ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు! చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు. సాధువుకు సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. ‘‘ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను.
నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే... మనిషికి తృప్తి ముఖ్యం
అటువంటి తృప్తి లేనివారు ఎంత ఉన్నా అసంతృప్తితో బాధపడుతూ జీవనం సాగిస్తున్నారు.తృప్తిలేని జీవనంలో ఎన్నో ఆటుపోట్లను చవి చూడాల్సివస్తుంది.లేని పంచభక్ష్య పరమాన్నం కన్నా ఉన్న గుప్పెడు పచ్చడి మెతుకులు చాలా రుచి అని సంతృప్తి చెందిదే చాలు కదా!! జీవితంలో ఏం కావాలను కుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా భాదను కలిగిస్తుంది. దక్కిన దాంట్లోనే ఆనందం వెతుక్కునే వారు మరో రకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. ప్రక్రియ, ప్రయాణం, ప్రయత్నం మూడింటిలోనూ ఆనందముంటుందని గ్రహించాలి. మనిషికి ఎప్పుడు, ఏది ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికీ జీవితాలు ఆశ్చర్యాలు, సాహసాలు, చర్య, ప్రతిచర్యల సమాహారమే జీవితం. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించే వారు కొందరైతే, మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించే వారు మరి కొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామనేదే ముఖ్యం. అదే జీవిత సత్యం.
మనిషి అభ్యాసం కోసమే ఈ ప్రపంచం. చేయాల్సిన దాన్ని విసుగు లేకుండా సాధన చేయడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ఆ కర్తవ్య నిర్వహణే వ్యక్తిత్వాలను నిర్మిస్తుంది. అదే మనిషికి పరిపూర్ణతను, ముక్తిని ప్రసాదిస్తుంది. కర్తవ్యం అవసరమైన క్రమశిక్షణను, ఒక సమస్థితిని నేర్పుతుంది. మనిషికి. "అన్ని జీవుల పట్ల ప్రేమ కలవాడు, నిజాన్ని మాట్లాడేవాడు, సున్నిత మనస్కుడు, ఉన్నత భావాలు కలవాడు, అందరినీ ఆదరించేవాడు, అతిచనువు చూపనివాడు, మంచి మనసు ఉన్నవాడు ప్రపంచంలో అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతాడని, కీర్తి మంతుడవుతాడని విదురుడు స్పష్టం చేశాడు. పెద్దలు చెప్పినట్లు - సత్సంగం కల్పవృక్షం లాంటిది. ఇది ఐహిక ఆముష్మికాభీష్టాలను సాధించి పెడుతుంది. అయితే వారు చెప్పింది చిత్తశుద్ధితో ఆచరించాలి. మహాత్ములు ఉపదేశించిన మంచి మాటలే అమృత వృష్టి - మనలోని పాపాలన్నింటినీ మటుమాయం చేస్తుంది.
No comments:
Post a Comment