*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్* 🌍 *కథతో*
♥️ *కథ-48* ♥️
*అనుభూతి : నా తల్లిదండ్రులు నన్ను పెంచిన పద్ధతికి నేను కృతజ్ఞతతో ఉన్నాను*
*పెంపకం*
గంగా దాస్ - అవును, ప్రపంచంలోనే ఉత్తమ తండ్రి కావడానికి సాధ్యమయ్యే ప్రతీదానిని ప్రయత్నించి, ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టని వ్యక్తి పేరు ఇది. అతని పెంపకం మనందరికీ స్ఫూర్తినిస్తుంది.
కాబట్టి గంగాదాస్ గారి చిన్న స్ఫూర్తిదాయకమైన కథను విందాం:
గంగాదాస్ ఒక అంతర్జాతీయ పాఠశాలలో తోటమాలి. విలాసవంతమైన తోటల్లో మొక్కలకు నీళ్లు పోసేవాడు. ఎండాకాలమైనా, చలికాలమైనా అతని రోజువారీ పని ఇదే. వేడి కానీ, మట్టి, దుమ్ము ఏదీ కూడా అతనిపై ప్రభావం చూపేది కాదు.
ఒకరోజు, అతను ఎప్పటిలాగే తన పనిలో నిమగ్నమై ఉన్నాడు, అకస్మాత్తుగా వెనుక నుండి ఒక గొంతు: "గంగాదాస్, ప్రిన్సిపాల్ మేడమ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు - ఇప్పుడే!"
ప్యూన్ అన్న చివరి రెండు పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంది, ఇది అత్యవసరమైనదిగా అనిపించింది. త్వరగా లేచి చేతులు కడుక్కుని, తుడుచుకుని ప్రిన్సిపాల్ ఛాంబర్ వైపు వెళ్ళాడు.
తోట నుండి ఆఫీసుకి నడక అనంతంగా అనిపించింది, అతని గుండె దాదాపు ఛాతీలో నుండి బయటకు వచ్చేసేంతగా కొట్టుకుంటోంది. ఆమె అంత అత్యవసరంగా చూడాలనుకునేంత తప్పు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. అతను నిజాయితీగల కార్మికుడు, తన విధుల నుండి ఎన్నడూ తప్పించుకోలేదు. ఎట్టకేలకు మనసులో బోలెడు ఆలోచనలతో ప్రిన్సిపాల్ ఆఫీసుకి చేరుకున్నాడు.
నెమ్మదిగా తలుపు తట్టి,"మేడమ్, మీరు నన్ను పిలిచారా?" అన్నాడు.
‘‘లోపలికి రా..’’ అన్న అధికారపూర్వక స్వరం అతన్ని మరింత కంగారు పెట్టింది.
కొద్దిగా నెరిసిన జుట్టు పైకి ముడిపెట్టి, జరీచీర - హుందాగా, చాలా సంప్రదాయబద్దంగా కట్టి, కళ్ళద్దాలు తన ముక్కుపై ఉంచి, టేబుల్‌పై ఉంచిన కాగితం వైపు చూపి,
"ఇది చదువు",అని ప్రిన్సిపాల్ అంది.
" కానీ ... కానీ మేడమ్ నేను నిరక్షరాస్యుడిని. నాకు ఇంగ్లీషు చదవడం రాదు. మేడమ్ నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి... దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి...
నా కూతుర్ని ఉచితంగా ఈ స్కూల్లో చదివిస్తునందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. నా బిడ్డకు ఇలాంటి జీవితం కలుగుతుందని కలలో కూడా ఊహించలేను.’’ దాదాపు వణికిపోతూ కుప్పకూలిపోయాడు.
" ఆగాగు, నువ్వు చాలా ఊహించుకుంటున్నావు. నీ కూతురిని ఇక్కడ చదువుకోవడానికి ఎందుకు అనుమతించామంటే తను చాలా తెలివైనది, నీవు నిజాయితీగా పనిచేసేవాడివి కాబట్టి. నేను ఒక టీచర్‌ని పిలుస్తాను, ఆమె దానిని మీకు చదివి అనువదిస్తుంది.
ఇది మీ అమ్మాయి వ్రాసింది, దీన్ని నువ్వు చదవాలని నేను కోరుకుంటున్నాను." అని అంది.
వెంటనే టీచర్‌ని పిలిచారు, ఆమె ప్రతి పంక్తిని హిందీలో అనువదిస్తూ ఇలా చదవడం ప్రారంభించింది.
" ఈ రోజు మదర్స్ డే గురించి వ్రాయమని మమ్మల్ని అడిగారు.
నేను బీహార్‌లోని ఒక గ్రామానికి చెందినదానిని, వైద్యం, విద్య ఇప్పటికీ ఇంకా తీరని కలగా అనిపించే ఒక కుగ్రామం. ప్రసవ సమయంలో చాలా మంది మహిళలు ఇంకా అప్పుడప్పుడు మరణిస్తూ ఉంటారు.
వారిలో మా అమ్మ కూడా ఒకరు, ఆమె నన్ను తన చేతుల్లోకి కూడా తీసుకోలేకపోయింది.
నా తండ్రి నన్ను ఎత్తుకున్న మొదటి వ్యక్తి, లేదా బహుశా ఒకే వ్యక్తి ఏమో కూడా.
నేను ఆడపిల్లను కాబట్టి అందరూ బాధపడ్డారు, పుట్టిన వెంటనే నా కన్నతల్లిని "తినేసాను" అని కూడా అనుకున్నారు.
మా నాన్నని తక్షణమే మళ్లీ పెళ్లి చేసుకోమని అందరూ అన్నారు, కానీ ఆయన నిరాకరించాడు. మా తాతా - మామ్మలు చాలా బలవంతం చేశారు, అన్ని తార్కిక, అహేతుకమైన, భావోద్వేగ కారణాలను ఇచ్చారు, కానీ ఆయన లొంగలేదు.
మా తాతా - మామ్మలకు మనవడు కావాలి; మా నాన్నని మళ్లీ పెళ్లి చేసుకోమని, లేకుంటే ఆస్తిలో వాటా ఇవ్వమని, వెలివేస్తామని బెదిరించారు.
ఆయన రెండో ఆలోచన లేకుండా అన్నీ వదిలేశాడు. ఎకరాల భూమి, మంచి జీవితం, సౌకర్యవంతమైన ఇల్లు, పశువులు ఇలా..... గ్రామంలో ఒక మంచి జీవనశైలిగా లెక్కించబడే ప్రతిదీ.
ఆయన చేతుల్లో నేను తప్ప, బొత్తిగా ఏమీలేకుండా ఈ భారీ నగరానికి వచ్చాడు. జీవితం కష్టతరమైనది, పగలు, రాత్రి కష్టపడి, మృదువైన ప్రేమతో, అత్యంత శ్రద్ధతో నన్ను పెంచాడు.
నేను తినడానికి ఇష్టపడే వస్తువులపై ఆయనకు అకస్మాత్తుగా ఎందుకు అయిష్టతను పెంచుకున్నాడో, ముఖ్యంగా ప్లేట్‌లో కొద్దిగా మాత్రమే మిగిలి ఉండగా - ఇప్పుడు నాకు అర్థమైంది.
తినడానికి అయిష్టత చూపించేవాడు, ఆయనకి ఇష్టం లేదేమో అనుకొని నేను తినేసేదానిని.
కానీ నేను పెద్దయ్యాక, దానికి కారణం, ఇంకా త్యాగానికి నిజమైన అర్ధం ఏమిటో గ్రహించాను.
నాకు తన సామర్థ్యానికి మించిన అత్యుత్తమ సౌకర్యాలను అందించాడు. ఈ పాఠశాల అతనికి ఆశ్రయం, గౌరవమే కాకుండా అతిపెద్ద బహుమతి ఇచ్చింది -- తన కుమార్తెకు ప్రవేశం.
ప్రేమ - సంరక్షణ ఒక తల్లిని నిర్వచిస్తే... అప్పుడు మా నాన్న ఆ నిర్వచనానికి సరిపోతారు.
కరుణను ఒక తల్లిని నిర్వచిస్తే , మా నాన్న ఆ శ్రేణిలో కూడా బాగా సరిపోతారు.
త్యాగం తల్లిని నిర్వచిస్తే, మా నాన్న ఆ శ్రేణిలో ఆధిపత్యం చెలాయిస్తారు.
కాబట్టి ఒక మాటలో, తల్లి ప్రేమ, సంరక్షణ, త్యాగం, కరుణతో తయారు చేయబడితే, అప్పుడు నా తండ్రి ఈ భూమిపై అత్యుత్తమమైన తల్లి.
ఈ భూమిపై ఉత్తమ సంరక్షకుడుగా ఉన్నందుకు నా తండ్రికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను, ఈ పాఠశాలలో కష్టపడి పనిచేసే తోటమాలి మా నాన్న అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మా టీచర్ దీనిని చదివిన తర్వాత ఈ పరీక్షలో ఫెయిల్ చేయచ్చు -- కానీ ఇది మా నాన్నగారి నిస్వార్థమైన ప్రేమకు నేను చెల్లించే చాలా తక్కువ వెల".
గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సన్నగా ఏడుస్తున్న గంగాదాస్ గొంతు మాత్రమే వినపడుతోంది.
కఠినమైన ఎండలు కూడా చెమటతో తన బట్టలను తడిపలేకపోయాయి, కానీ కుమార్తె యొక్క మృదువైన మాటలు అతని ఛాతీని కన్నీళ్లతో తడిపాయి. అతను చేతులు ముడుచుకుని నిలబడి ఉన్నాడు. టీచర్ చేతుల్లో నుండి కాగితం తీసుకుని, దానిని తన గుండెకు దగ్గరగా తీసుకుని ఏడ్చాడు.
ప్రిన్సిపాల్ లేచి, కుర్చీ ఇచ్చి, ఒక గ్లాసు నీళ్ళు అందించి ఇలా అంది. కానీ, విచిత్రంగా ఈసారి ఆమె స్వరం స్ఫుటతతో, ఆశ్చర్యకరమైన వెచ్చదనంతో, మాధుర్యంతో నిండి ఉంది.
" గంగాదాస్, ఈ వ్యాసానికి మీ కూతురికి 10/10 మార్కులు ఇచ్చారు. ఈ పాఠశాల చరిత్రలో ఇది అత్యుత్తమ వ్యాసం, మేం రేపు ఘనంగా ఒక వేడుక చేస్తున్నాం. మొత్తం స్కూల్ యాజమాన్యం మిమ్మల్ని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించుకుంది.
ఇది ఒక మనిషి తన పిల్లలను పెంచడానికి చేసే ప్రేమ, త్యాగాన్ని గౌరవించడం... పరిపూర్ణ తల్లిదండ్రులుగా ఉండటానికి మీరు స్త్రీ అయ్యి ఉండాల్సిన అవసరం లేదని చూపించడం. ముఖ్యంగా ఇది మీ కుమార్తె యొక్క బలమైన నమ్మకాన్ని బలోపేతం చేయడం, అభినందించడం.
మీ కుమార్తె చెప్పినట్లుగా, ఈ భూమిపై ఉన్న అత్యుత్తమ తండ్రి మా వద్దే ఉన్నారని ఈ పాఠశాల మొత్తం గర్వపడేలా... మీ అమ్మాయి గర్వపడేలా తెలియజేయడం.
నీవు నిజమైన తోటమాలివి, తోటల సంరక్షణ మాత్రమే కాకుండా, మీ జీవితంలోని అత్యంత విలువైన పువ్వును ఇంత అందంగా పెంచుతున్నారు కనుక!
గంగాదాస్, మీరు ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా వస్తారా?"
♾️
*పిల్లలు అద్దాల వంటివారు, మనం దాచడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, సత్యాన్ని* *అర్థం చేసుకోగల ప్రత్యేక సామర్ధ్యం పిల్లలకి ఉంటుంది. 🌼*
*చారీజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment