Thursday, September 26, 2024

 *ఆదిశక్తి యొక్క లీలాకథలు* 
*2.భాగము* 

 *శ్రీ దుర్గాసప్తశతీ యొక్క రహస్యార్థం* 

ఆదిశక్తి యొక్క లీలలే గాథలై శ్రీదుర్గాసప్తశతీగా రూపుదాల్చి అవతరించినది. ఆదిశక్తి నిత్యమైనది. ఆమె లీలలుకూడా నిత్యమైనవి.

ఆ లీలలను వర్ణించేటటువంటి కథ అయిన ఈ దుర్గాసప్తశతీ కూడా నిత్యమైనదే! దేవి యొక్క ఇతర అవతారాల వలెనే యుగయుగాలలో ఇది కూడా ప్రకటీకృతమైనది. 

మన యొక్క ఈ యుగంలో ప్రస్తుతం అమలులో ఉన్న శ్రీదుర్గాసప్తశతీ యొక్క రూపాన్ని గురించి పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. 

వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని మార్కండేయమహర్షిని ఈ కథల యొక్క విచిత్రతను, విశిష్టతను గూర్చి ప్రశ్నించగా, ఆయన తనకు తగినంత సమయం దొరకనందున, 

ద్రోణముని నలుగురు కొడుకులైన పింగాక్షుడు, వివోధుడు, సుపుత్రుడు, సుముఖుడు అనువారి వద్దకు ఆయన జైమినిని పంపించారు. 

తమ తండ్రి ఇచ్చిన శాపకారణంగా పక్షియోనిలో జన్మించిన ఆ నలుగురు 
ఆ సమయంలో వింధ్యపర్వతం మొక్క గుహలలో నివసిస్తున్నారు. 

మార్కండేయముని, కోష్టుకి భాగురికి చెప్పిన 14 మన్వంతరాల విశేషాల సంవాదాన్ని ద్రోణపుత్రులు వినియుంటిరి. ఆ వివరాలను వారు జైమినికి చెప్పారు. 

అందులో ఎనిమిదో మన్వంతరానికి చెందిన విశేషాలలో ఈ దుర్గాసప్తశతీ యొక్క కథ వస్తుంది.

ఈ గాథలను గురించిన విశేషాలకు ఉపనిషత్తులలోని వేదాంత చర్చను జోడించినచో, తల్లియైన ఆదిశక్తి వలెనే, ఆమె కథలు కూడా పూర్ణమైనవే అన్న విషయం మనకు బోధపడుతుంది.

'ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే  పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే 

అని ఉపనిషత్తు వాక్యం. బృహదారణ్యకోపనిషత్తులోని పంచమాధ్యాయం యొక్క ప్రథమ బ్రాహ్మణమునకు చెందిన మొట్టమొదటి ఖండికలో ఇమిడివున్న భావం ద్వారా భావమయి అయిన 
ఆ దేవి పూర్ణమైనది. 

ఆమె యొక్క ఈ సప్తశతిలోని కథావతారం కూడా పూర్ణమైనదే. ఎందుకనగా 
ఆ పూర్ణత్వంలోనుండే ఈ పూర్ణత్వం ఉదయించినది. 

అంతేకాదు, పూర్ణంలోనుండి పూర్ణమును తీసివేసినప్పటికి పూర్ణత్వమే మిగిలిఉంటుంది అని కూడా మనకు అర్థమౌతుంది.

ఉపనిషత్తులు ఏ బ్రహ్మ గురించి చర్చించునో, 
ఆ బ్రహ్మం జగదంబయే!! దేవ్యధర్వశీర్షంలో ఆమెయే స్వయంగా 'అహం బ్రహ్మాస్వరూపిణి' అనగా నేను బ్రహ్మ రూపమును అని ప్రకటించింది. 

అంతేకాదు వేదోహం అని కూడా సెలవిచ్చినదామె. అనగానే వేదాన్ని అని అర్థం. ఆదిశక్తి యొక్క ఉపాసకులైన సాధకులు ఒకొక్క యుగం లోనూ అనుభూతి చెందిన, 

ఈ అంశం ఎంతో సత్యమైనది. ఆ తల్లి వేదమే. కాదు, వేదజననికూడా!సూత్రరూపంలో ఆమె గాయత్రీ అయితే, శాస్త్రరూపంలో శ్రీదుర్గాసప్తశతీగా విలసిల్లుతున్నది. 

వేదాలలో చెప్పబడిన విషయమే మంత్రరూపం లోనూ, సూత్రరూపంలోనూ, గాయత్రీమంత్రం యొక్క 24 అక్షరాలలో, 9 శబ్దాలలో, మూడు చరణాలలో కూడా వ్యక్తీకరించబడియున్నది. 

ఈ తత్త్వమే శ్రీ దుర్గాసప్తశతీ మొక్క మూడు చరిత్రలలో, 
13 అధ్యాయాలలో చెప్పబడియున్నది.

శ్రీ దుర్తాదేవి మొక్క 9 రూపాలలో గాయత్రీమంత్రం యొక్క 9 శబ్దముల మర్మం ఇమిడిఉన్నది. శ్రీదుర్గాసప్తశతి యొక్క సంపూర్ణతత్త్వమును తెలియజేయుటకు భగవంతుడైన సదాశివుడొక్కడే సమర్థుడు. 

మహాకాలుడైన ఆ పరమేశ్వరుడు మహాకాళియైన పరమేశ్వరి యొక్క లీలలనుగూర్చి తెలిసినవాడు. మేరుమంత్రములో ఆయన 
ఈ క్రిందివిధంగా వచించియున్నాడు.

సప్తశత్యాక్ష్వ సకలం తత్త్వం వేద్యయమేవహి || 
పాదోనం శ్రీహరిర్వేత్తి వేత్యర్థం తు ప్రజాపతిః  వ్యాసుయ్యాంశకం వేత్తి కోట్యంశమితరే జనః 

అనగా “శ్రీదుర్గాసప్తశతీ యొక్క సంపూర్ణమైన రహస్యాన్ని గూర్చి నాకు మాత్రమే సంపూర్ణంగా తెలియును. విష్ణుభగవానునకు దీనియొక్క మూడు పాదాలను గురించిన విషయాలు తెలుసు. 

బ్రహ్మదేవునికి రెండు పాదాలను గురించిన జ్ఞానమున్నది. ఇతరులైన జనులు దీనిగురించి కేవలం కోటిలో ఒక వంతు మాత్రమే తెలుసు కొనగలరు' అని అర్థం.

ఈ ఒకవంతు కూడా ఎంత మహత్త్వపూర్ణమైనదంటే దీని అనుభూతి చెందిన తరువాత జీవితంలో ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధపురుషార్ధములు వాటంతట అవే లభ్యమవుతాయి. 

ఆతల్లి యొక్క దయ అనే కొంగునీడలో కూర్చున్నంత మాత్రముననే సమస్తమైన కష్టములు, ఆపదలు వాటంతట అవే తొలగిపోతాయి. 

అన్నిరకములైన భౌతిక, ఆధ్యాత్మిక సంపదలు తామే స్వయంగా నడచివచ్చి సాధకుని చెంతకు చేరగలవు. శ్రీ దుర్గాసప్తశతిని ఒక పుస్తకం అని మాత్రమే అని భావించేవారు. 

మూర్ఖులే అవుతారు. తన సంతానం పట్ల ఎంతో వాత్సల్యం కలిగిన తల్లియొక్క మంత్రరూపమిది. దీని చెంతకు వచ్చినవారికి జగన్మాత యొక్క ప్రేమ, మమతలేకాదు, 

వారు కోరుకున్నవి ఏదైనాసరే ప్రతిక్షణమూ లభిస్తూనే వుంటాయి. ఇంతకన్నా అధికంగా ఏమి చెప్పగలం? దీని సహాయంతో అసంభవమనుకున్నవి కూడా సంభవమై తీరుతాయి.

వేదమయి, దేవజనని యొక్క రూపమైన శ్రీ దుర్గాసప్తశతీని 
ఏ సాధకుడైనాసరే ఎంతో సహజంగా అర్థం చేసుకొనగలడు. వేదాలకు ఆరు అంగాలు ఉంటాయి. 

1. శిక్ష 2. కల్పం 3. వ్యాకరణం 4. నిరుక్తం 5. ఛందశ్శాస్త్రం 
6. జ్యోతిష్యం. ఈ ఆరు వేదాంగముల వలెనే శ్రీ దుర్గాసప్తశతికి కూడా ఆరు అంగాలు ఉన్నాయి.
7. 1. శ్రీదేవీ కవచము 
2. అర్గళా స్తోత్రము 
3. కీలకం 
4. ప్రాధానిక రహస్యం 
5. వైకృతిక రహస్యం 
6. మూర్తి రహస్యం. ఈ ఆరు అంగాలలోనూ జీవితం సృష్టి ఈ రెండింటికి సంబంధించిన వివిధరకాలైన రహస్యాలు ఇమిడిఉన్నాయి. 

తన మూలరూపంలో శ్రీ దుర్గాసప్తశతీ మూడువేదముల స్వరూపం. ఋగ్వేద స్వరూపమైన ప్రథమ చరిత్ర  సృష్టి జ్ఞానాలకు చెందిన మొట్టమొదటి (తొలి) రహస్యాలను వెల్లడిచేస్తుంది. 

యజుర్వేదస్వరూపమైన రెండవ చరిత్రలో జీవితం సృష్టి ఈ రెండింటి యొక్క అభివృద్ధికి చెందిన ఆధ్యాత్మిక సూత్రములున్నాయి. 

ఇక మూడవ చరిత్ర సామవేదస్వరూపం. ఇందులో పరా అపరా ప్రకృతికి చెందిన జ్ఞానానికి సంబంధించిన గీతములు గానం చేయబడ్డాయి.

గాయత్రీమంత్రం వేదాలయొక్క సారం. ఆ విధంగానే నవార్ణమంత్రం శ్రీ దుర్గా సప్తశతీయొక్క సారం. 

గాయత్రీమహామంత్రం యొక్క ప్రథమ బీజాక్షరమైన 'ఓంకారం' యొక్క భావం నవార్ణమంత్రం యొక్క వాగ్బీజమైన 'ఏం'తో కలుస్తుంది. 

వ్యాహృతీ త్రయం యొక్క ఉత్కృష్టభావం మాయా బీజరూపమైన హ్రీం శబ్దముతో కలుస్తుంది. వ్యాహృతులు సంపూర్ణమైన క్రియాశీలతను కలిగి ఉంటాయి. 

నవార్ణంలో మాయను గూర్చి చెప్పబడియున్నది. గాయత్రీమంత్రం యొక్క ఒకటవ, రెండవ పాదాలకు
ఆ తేజోమయుడైన, శ్రేష్ఠుడైన, సర్వవ్యాపకుడైన భగవంతుడిని నేను "ధ్యానిస్తున్నాను" అని అర్థం. 

మనస్సు దేనినైతే ధ్యానిస్తుందో ఆ రూపంలోకి మారిపోతుంది. సాధకుడు సవితామయుడుగా మారే భావం నవార్ణమంత్రం యొక్క 'క్లీం' బీజంలో నిహితమైయున్నది. 

'ధియోయోనః ప్రచోదయాత్' అనగా 'ఎవరైతే నా బుద్ధిని సన్మార్గంవైపు ప్రేరేపించు చున్నారో' అని అర్థం. 

చాముండాయై విచ్చే అనే శబ్దం కూడా ఇదే భావాన్ని కలిగియున్నది. అనగా 'చాముండీదేవిలో నేను అర్పితం కాగోరుతున్నాను' అని అర్థం. 

గాయత్రీ మంత్రంలో సాధకుడు 'స్థితిలో గతిని' కోరుకుంటున్నాడు. నవార్ణమంత్రంలో సాధకుడు 'ఎవరిలోనైతే ఈ విశ్వం యొక్క ఉత్పత్తి, స్థితి, లయ ఈ మూడు కూడిఉన్నాయో, ఎవరైతే ఈ విశ్వం యొక్క గతిని పర్యవేక్షిస్తున్నారో, 

'చణవేగేతిచాముణ్ణా' అని చెప్పకే ఆ చాముండిలో తీవ్రమైన వేగంలో), విచ్చే శరణు పొందగోరుతున్నాడు లేదా అర్పణ చేసుకొన గోరుతున్నాడు. 

ఈ విధంగా గాయత్రీ మంత్రం యొక్క సంపూర్ణ భావం నవార్ణమంత్రంలో ఉంది.
ఇంతేకాదు శ్రీదుర్గాసప్తశతి స్వయంగా గాయత్రీ మంత్రమయమే!! 

గాయత్రీ మంత్రం యొక్క మూడు పాదాలు శ్రీదుర్తాసప్తశతీ యొక్క మూడు చరిత్రలకు ఆధారమైయున్నది. గాయత్రీ మంత్రం యొక్క మొదటి చరణమైన 'తత్సవితుర్వరేణ్యం' దుర్గాసప్తశతీ యొక్క ప్రథమ చరిత్ర. 

ఈ చరిత్ర యొక్క అధిష్ఠాన దేవత మహాకాళి. ఋషి బ్రహ్మా సృష్టి ఉత్పత్తి సమయంలో, అంధకారాన్ని నశింపచేయుటకై మహాకాళి క్రియాన్వితమౌతుంది. 

గాయత్రీమంత్రంలోని మొదటి పాదాన్ని సాధకుడు హృదయంగమం చేసుకుని, ఎప్పుడైతే సవితాదేవతను తన ఆరాధ్యదైవంగా ఎన్నుకుంటాడో, 

అప్పుడే అతని అస్తిత్వంలోని అంధకారం తొలగిపోవడంతో పాటు, ఆధ్యాత్మిక ఉషోదయం ప్రారంభమౌతుంది కూడా!!

గాయత్రీ మంత్రం యొక్క రెండవ పాదమైన 'భర్గోదేవస్యధీమహి'కి విస్తృతమైన వివరణ శ్రీదుర్గాసప్తశతీ యొక్క మధ్యమ చరిత్రలో ఉన్నది. 

ఈ చరిత్రకు అధిష్టాన దేవత 
శ్రీ మహాలక్ష్మీ, ఋషి-శ్రీమహవిష్ణువు, 'భర్గోదేవస్యధీమహి' అనగా సవితాదేవత యొక్క తేజస్సును ధరించిన సాధకునకు యోగం, ఐశ్వర్యం లభ్యమౌతాయని అర్థం. 

అతనికి పాలనా, పోషణా సామర్థ్యం కలుగుతుంది. దీనినే విష్ణుతత్త్వంగా, మహాలక్ష్మి యొక్క కృపగా తెలుసుకొనవలెను. 

గాయత్రీమంత్రం యొక్క మూడవపాదం 'ధియోయోనః ప్రచోదయాత్.' దీనియొక్క వివరణ శ్రీదుర్గాసప్తశతీ యొక్క మూడవ చరిత్రలో పొందుపరచబడినది. 

దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత కాగా, ఋషి- రుద్రభగవానుడు. ఈస్థితిలో సాధకుడు తన కర్మబీజాలను సంపూర్ణంగా నశింప జేసుకొని, మోక్షజ్ఞానాన్ని పొందుతాడు. 

ఇదే గాయత్రీమంత్రం యొక్క చరమ లక్ష్యం. ఇక్కడ భగవంతుడైన రుద్రదేవుని కృప, మహాసరస్వతియొక్క జ్ఞానం ప్రకటీకృత మౌతాయి. 

శ్రీదుర్గాసప్తశతీకి చెందిన రహస్యార్థములు ఇంకా మరెన్నో కలవు. వాటినన్నింటినీ కూడా మున్ముందు క్రమంగా వివరించబడతాయి.

 *ఓం శాంతిః శాంతిః శాంతిః* 

 *శ్రీ మాత్రే నమః*

No comments:

Post a Comment