Monday, October 16, 2023

ప్రతి ఒక్కరికీ ఈ టపా అనుభూతి కలుగుతుంది అని ఇలా పోస్టు చేస్తూ ఉన్నా......

 దాదాపు గా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ టపా అనుభూతి కలుగుతుంది అని ఇలా పోస్టు చేస్తూ ఉన్నా...... 🙏పోస్టు లో ఉత్తరం మాదిరిగా ఒక్క రోజు ఆలస్యం అయింది.. క్షమించండి... ఇది నా రచన కాదు.. మన నాటక రంగ మిత్రులు.. రచయిత.. ఉద్యోగ రీత్యా వాణిజ్యశాఖ లో అధికారి గా పని చేస్తున్న శ్రీ జానీ భాషా గారి కలం... కాదు కాదు.. ముఖ పుస్తకం నుండి ఎత్తి పోతల సర్.. నిన్న తపాలా దినోత్సవం సందర్భంగా..చదవండి.. 🙏ప్రపంచ తపాలా దినోత్సవం అనుకోగానే మది పులకరించి పోయి,
అప్పట్లో మా నాన్న ఉద్యోగం చేసిన "దూపాడు" (ప్రకాశం జిల్లా) అనే ఊరు గుర్తుకు వస్తుంది. అప్పట్లో పోస్టాఫీసు భవనం పెంకుటింట్లో నడిచేది. అక్కడి పిన్ కోడ్ 523330 చూడగానే ఎన్నెన్నో జ్ఞాపకాల అలలు.
ఇప్పుడొక ఆశ్చర్యం ఏమిటంటే అసలెవడైనా కార్డుముక్కైనా కొనె వాడు, ఉన్నాడా అని.
ప్రపంచ తపాలా దినోత్సవ మంటే ఏంటో ఇప్పుడు దిన పత్రిక లలో చదువు కోవడమే.
ఈ సందర్భంలో కాసిన్ని తపాలా ముచ్చట్లు.
ఆ ఊరులో నేను హైస్కూల్ చదువు కొనేటప్పుడు తపాలా కార్యాలయం తో అనుబంధం ఉండేది.

అప్పటి సబ్ పోస్టుమాస్టర్ నా క్లాసుమేట్ వేణు గాడు వాళ్ళ నాన్న. ఇక పోస్టుమాన్ "డేవిడ్" (బాబాయి అని ముద్దుగా పిలుచుకొనే వాళ్ళం )మాకెంతో ఆప్తుడు. కార్డు పై వ్రాసి పోస్ట్ చేసిన లేఖ, బాలజ్యోతిలో ప్రచురించినప్పుడు అచ్చులో పేరు చూసుకొని ఎంత ఆనందమో...

ఇక సినీ నటినటుల చిరునామాల పుస్తకం మార్కాపురం లో కొనుక్కొని వారికి ఉత్తరాలు రాయడం ఒక హాబీ. దాంతో నాకు బాలకృష్ణ, జగపతి బాబు, తులసిరామ్, సుహాసిని, జయలలిత(బోరింగ్ పాప ), నుండి వాళ్ళ ఫోటో తో లెటర్స్ మద్రాస్ నుండి వచ్చాయి. కవర్ మీద అడ్రస్ చూసి డేవిడ్ బాబాయ్ సరదాగా "టీ" ఇప్పించమని ఆట పట్టించేవాడు.

ఆ రోజు తపాలా కార్యాలయాల్లో కార్డులు,కవర్ లు స్టాంపులు అమ్మేవారు.
ఇక "కలం స్నేహం" పత్రికలలో  ఆసక్తి వున్న   స్నేహితుల చిరునామా లు ఉండటంతో  ఉత్తరాలు వ్రాసుకోవడం అలవాటు ఉండేది. ప్రతి వారు వారి ఊరి వర్ణనలతో, తమ కుటుంబ విషయాలు తో తరచు లెటర్స్ వ్రాసుకునేవారు.
జవాబు కోసం ఎదురుచూడడం లో మజా..
పోస్ట్ మెన్ కోసం వీధి గుమ్మంలో నిరీక్షణలు
ఏవండీ పోస్ట్ మెన్ వెళ్ళిపోయాడా అనీ ఆరాలు తీయడం. కలం స్నేహితుల క్లబ్ లో నేను  కూడా ఒక సభ్యుడి ఉండటం తలుచుకుంటే ఇప్పటికి భలే ఆనందం.

దారిలోనే కాపు కాచి 
నాకేదైనా టపా ఉందా అని పొస్ట్ మెన్ చేతిలో సంచీలో ఉత్తరాలకట్టలు తిరగేయించడం అప్పట్లో భలే సరదాగా ఉండేది.
 ఉరికంతా వుండే ఒకే పోస్ట్  మేన్ డేవిడ్ కు దసరా వస్తే కచ్చితంగా పండుగ మామూలు ఇవ్వాల్సిందే. పాకెట్ మనీ దాచుకున్న దాంట్లో అతనికి కొంచం.
కాకీ డ్రస్ లో భలే ఆదరంగా ఏం మాత్రం విసుక్కోకుండా ఉత్తరాలు ఇచ్చేవాడు.

 మా మిత్ర బృందం క్లాస్ లో ఎవడ్నేనా ఏడిపించాలను కుంటే స్టాంపులు అంటించకుడా డ్యూ కవర్ పంపేవాళ్ళం. దాంతో డ్యూ కట్టడంతో పాపం వాళ్ళు దాచుకున్న పాకెట్ మనీ క్రిష్ణార్పణం.

ముఖ్యంగా డిసెంబర్ జనవరిలలో గ్రీటింగ్ కార్డుల బట్వాడా చాలా ఎక్కువగా ఉండేది. ఎవరికీ ఎక్కువ కార్డ్స్ వస్తే వాడు గ్రేట్ ఫీలింగ్ ఉండేది. వాటిని చాలా రోజులు భద్రంగా దాచి పెట్టుకునే వాళ్ళము.

"టపా" అంటే ఆ రోజుల్లో పాఠ్య పుస్తకాలలో వుండే ఎర్రటి డబ్బా ఎప్పటికి అందరికి గురుతే.
కార్డు పదిపైసలు,
ఇన్లాడ్ కవర్ ఇరవైపైసలు,   అంటించే కవర్
ముఫై పైసలు.
అని తెలుసు.
 ఆ తర్వాత ముప్పావలా కి పిన్ కోడ్ పుస్తకాలు అమ్మేవారు.

ఇక టెలిగ్రామ్ పిలుపు వినపడితే ఆందోళన తో గుండెలు  జారిపోయేవి.
అవి ఎక్కువగా అశుభ కబుర్లు మోసుకొచ్చేవి.
అప్పడప్పడు అరుదుగా మీకు ఉద్యోగం వచ్చింది. అర్జెంట్ గా జాయిన్ అవ్వండి అనే శుభవార్త కూడా.

తర్వత  పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ లుగా విడి పోయాయి.  తంతి పోయి కేవలం తపాలా గా మిగిలింది . తంతి అంటే  తీగలపై వార్తలు టెలిగ్రాఫ్ మిపన్ పై కొడతారు. కాల క్రమేణా తంతి కాస్త టెలి ఫోన్స్ గా మారి పోయాయి.

తపాలా పెట్టెపై
ఊరు
పిన్ నంబరు
తెరచు వేళలు
ఆదివారములు శలవుదినములలో ఉత్తరములు తీయబడవు అని వ్రాసేవారు.
ఉత్తరాలు ఒక కవి చెప్పినట్లు దూరాలను కలిపే దారాలు.

ఉత్తరాల ముగింపులో 
సమాధానం జరూరు,
నీ జవాబుకై ఎదురు చూస్తూ..,
ఇంతే సంగతులు,
తప్పులుంటే మన్నించగలరు
ఇక వుంటాను సెలవు..      వివిధ ముగింపులు ఉత్తరాలకు కొస మెరుపులు.
ప్రముఖుల జవాబులు ఇప్పటికి ఆల్బమ్ లో దాచుకునే అపురూపాలు.
అక్షరాలకు రూపం ఇవ్వండి అవి లేఖలు అవుతాయి. వాటిని పోస్ట్ చేస్తే అవి అందుకొనే వారి అనుభూతి వర్ణనాతీతం. 
నేటి బిజీ జీవితాలలో
జాబులు వట్టి 
పోయాయి. చేతులతో పని వదిలేసి, ఇప్పుడు కళ్ల తో టి. వి నో, సెల్ చూడడం తో ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగాము.
ఈనాటి ప్రపంచ తపాలాదినోత్సవ వేళ అలనాటి పోస్టల్ శాఖతో నా అనుబంధం మరియు మధుర జ్ఞాపకాలు ఇలా అక్షర రూపంలో మీతో ఇలా పంచుకుంటూ..
ఇంతే సంగతులూ
చిత్తగించవలెను.
ఇట్లు..
భవదీయుడు
మీ...సయ్యద్ జానీబాషా, కవి, రచయిత, గుంటూరు 
అక్టోబర్ 9 తేది ప్రపంచ తపాలా దినోత్సవ సందర్బంగా..🙏🙏వేరే గ్రూప్ నుండి సేకరించి

No comments:

Post a Comment