Tuesday, October 17, 2023

మహాభారత కావ్యం మొత్తం మూడు విషయాలపై వ్యక్తుల ప్రామాణికతను నిర్ణయిస్తున్నది.

*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝మహాభారత కావ్యం మొత్తం మూడు విషయాలపై వ్యక్తుల ప్రామాణికతను నిర్ణయిస్తున్నది. 
💕1. అభిజాత్యం,  
💕2. సంస్కారం,  
💕3. దైవీసంపత్తి.  
❤️కర్ణుని విషయానికొస్తే కర్మసాక్షియైన సూర్యభగవానుడే తండ్రి ఐనా సంస్కారవంతుడు కాలేకపోయి దుష్టచతుష్టయంలో ప్రముఖ పాత్ర వహించాడు. దైవీసంపదకు దూరమయ్యాడు. 
విధి వక్రించడం చేత “అయ్యో పాపం “ అనిపించే మరణం పొందాడు. 
💕కర్ణుని మరణానికి కారణాలు ఎన్నని, ఎందరని లెక్కపెట్టగలం? ఆంధ్రమహాభారత 
శాంతిపర్వంలో నారదుడు ధర్మరాజుతో చెప్పిన కారణాలు:-
1. విప్రుడలిగెన్, 
2. జమదగ్నిసుతుండు శాపమిచ్చె, 
3. అమరభర్త వంచనము సేసె, 
4. వరంబని కోరి కుంతిమాన్చె నలుక, 5. భీష్ముడర్ధరథుజేసి యడంచె, 
6. కలంచె మద్రరాజు నుచితమాడి (శల్యుడు), 
7. శౌరి  విధియయ్యె, 
8. నరుండటు జంపె కర్ణునిన్.
💕కర్ణుడు పుట్టుక నుంచే దురదృష్టవంతుడు. కన్నతల్లి గంగపాలు చేసింది. అఖండ భూమండలాధీశ్వరుడు కాదగిన యోగ్యతలుండిసూతపుత్రుడుగా పెరగవలసి వచ్చింది. పరశురామ శుశ్రూష శాపాన్నిప్రాప్తింపజేసింది. అస్త్రవిద్యాసాధన బ్రాహ్మణ శాపమును సంక్రమింపజేసింది. దానవ్రతం కవచకుండలాలను తొలగించింది. యుద్ధంలో కూడా దురదృష్టమే కర్ణుడ్ని వెంటాడింది. నరునిపై వేసిన నాగాస్త్రం శల్యసారథ్యం వల్ల గురితప్పింది.భార్గవాస్త్రం బుద్ధికి స్ఫురింపలేదు. రథచక్రము భూమిలో క్రుంగిపోయింది. చివరకు అయ్యోపాపమనిపించే మరణం పొందాడు కర్ణుడు. 
❤️విషాదాంత నాయకులు అవివేకులు కారు, అసమర్థులు అంతకంటే కారు. కర్ణుడెంత సమర్థుడో అంత వివేకి. పైగా స్వశక్తితో సూతపుత్రస్థితి నుండి రారాజు అర్ధాసనమలంకరించే స్థితికి వచ్చినవాడు. పరిస్థితుల ప్రాబల్యం, కౌరవ పక్షాన కట్టిపడేసినా ధర్మజుని ధార్మికతను, శ్రీకృష్ణుని ప్రాపున పాండవ విజయమును తెలియనివాడు గాడు. 

💕రాయబారం విఫలమయ్యాక శ్రీకృష్ణుడు వెనుదిరిగి వెళ్తూ కర్ణుణ్ణి తన రథమెక్కించుకుని
ఏకాంతంలో అతనిజన్మరహస్యం చెప్పాడు. సార్వభౌమ యోగం, పాంచాలి పొందూ దొరుకుతాయి అని ఆశపెట్టాడు. పాండవ పక్షానికి రమ్మన్నాడు. కర్ణుడు శ్రీకృష్ణునితో "ధర్మరాజు నాకు తమ్ముడని తాను తెలుసుకుంటే భూమండలాధిపత్యం వహించడు. కానీ అట్లాంటి ధర్మాత్ముడు శాశ్వతంగా ఈ పుడమికంతటికి చక్రవర్తిగా పాలించడం న్యాయం కదా? కృష్ణా, ధర్మజుడు తన తమ్ముళ్లు నలుగురూ యజ్ఞం చేయించే యాజకులు కాగా, ఈ పని ఇట్లా చేయండి అని యజ్ఞకర్మలలోని గుణదోషాలను కనిపెట్టే ఉపద్రష్టవు నీవు కాగా, కౌరవులనే యజ్ఞపశువులను చంపుట ద్వారా యుద్ధమనే యాగాన్ని సంప్రీతితో చేస్తాడు. 
ఈ సమర యుద్ధాన్నీదుకుంటూ వెళ్లి మీ విజయాన్ని స్వర్గంనుంచి చూసిఆనందిస్తాను. నా మాట మన్నించు" అని వేడుకున్నాడు. 

💕ఫలం కర్మాధీనం:
❤️పెంచి పెద్ద చేసిన రాధ, అతిరథుల పట్లనున్న పుత్రధర్మం, అంగరాజ్యమిచ్చి ఆదరించి తననింత వాడిని జేసిన సుయోధనుని మీద స్వామి భక్తి చివరికి సార్వభౌమ యోగాన్ని కాలదన్నాడు. సోదర ప్రేమను జయించాడు. ఇంత వివేక ఉదాత్తగుణసంపన్నుడైన కర్ణుడు జీవితాన్ని ఎందుకు విషాదాంతం చేసుకున్నాడని సందేహం కలుగకమానదు. 
❤️అందుకు కారణాలు అతని వైయక్తిక లోపాలే. మాత్సర్యం, స్వాతిశయం, దురదృష్టజాతకం వెన్నంటాయి.
❤️”ఎట్టివిశిష్ఠ కులంబున బుట్టియు సదసద్వివేకంబులు గల్గియున్ మును గట్టిన కర్మఫలంబుల నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్"
~మానవులెంతఉత్తమవంశంలో పుట్టినా, మంచిచెడ్డలగురించిన పరిజ్ఞానంకలిగివున్నా,పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదన్నమాట అక్షరసత్యమే కదా. “ఫలం కర్మాధీనం, దేవతలతో దైవంతో మాకేం పని? దేవతలకు కూడా తప్పించుకునే వీలులేని కర్మకే నమస్కారం" అంటాడు భర్తృహరి. కర్ణుడి జీవితమే అందుకు సాక్ష్యం.
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment