితం. ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ. ఒక అధ్యయనం ప్రకారం.. రోడ్డుమార్గంలో 140 ప్రయాణాలకు ఓ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే, గగనతలంలో... 5 లక్షల విమాన ప్రయాణాలకు ఒకసారి మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆమాటకొస్తే, అపార్ట్‌మెంట్ లిప్టు కంటే విమానమే సురక్షితం.
*తెలుపే ఎందుకు..?*
ప్రపంచ వ్యాప్తంగా కార్లు... తెలుపు, వెండి రంగుల్లోనే ఎక్కువగా ఉంటాయి. విమానాలు కూడా తెలుపులోనే ఎక్కువ. దీనికి కారణాలు అనేకం. ప్రమాదవశాత్తు ఎయిర్‌క్రా్‌ఫ్ట్ అడవుల్లోనో, చెట్ల పొదల్లోనో పడిపోతే వెంటనే గుర్తుపట్టేయవచ్చు. తెలుపు ఏ రంగుతోనూ కలిసిపోదు. ఆ రంగు విమానాలు ఎండకు త్వరగా వేడెక్కవు. ఏసీ వేయగానే త్వరగా చల్లబడతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్‌బస్ విమానానికి ఒక్కసారి పెయింట్ చేస్తే.. సుమారు 540 లీటర్ల రంగు అవసరం. ఒక లీటరు రంగు కిలో బరువుకు దాదాపు సమానం. కాబట్టి, మళ్లీ పెయింట్ వేసేప్పుడు పాతదాన్ని పూర్తిగా తొలగిస్తారు. లేకపోతే బండి బరువు ఇంకో ఐదొందల కిలోలు పెరుగుతుంది.
*ఒకదానికొకటి ఢీ కొడితే..*
రోజూ ఆకాశంలో వేలకొద్దీ విమానాలు తిరుగుతుంటాయి. అందులో కనీసం పదిలక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఆకాశంలో... అదొక పెద్ద నగరమంత జనాభా. రోడ్డు మీద జాతీయ రహదారులలానే, విమాన యానానికీ నిర్దేశిత మార్గాలు ఉంటాయి. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వీటిని పర్యవేక్షిస్తుంది. గాల్లోకి ఎగిరిన ఒక విమానానికీ, మరో విమానానికీ మధ్య కనీస దూరం... రెండువేల అడుగులు. ఒక ఫ్లయిట్ ఎగిరే ముందు ఎయిర్‌ప్లాన్ తయారుచేసి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు అందజేస్తారు. సంబంధిత ఎయిర్‌పోర్టుకూ సమాచారం వెళ్లిపోతుంది. ఫలానా ఫ్లయిట్ ఫలానా సమయానికి చేరుతుందని అర్థమైపోతుంది. ఇరవై నాలుగ్గంటలూ ఏటీసీతో పైలెట్లు అనుసంధానమై ఉంటారు. కాబట్టి, ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టే ఆస్కారమే లేదు.
*టాయ్‌లెట్ క్లీనింగ్*
విమానాల్లో ప్రయాణికులు టాయ్‌లెట్లకు వెళ్లినప్పుడు... ఆ వ్యర్థాలు ఆకాశంలోంచి కిందికి పడిపోతాయని అనుకుంటారు. అది అపోహే. సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 250 లీటర్ల సీపేజ్ ట్యాంక్ ఉంటుంది. విమానం ల్యాండ్ అయిన తరువాత ఒక ట్రక్కు వచ్చి.. ఆ వ్యర్థాలను నింపుకుని వెళుతుంది. దాన్ని రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తుంది. ఫ్లయిట్ ట్యాంక్‌ను ప్రత్యేక లిక్విడ్‌తో శుభ్రం చేస్తారు. చెత్తాచెదారం, వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం వంటివన్నీ కూడా రీసైక్లింగ్ యూనిట్లకే వెళ్తాయి.
*ఎవరైనా మత్తు మందు ఇస్తే...*
ఈ విషయాన్ని విమానయాన సంస్థలూ ముందే ఆలోచించాయి. అందుకే, విమానం నడిపే ఇద్దరు పైలెట్లకు వేర్వేరు ఆహారాలు అందిస్తారు. తిండిలో ఎవరైనా విషం కలిపితే.. ఇద్దరూ అస్వస్థతకు గురి కావొచ్చు కదా! అందుకే ఈ ఏర్పాటు. వంటకాలను శుభ్రంగా, టెంపరేచర్ మానిటర్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా భద్రపరుస్తారు. ఏవియేషన్ కిచెన్‌లు నూరుశాతం పరిశుభ్రంగా ఉంటాయి. ఏమాత్రం అశ్రద్ధ వహించరు. వండిన ఆహారాన్ని రాండమ్ శాంపిల్ తీసి పరీక్ష కూడా చేస్తారు. ప్రత్యేక కంటైనర్‌లలో పంపిస్తారు. ఎయిర్ క్రాఫ్ట్‌లకు ప్రత్యేక వంటశాలలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన పాకశాల ఎమిరేట్స్ వాళ్లకుంది.
ఒక విమానం ఎగరాలంటే పదిమంది పైలెట్లు అవసరం.
అయితే మనకు కాక్‌పిట్‌లో ఇద్దరే కనిపిస్తారు. ఎయిర్ పోర్టుకు దగ్గర్లో స్టాండ్‌బై డ్యూటీగా మిగతా వాళ్లను ఉంచుతారు. ఓ పైలెట్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నప్పుడు హఠాత్తుగా అనారోగ్యం పాలైతే.. మిగిలిన వాళ్లు సిద్ధంగా ఉంటారు.
*కుడి అయితే ఎక్కువే..*
విమానాశ్రయానికి ఎయిర్‌పోర్టు ఛార్జీలు, పార్కింగ్, ఫుడ్, రిటైల్, షాపింగ్, కార్గోలతో గణనీయమైన ఆదాయం వస్తుంది. ఎయిర్‌పోర్టు డిజైనింగ్‌లో చాలా సూక్ష్మమైన విషయాల్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఎడమ చేతితో ట్రాలీ బ్యాగ్ పట్టుకుని వెళుతున్నప్పుడు, సహజంగానే కుడివైపు చూస్తూ నడుస్తారు ప్రయాణికులు. కాబట్టి, ఆ వైపు ఉన్న దుకాణాల అద్దెలు కూడా ఎక్కువే. అంతర్జాతీయ కంపెనీల రిటెయిల్ స్టోర్లు కుడివైపున ఏర్పాటయ్యేది కూడా అందుకే!🤘
*✈️ఫ్లయింగ్ సీక్రెట్స్ -3*✈️
✍️ మురళీ మోహన్
*పైలెట్లు నిద్రపోతారా?*
అంతర్జాతీయ ప్రయాణాల్లో.. రోజుల తరబడి విమానాల్ని నడపాల్సి వస్తుంది. పైలెట్లకు విశ్రాంతి తప్పనిసరి. ప్రయాణ దూరం, విమానసైజును బట్టి... ముగ్గురు నలుగురు పైలెట్లు ఉంటారు. వాళ్లంతా షిప్టుల్లో కాక్‌పిట్‌లోకి వస్తూపోతూ ఉంటారు. నిబంధనల ప్రకారం పైలెట్లకు కచ్చితంగా విశ్రాంతి ఉండాల్సిందే! ఒక పైలెట్ పనిగంటలు ముగిశాక, మరో పైలెట్ ఆ బాధ్యతను తీసుకుంటారు. అతను కాక్‌పిట్ సీట్లో కూర్చున్నాకే, మొదటి వ్యక్తి రిలీవ్ అవుతాడు. విమానంలోనే చిన్న బంకర్‌లు ఉంటాయి. అందులో కాసేపు నిద్రపోతారు. విమానం ముందు భాగంలో కానీ, వెనకవైపు కానీ వాటిని ఏర్పాటు చేస్తారు.
*ప్రపంచంలో అత్యధిక మహిళా పైలెట్లు ఉన్న దేశం?*
అమెరికా, ఆస్ట్రేలియా.. ఇలా వెళుతుంది మన సమాధానం. ఆ ఘనత మన దేశానిదేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. పదమూడు శాతం మహిళా పైలెట్లు భారత్‌లోనే ఉన్నారు.
ఒకప్పుడు కెప్టెన్ పెద్ద సూట్‌కేసు పట్టుకుని విమానం ఎక్కేవాడు. అందులో నావిగేషన్, వెదర్ రిపోర్టు, మాన్యువల్స్ ఉండేవి. ఇది కనీసం పన్నెండు కిలోల బరువు ఉండేది. ఇప్పుడు ఆ సమాచారమంతా ఒక ట్యాబ్‌లోకి వచ్చేసింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. శాటిలైట్ సహాయంతో పనిచేస్తుంది. దాన్ని హ్యాక్ చేయడం కష్టం.
కొన్ని ఎయిర్‌లైన్స్‌లలో ఎయిర్‌హోస్టెస్‌ల బరువుకు కూడా నిబంధనలు పెడుతున్నారు. బక్కపల్చ భామలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో విమానంలో నాలుగైదు మంది ఉంటారు కాబట్టి, ఒక్కొక్కరు ఐది కిలోలు తగ్గినా.. ఇరవై కిలోల బరువును వదిలించుకున్నట్టే కదా!
వికలాంగులు పైలెట్లు కాలేరు. అయితే, ఈ ప్రతి బంధకాన్ని అధిగమించింది జస్సికా కాక్స్ అనే అమెరికన్ యువతి. తనకు చేతులు లేకపోయినా.. కాళ్లతోనే విమానాన్ని నడిపి.. ఔరా అనిపించుకుంది. ఏకంగా పైలెట్ లైసెన్సునూ సంపాదించింది.
*స్వాగతం*
కొత్తకారు కొన్నప్పుడు, ఎలాగైతే షోరూమ్ వాళ్లు వెల్‌కమ్ చెబుతారో.. కొత్త విమానానికీ అలానే స్వాగతం పలుకుతారు ఎయిర్‌పోర్టు సిబ్బంది. విమానానికి రెండువైపులా రెండు వాటర్‌ట్యాంకులు ఫైర్‌ఇంజన్‌లా నీటికి ఎగజిమ్ముతాయి. అదో సంప్రదాయం.
*ఫ్యూయల్ డంపింగ్..*
విమానంలో ఇంధనం అయిపోతే?.. అనేదే పెద్ద సమస్య. అయితే దానికి భిన్నమైన సమస్య ఇంకొకటుంది. విమానం పైకి ఎగిరినప్పుడు.. అందులోని ఇంధనాన్ని పారబోయాల్సి వస్తే? ఆ అరుదైన ప్రక్రియను ‘ప్యూయల్ డంపింగ్’ అంటారు. ఫుల్‌ట్యాంకుతో విమానం పైకి ఎగురుతుంది. లగేజీ, ప్రయాణికులు, ఇంధనం.. వీటన్నిటి వల్ల బరువు ఉంటుంది. గాల్లోకి ఎగిరిన పదినిమిషాలకే ఒక ప్రయాణికుడికి తీవ్రమైన గుండెనొప్పి వచ్చిందనుకోండి.. అంత బరువైన విమానాన్ని వెంటనే ల్యాండింగ్ చేయాలంటే ఇబ్బందే! కాబట్టి ఆ బరువు తగ్గించుకోడానికి ఏకైక మార్గం.. ఇంధనాన్ని తగ్గించడం. అయితే ఇంధనాన్ని ఎక్కడపడితే అక్కడ వదిలేయరు. పొరపాటున ఏ ఇళ్లమీదో, ఫ్యాక్టరీల మీదో పడితే అగ్నిప్రమాదాలు జరగొచ్చు. నావిగేషన్ ద్వారా పరిశీలించి.. ప్యూయల్ డంపింగ్ జోన్స్ (ఖాళీ జాగా)లలోనే కొంత ఇంధనాన్ని ఒలికిస్తారు. బరువు తగ్గాక విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తారు. పేషెంట్‌ను ఆస్పత్రికి తరలిస్తారు.
*విమానానికీ శ్మశానం*
ఒక మనిషి చనిపోతే శ్మశానం (గ్రేవ్‌యార్డ్)లో అంత్యక్రియలు చేస్తారు. మరి, విమానం ఆయువు తీరితే.. ? వాటికి వీడ్కోలు చెప్పే శ్మశానం ఒకటుంది. అదే ‘బోన్‌యార్’్డ. అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికోలలో ఇలాంటివి ఎక్కువ. విమానం ఇక పనికిరాదని తేలాక... ముఖ్యమైన, విలువైన విడిభాగాలను తీసేసుకుని.. మిగిలిన వ్యర్థాల్ని అక్కడ వదిలేస్తారు. బోన్‌యార్డులు ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఎడారుల్లో వర్షం రాదు కాబట్టి.. విమానాలు తుప్పు పట్టవు. అక్కడికి వెళ్లి రెక్కలు, ఇతర భాగాలను తీసుకొచ్చి.. హోటళ్లు నిర్మించేవాళ్లూ ఉన్నారు.
*నిషేధిస్తారు జాగ్రత్త..!*
ప్రయాణికులకూ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వాటిని అతిక్రమిస్తే.. భవిష్యత్తులో విమానం ఎక్కలేరు. అదే ‘నో ఫ్లయింగ్ లిస్ట్’. మొదటిసారిగా ఈ నిబంధన అమెరికాలో మొదలైౖంది. మన దేశంలో మాత్రం రెండేళ్ల కిందట ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తి ఎయిర్‌పోర్టులోనో, విమానాల్లోనో అసభ్యంగా ప్రవర్తించినా, అమర్యాదగా వ్యవహరించినా నిషేధం తప్పదు. ఎయిర్‌క్రాఫ్ట్ భద్రత విషయంలో సమస్య తలెత్తినా వేటు వేస్తారు. ఒకవేళ ప్రయాణం మధ్యలో ఆ వ్యక్తి దుశ్చర్యలు మితిమీరితే... విమానసిబ్బంది ప్రత్యేక సీటుబెల్టులతో అతన్ని బంధించవచ్చు. టేపుతో చేతులు కట్టేయవచ్చు. దీన్ని ‘మిడ్ ఎయిర్ అరెస్ట్’ అంటారు. విమానం ల్యాండ్ అయ్యాక పోలీసులకు సమాచారం ఇస్తారు. నేర నిర్ధారణ తర్వాత ఆ ప్రయాణికుడి పేరు ‘నో ఫ్లయింగ్ లిసు’్టలో పెడతారు. అమెరికాలో 2007లో 40 మంది ఈ జాబితాలో చేరితే.. 2011లో 78 మంది నమోదయ్యారు. మన దేశంలో ఇద్దరు ముగ్గురు నేతలూ ఆ లిస్టులో చేరారు. నేర తీవ్రతను బట్టి నిషేధకాలం పెరగవచ్చూ తగ్గవచ్చూ.
*పిడుగులు పడితే..*
మనకు తెలియదు కానీ.. మనం ప్రయాణించే విమానం మీద కూడా ఏడాదికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. అది పెద్దది కావచ్చు, చిన్నదీ కావొచ్చు. అలాంటప్పుడు విమానం మీద నల్లమచ్చలు ఏర్పడతాయి. కాక్‌పిట్ లేదా ఇంధన ట్యాంకులకు తగిలితే మాత్రం ప్రమాదమే. అందుకని.. విమానంపైన ఒక రకమైన రాగి జాలీ వేస్తారు. పిడుగుల ద్వారా జ్వలించిన విద్యుత్‌ను అది తీసేసుకుంటుంది. లోపలికి అస్సలు రానివ్వదు.
*కాక్‌పిట్‌లో గొడవపడితే..*
కాక్‌పిట్‌లో కూర్చున్నప్పుడు పైలెట్, కో పైలెట్‌లు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం సాధారణమే. ఏదో ఓ సందర్భంలో... అభిప్రాయభేదాలు తలెత్తి, గొడవలకు దారితీస్తే..? అవును, అలాంటి సమస్యా ఉంది. గత ఏడాది ఒక కెప్టెన్ తన కోపైలెట్‌ను కాక్‌పిట్‌లో చెంపదెబ్బ కొట్టాడు. ఆమె బయటికి వచ్చి ఏడ్చింది. మళ్లీ లోపలికి వెళ్లింది. తను మళ్లీ కొట్టాడు. దాంతో బయటికి వచ్చేసి, ఇక కాక్‌పిట్‌లోకి వెళ్లనని మొండికేసింది. దీంతో సిబ్బంది ‘మీరు ఇలా చేస్తే విమానానికి ప్రమాదం. ముందు కాక్‌పిట్‌లోకి వెళ్లండి. విమానం ల్యాండ్ అయ్యాక ఫిర్యాదు చేయండి’ అని సముదాయించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆ ఇద్దరి లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు సమాచారం.
*ఓ లెక్కే..*
ప్రతి సీట్లో ఒక మ్యాగజైన్.. ఒక్కోటి వంద గ్రాములు.. అన్ని సీట్లలోని మ్యాగజైన్లను కలిపితే.. కిలోలుగా మారుతుంది. గ్రాము బరువు కూడా విమానానికి అదనపు భారమే! అందుకని పలు విమానయాన కంపెనీలు మ్యాగజైన్లను తొలగించడమో, వాటి పేజీలను తగ్గించడమో చేస్తున్నాయి. విమానం బరువు తగ్గే కొద్దీ ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుంది.🤘
No comments:
Post a Comment