🌺 అమృతం గమయ 🌺
*భగవత్ దర్శనమునకు అర్హతలు*
*సత్ చిత్*
*కోప భావము తగదు*
*"తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబౌ తన సంతోషమే స్వర్గము - తన దుఃఖమే నరక మండ్రు తథ్యము సుమతీ !"* అని సుమతీ శతకకారుడు ఏనాడో చెప్పారు. శత్రువులకి దూరంగా ఉండాలని ప్రతివారు అనుకుంటారు. మరి శత్రువైనటువంటి కోపమునకు దూరంగా ఉండాలని వేరుగా చెప్పనవసరం లేదు కదా ! ఈ కోప భావమును ఎంత నశింపచేసుకున్న అంత భగవంతునికి దగ్గర కాగలడు. పదే పదే ఒక -
విషయాన్ని ధ్యానం చేయడం వలన లేక తలచుకోవడం వలన మనకు దాని పట్ల కామం అనగా కోరిక కలుగును. కోరిక తీరకున్న కోపం జనించును. అనగా మనకు ఇష్టము లేని రీతిలో ఒక మాట కాని , ఒక చేతకాని ఒక సంఘటన కాని జరిగినచో *"కోపము"* ఎంతగా వచ్చునో చెప్పజాలము. కండ్లు ఎర్రబారును. స్వరము పెద్దదగును. శరీరము వణుకును. ఆవేశముతో తన్ను తానే మరచును. దాని వలన మతి చెడిపోవును. ఎవరితో ఏమంటున్నామో , ఏమి చేస్తున్నామో తెలియక బుద్ధి పనిచేయుట మానివేయును. పనిచేయక విచక్షణా జ్ఞానము నశించినచో ఇంకేమున్నది అంతయూ సర్వనాశనమే. ఆ కోపముతో మనుషులూ దూరము కావచ్చును. మనసులూ విరిగిపోవచ్చును. హత్యలూ , ఆత్మహత్యలూ జరిగిపోవచ్చును.
ఒక్కసారి వచ్చెడి కోపమువల్ల మనము ఎప్పటినుంచో ఆర్జించిన దైవశక్తి అంతయూ ఒక్కసారిగా నశించిపోవునన్న , ఇక ఎల్లప్పుడూ కోపముగా ఉండెడివారు ఉద్ధరింపబడు మార్గమేమైనా అసలు ఉండునా ? ఈ కోపమును పొగొట్టుకొనెడి మార్గము ఏది ? సమచిత్తము అలవరచుకొన్నచో దానివలన శాంతి లభించి శాంతము అలవాటై కోపమనునది చెప్పకనే పోవును. సమచిత్తము అనగానేమి ? సర్వ మానవులపట్లను , సర్వ జీవుల ఎడలను రాగ , ద్వేషాదులు లేకుండా యుండుట , రాగము బంధ కారణము. ద్వేషము నాశనమునకు మూలము. సర్వ జీవుల యందును భగవత్ ప్రేమ కలిగియుండుట , సుఖ దుఃఖములయందు , లాభ నష్టములయందు , శీతోష్ణముల యందు , జయాపజయముల యందు అట్లే సమచిత్తులై యున్నచో , స్తుతులకు పొంగక , నిందలకు క్రుంగక యున్నచో ఇక కోపమునకు తావెక్కడిది ? కోపమునకు తావులేని స్థలము , ఆ శాంతమూర్తి అయిన పరమాత్మ నెలవే. సందేహము లేదు. వ్రత నియమాదులు తెలియకపోయినా కోపతాపములు మానిన చాలును. అదియే భగవత్ దీక్ష అని పెద్దలు అన్న మాటలను ఇచ్చట ప్రతిఒక్కరు గుర్తున్చుకొనవలయును.
*దయ*
*"దయగల హృదయము భగవన్నిలయము".* భగవత్ దర్శనార్ధులకు ఉండవలసిన మరో ముఖ్య సుగుణము దయ. పరమేశ్వరుడు దయాసముద్రుడు. అటువంటి పరమాత్మ దరిచేర వలయునన్న మన హృదయమూ "దయ" అనెడి ద్రవమై పోవలయును. అప్పుడే భగవత్ యోగము సాధ్యము. లేనిచో జటిలమే. పెద్దలపట్ల , వృద్ధులపట్ల , అశక్తులపట్ల , రోగిష్ఠులపట్ల , సర్వ జంతువుల పట్ల అది ఇది అననేల సర్వ ఆర్తజనులపట్ల ఆశ్రితుల , ఆపన్నుల పట్లనూ దయకలిగి తన మనో వాక్కాయ కర్మలతో ఏలాంటి ఉపకారము వారికి చేయగల్గినను చేయవలెను. ద్రోహచింత కలిగి యుండెడి శత్రువు చేత చిక్కిననూ దయతో బుద్ధి చెప్పి వదిలిన అతడు జన్మలో అట్టి క్షమాబిక్షను మరువజాలడు. దయ కలిగిన నిర్మల హృదయ దర్పణమున పరమాత్మ పలు వన్నెచిన్నెలతో ఆనంద నాట్యమాడుచూ ప్రతిబింబించును. ఇక ఆలస్యమేల ? నేటినుండే *"దయ"* అనెడి ఆచారమును మన మనస్సునకు లేక హృదయమునకు నేర్పుదుము.
*అహింస*
*"అహింసా పరమోధర్మః"* అనునది వేదవాక్యము. వేదము పరమాత్మ ప్రణితము. అనగా పరమేశ్వరుని అభిమతము. హింసను వీడి అహింసను ఆచరించుట. సర్వజీవులయందునూ చరాచర ప్రపంచమునంతటనూ ఆ పరమాత్మనే చూతును అని దీక్షపట్టి జీవన వ్రతం ఆచరించే భగవత్ బంధువులు ఎవరిని హింసింతురు ? సృష్టియంతయూ పరమేశ్వర ప్రతిబింబమే అని తెల్సుకోగల భక్తుడు దేనిని కూడా హింసించుట మానగలడు. హింస అనగా దేనినైనా , వేనినైనా , ఎవరినైనా చంపుట మాత్రమేనని అర్థము చెప్పుకొని *"మేమెవ్వరినీ హత్య చేయలేదు కనుక అహింసా వ్రతమును అక్షరాల పాటించు చున్నాము"* అని గుండెలమీద చేయివేసుకొని చెప్పువారు ఎందరో కలరు. హింస అనగా చేతులతో చంపుటయేనా ? మాటలతో హింసించి చంపువారెందరు లేరు ? దీనికన్నా ఒక్కసారి చేతులతో చంపుటయే మేలు. అట్లు వాక్కులతోనే కాక ఎవరికైనా మనస్సులో గూడా ఎన్నడూ హింసించాలని తలపెట్టనివాడే అహింసావ్రతుడు. అనగా ఏమి ? మనో వాక్కాయ కర్మలతో అండము మొదలు బ్రహ్మాండము వరకు ఎవరినీ , దేని నీ ఎప్పుడైననూ , ఏచోటనైననూ హింస లేక చెడుతలపెట్ట కూడదన్న మాట. బాధించకూడదన్నమాట. స్వలాభమునకు గాని , పరలాభమునకు గాని ఏ జంతువునూ చంపరాదు. ఎట్టిమానవునితోను అతని కిష్టము లేని విధమున ప్రవర్తించరాదు. అదియే అహింస. సర్వ చరాచరాంత స్థితుడైన పరమాత్ముని , సకల సృష్టియందును చూడగలిగి , సకల జీవుల హృదయుములనుండి ఆ పరమాత్ముని అహింస అనెడి మహా మంత్రముతో సంతుష్టపరచ గలిగిన వానియొక్క దేహమే దేవాలయము. ఆతడు సాక్షాత్తు ఆ పరమాత్ముడే. కావున భగవత్ బంధువులారా ! అహింస అనెడి అమృతము పంచి గ్రోలి , చిరాయువులు కండు.
*సత్య దీక్ష*
సత్య దీక్ష భగవత్ సాన్నిధ్యమునకు సరాసరి రాచమార్గము. కావున జీవన వ్రతానుష్టాన పద్ధతులయందు ఖచ్చితముగా అనుష్ఠించవలసిన ఆవశ్య కర్తవ్యము సత్యమునే పలుకుట. ఆధ్యాత్మిక జీవన దీక్ష లో అడుగిడిన క్షణము నుండి తాను ఆ పరమాత్ముని లక్షణాలను అనుసరించడం సాధన కావలయును. సత్యం , జ్ఞానం , అనంత బ్రహ్మ అనునది పరమాత్మ లక్షణము , ఆ పరబ్రహ్మలక్షణము. అట్టి పరమాత్మ తానే కావలెనని ఆధ్యాత్మిక దీక్ష బూనిన భక్తుడు ఏ కార్యమునందైననూ , ఎట్టి పరిస్థితి యందైననూ , ఏ విధముగానైననూ అసత్యమాడవలదు. పరమాత్మా ! అసత్య మాడుటకన్నా రౌరవాది నరకమునకు దగ్గర దారి మరియొకటి ఉండునా ? ఖచ్చితముగా యుండదు. అది మహాపాప కార్యము. సత్యస్వరూపుడైన పరమాత్ముని సాధనలో సాధకుల హృదయమునందు అసత్యమునకు స్థానమొసంగకూడదు. ఆడి తప్పకుము. పరమాత్ముని చే నిరాదరణ పొందుకుము. సత్యమే మనకు శ్రీరామరక్ష.
*ఓం పరమాత్మనే నమః*
*హ్రీం పరమేశ్వరీ పరా దేవతాయై నమః*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*
No comments:
Post a Comment