శ్రీ జగన్నాథుడి మహా- ప్రసాదం
ఒకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్ళి , భక్తితో లక్ష్మీదేవిని సేవించాడు. అతని సేవకు ఎంతో ప్రసన్నురాలైన లక్ష్మీదేవి, ఏదైనా వరం కోరుకొమ్మని అంటుంది. అప్పుడు నారదముని, “అమ్మా! అలా అయితే నేను ఏ వరం కోరినా ఇస్తానని మొదట మాట ఇవ్వు” అంటాడు. “దేనినైనా సరే, సంతోషంగా ఫలించేలా ఇస్తాను” అని మాట ఇస్తుంది ఆమె. నారద మహర్షి వెంటనే తన మనసులో ఉన్న కోరికను బయట పెడతాడు, “నేను శ్రీవారి మహాప్రసాదాన్ని అపేక్షిస్తున్నాను తల్లీ” అని.
ఆ మాట వినగానే లక్ష్మీదేవి ముఖం ఆందోళనతో నిండిపోతుంది. “కుమారా! దయచేసి ఈ వరం తప్ప మరేదైనా కోరుకో, కొద్దిరోజుల క్రితం తనకు అర్పించిన మహాప్రసాదాన్ని ఎవరికీ ఇవ్వొద్దని శీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించారు. అందువలన నేను నీకు మహాప్రసాదాన్ని ఇవ్వలేను నాయనా! ఆయన ఆనతిని నేను అతిక్రమించ లేననే విషయం నీవు గ్రహించు, ఇది తప్ప వేరే దేనిని నీవు ఆశించినా వెంటనే ఫలప్రదం చేస్తాను.” అయితే నారదముని తన మొండి పట్టుదల వదల్లేదు. “తల్లీ ! నీవు నాకు మాట ఇచ్చావు శ్రీమన్నారాయణుడికి ప్రియ సతివైన నీకు ఇది కష్టమైనదేం కాదు, ఎలాగో ఒకలాగ నాకు మహాప్రసాదాన్ని అనుగ్రహించ వలసిందే!” లక్ష్మిదేవికి గొప్ప చిక్కు వచ్చిపడింది, ‘ఇప్పుడు ఏం చెయ్యాలి?’ ఆమె నారదుడితో కొంత సమయం వేచి ఉండమని చెబుతుంది.
ఆ రోజు మధ్యాహ్నం ఆమె నారాయణుడికి చాలా శ్రద్ధగా , జాగ్రత్తగా భోజనం వడ్డిస్తూ ఉంది. ఎంతో అణుకువగా తన పని చేస్తున్నప్పటికీ ఆమె ఉదాసీనంగా ఉండడం శ్రీహరి గమనించాడు, ఆమె ముఖం నిరాశతో ముడుచుకుని పోయి ఉంది. ఆయన ఎంతో మృదువుగా ఆమె దుఃఖానికి హేతువేమిటని ప్రశ్నించాడు. ఆ లాలనకు కరిగిపోయిన లక్ష్మి, తనకు వచ్చిన ఇబ్బందిని గురించి గద్గదికంగాచెప్పుకుంది, నారాయణుడు ఆమెను ఓదార్చి ‘దుఃఖించకు, ఈ రోజుకు మాత్రం ఈ నియమాన్ని రద్దు చేస్తాను, నేను మిగిలించిన ప్రసాదాన్ని నీవు నారదుడికి ఇవ్వొచ్చు, అయితే నా కంట పడకుండా నీవు ఈ పని చేయాలి, నేను ప్రక్కకు తిరిగి ఉన్నప్పుడు నాకు తెలియనట్లుగా ఈ పళ్ళెం తీసుకుని వెళ్ళు’ అన్నాడు. శ్రీలక్ష్మికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ప్రియమైన నాథుడు ఆదేశించినట్లుగానే చాలా నేర్పుగా ఆమె భుక్త శేషంతో కూడిన పళ్ళాన్ని ప్రక్కకు తీసేసింది.
లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదం ఉన్న పళ్ళాన్ని ఆనందంగా నారద మునికి అందించింది. నారదముని ఎంతో ఆత్రుతగా, వినమ్రంగా ప్రసాదాన్ని ఆరగించాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ భుజించిన నారదముని, తన ఆనందోద్వేగాన్ని, ఆపుకోలేకపోయాడు. ఒక్క క్షణం కూడా హరి నామస్మరణను ఆపకుండా పారవశ్యంతో నర్తించడం మొదలు పెట్టాడు. ఆ మైమరపు తారస్థాయికి చేరి తనను తాను నియంత్రించుకో లేక వీణను పట్టుకుని, ఉన్మత్తుడిలా, ఒక లోకం నుండి మరొక లోకానికి పరిగెడుతూ, చివరికి కైలాసాన్ని చేరాడు. శివుడు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. విష్ణు-భక్తి తరంగాలలో ఈదులాడుతున్న నారదుడు శివుడిని గమనించలేదు. “నారదా! నిరంతరం నారాయణుడిని తలచుకుంటూ ఉండడం వలన, నీవు ఎప్పుడూ పరమానందంగానే ఉంటావు. అయితే ఇటువంటి స్థితిలో నిన్ను ఎన్నడూ చూడలేదు, ఏమయ్యింది నీకు?” నారదుడిని సమాధాన పరచడానికి ప్రయత్నిస్తూ శివుడు ప్రశ్నించాడు. నారదముని కాస్త స్థిమిత పడి, జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు. “భగవంతుడి మహా ప్రసాదం స్వీకరించిన ఆనందంలో ఆ తరువాత నన్ను నేను మరచిపోయాను, పారవశ్యంలో మునిగిపోయి స్వామివారి కీర్తన, నర్తనలో మునిగిపోయాను.” ఊపిరి తిప్పుకోకుండా నారదుడు తన అనుభవాన్ని వివరిస్తుంటే, శివుడు రెండు చేతులూ జోడించి, “ఓఁ నారదా! నీవెంతటి భాగ్య వంతుడివి?! నారాయణుడి మహా ప్రసాదాన్ని రుచి చూసే అదృష్టం నీకు లభించింది, ప్రియమైన నారదా! నా కోసం కాస్త ప్రసాదం తెచ్చే ఉంటావు కదా!” అంటూ చాలా నమ్మకంగా చిరు నవ్వు నవ్వాడు.
శివుడి కోసం తను ప్రసాదం తీసుకు రానందుకు నారదుడికి విచారం కలిగింది. తలవాల్చుకుని, చేతులు జోడించి, శివుడి ఎదుట నిలబడ్డాడు, అప్పుడతడికి తన చేతి వేలి గోటికి అంటుకుని ఉన్న ప్రసాదం కాస్త కనిపించింది. వెంటనే భారం తగ్గినట్లుగా ఊపిరి వదిలి, “నిజమే! ఇదిగో, నీకు మాత్రమే సరిపోయే ‘కనిక మ్రాత’ ప్రసాదం.” తన చేతిని చాలా జాగ్రత్తగా ముందుకు చాచి “నీవు చాలా అదృష్టవంతుడివి, ఇదిగో ప్రసాదం” అంటూ తన వేలిని శివుడి నోటిలో పెట్టాడు.
ఎప్పుడైతే అల్ప పరిమాణంలో ఉన్న ప్రసాద లేశం మహాదేవుడి జిహ్వకు తాకిందో వెంటనే తీవ్రమైన ఆనందంతో అతని ఒళ్ళు గగుర్పొడిచింది. వెంటనే ఆనందోద్రేకంతో తాండవం చెయ్యడం మొదలు పెట్టాడు, అతనిలో పారవశ్యం ఎక్కువవుతూ ఉంటే, నాట్యంలో ‘వడి’ కూడా పెరిగింది. రాన్రాను ఆ నాట్యం ప్రళయ తాండవంగా మారసాగింది. సమస్త జగత్తు కంపించడం ప్రారంభమయ్యింది, అందరూ భయంతో వణికి పోయారు, “ఏం జరుగుతూ ఉంది? జగత్తు అంతం కావడానికి ఇది సమయం కాదు, అకాలంలో ఈయన ఎందుకు నర్తిస్తున్నాడు?”
శివుడు చేస్తున్న విలయ తాండవాన్ని ఆపడానికి ఎవరికీ ధైర్యం చాల లేదు. దేవతలందరూ పార్వతీ దేవి దగ్గరకు వెళ్ళి, “ఆయనను శాంత పరచమనీ, లేదంటే విశ్వం అంతరించడం తప్పదని” మొరపెట్టుకున్నారు. పార్వతీ దేవి అక్కడకు వచ్చి ఆపడానికి శక్యం కానంతటి భావావేశంలో నర్తిస్తున్న శివుడిని చూసింది. ఆమె చొరవ తీసుకోవడంతో బాహ్యస్మృతిలోకి వచ్చాడు శివుడు. “ప్రాణనాథా! ఏం జరిగింది? మీ అదుపు తప్పిన పారవశ్యానికి కారణం ఏమిటి”? అని పార్వతీ దేవి పశ్నించింది.
సమాధానంగా శివుడు, నారద ముని నుండి నారాయణుడి మహా ప్రసాదాన్ని పొందిన విషయాన్ని గురించి వివరించాడు, ఆమె దిగ్భ్రమతో “నాథా! నా కోసం కాస్త ప్రసాదాన్ని ఉంచారా?” అంటుంది. శివుడు సమాధానం ఇవ్వలేక పోతాడు. ఎందుకంటే అతనికి దొరికిందే అణువంత, అందులో మళ్ళీ పార్వతి కోసం ఉంచడం ఎలా సాధ్య పడుతుంది? తనకు ప్రసాద భాగ్యం లేదని తెలియగానే ఆమెకు ఆవేశం ముంచుకొచ్చింది. ఆమె ఆగ్రహ జ్వాలలు అధోలోకాల నుండి ఊర్ధ్వలోకాల వరకు పాకాయి. ముల్లోకాలలోని సమస్త ప్రాణికోటీ దహించివేస్తున్న ఆ వేడిమిని భరించలేక పోయింది. ఋషులూ, సాధు పురుషులూ, ఆమె క్రోధాగ్నిలో సమస్తము అంతం కాబోతుందని అర్థం చేసుకున్నారు. శివుడితో సహా ఎవరూ ఆమె కోపాగ్నిని చల్లార్చలేక పోయారు.
చివరికి దేవతలందరినీ వెంట బెట్టుకుని, బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి పరిస్థితిని గురించి వివరించాడు. వెంటనే నారాయణుడు గరుడునిపై ఎక్కి కైలాసాన్ని చేరుకున్నాడు. ఆయనను చూడగానే పార్వతీదేవి ముందుకు వచ్చి గౌరవ ప్రణామాలు అర్పించింది. నారాయణుడు వాత్సల్యంతో ఆమెను ఆదరించి, “నీవు కోరినంత మహా ప్రసాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను, దయచేసి నీ కోపాన్ని వదిలేసి శాంతించు, లేకపోతే నీ బిడ్డలందరూ నశించి పోతారు” అని సముదాయించాడు.
అయితే పార్వతీ దేవి తన అసమ్మతిని తెలియజేస్తూ “నువ్వు నాకు మాత్రమే మహా ప్రసాదం ఇచ్చినప్పటికీ నాకు సంతృప్తి కలగదు. సమస్త ప్రాణికోటికీ నీ మహాప్రసాదం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రసాదం లభించక పోవడం వలన నేను అనుభవించిన నిరాశా, నిస్పృహలు ఇతరులు ఎవ్వరూ అనుభవించకూడదు. మనుష్యులే కాదు, కుక్కలు మొదలైన ఇతర ప్రాణులన్నీ కూడా ఈ మహాభాగ్యానికి నోచుకునేలా నీవు ఏదైనా ఏర్పాటు చేయాలి” అంటుంది.
నారాయణుడు చిరునవ్వు నవ్వి “తథాస్తు! అలాగే కానీ” అన్నాడు. “ప్రియమైన పార్వతీ, నీ కోరిక తీర్చడం కోసం నేను, నీలాచల ధామంలో అవతరిస్తాను. నా మందిరం ప్రసాద వితరణతో ప్రఖ్యాతి చెందుతుంది. నా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ భవసాగరం నుండి బయట పడగలుగుతారు. నా ప్రసాదాన్ని మొట్టమొదట నీకే అర్పిస్తారు, అప్పుడే అది మహాప్రసాదంగా అంగీకరించ బడుతుంది. ఈ మహాప్రసాదం గొప్పవాళ్ళు, అల్పులు, ప్రాణులు, హీనులు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ వితరణ చేయబడుతుంది. నీ మందిరం నా వెనుక వైపున ఆలయ ప్రాగణం లోపలనే ఉంటుంది. మహా-ప్రసాదం విషయంలో నిన్ను పట్టించుకోక పోవడం వలన, శివుడి మందిరం కాస్త దూరంలో నా ఆలయ ప్రాగణానికి వెలుపలి వైపున ఉంటుంది.”
పార్వతీ దేవికి మాట ఇచ్చినట్లుగానే భగవంతుడు జగన్నాథుడిగా పూరీ క్ష్రేతంలో వెలిశాడు. పార్వతీ దేవి ‘విమల’ అనే పేరుతో కొలువై ఉంది. జగన్నాథుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అంతా మొదట విమలా దేవికి సమర్పిస్తారు. జగన్నాథ మహా ప్రసాదాన్ని పూరీ వాసులే కాకుండా, పూరీ క్ష్రేతాన్ని దర్శించడానికి వెళ్ళిన ప్రవాసులు అందరూ కూడా భక్తితో స్వీకరించి ధన్యులవుతున్నారు
--జై జగన్నాధ//జై జగన్నాధ--
--సర్వేజనా సుఖోనోభవంతు--
No comments:
Post a Comment