వేదం యొక్క గొప్పతనం.....
అన్నివిషయాలని సమగ్రంగా అందించగలిగినది వేదం మాత్రమే
లోకంలో ప్రసిద్ధి కొన్నింటికి కొన్ని కొన్ని కారణాల చేతఏర్పడుతుంది. అన్నింటికీ అన్ని రకాలైన ప్రాచుర్యం ఏర్పడదు. ఒక్కోదానికి దానిలో ఉన్న గుణాలని బట్టి విలువ అనేది ఏర్పడుతుంది. వ్యాపించిన దానిలో ఆకాశాన్ని మించినది లేదు కనుక దానికి ప్రసిద్ధిఅట్లా ఏర్పడుతుంది.
మామిడి పండుని దాని రుచిని బట్టి గొప్పదనం. సింహానికి దాని పరాక్రమాన్ని బట్టి గొప్పదనం. వర్ణ సౌందర్యాన్ని బట్టినెమలికి గొప్పదనం. అలానే ఒక వ్యక్తిలో ఉండే యోగ్యతలని బట్టి ఆవ్యక్తికి గొప్పతనం. మనిషికి తెలివి ప్రధానం, తెలుసుకోవడానికిఎక్కువగా స్పష్టంగా విషయాలని అందింవ్వగలిగితే ఆ గ్రంథానికి గొప్పతనం. అట్లా మానవ విలువలని తెలుపడంలో రామాయణం ఒకగొప్ప గ్రంథం. మనిషికి కావలసిన అన్నివిషయాలని సమగ్రంగా అందించగలిగినది ఏదైనా ఉన్నదా? సమగ్రంగా అందించగలగడం అంటె ?
ఈ భూమి మీద జీవించియున్న మనుష్యులు, జంతువులు, పక్షులు, క్రిమికీటాదులు మరియూ నది పర్వతాలు ఎన్నెన్ని రకరకాలు ఉన్నాయో వాటి గురించి చెప్పగలగాలి. ఈ భూమి మీదే కాదు ఆకాశంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు, తారకలు వంటి వాటి గురించికూడా వివరించగలిగి ఉంటే అది మనకు ఆదరణీయం. వీటన్నింటి స్థితిని గురించి, గతిని గురించి, ఆవిర్భావాన్ని గురించి, తిరోభావాన్ని గురించి, ఏయే రకమైన విషయాల్ని తెలుసుకోవాలని మనిషికి జిజ్ఞాస ఏర్పడుతుందో అటువంటి కోరికలన్నన్నింటిని తెలియజేయగలిగినది ఏదైనా ఉంటే దానిని మనం అన్నింటికంటే ఉత్తమమైనది అని అంటాం. తెలుసుకోవలసిన అన్నింటినీ సమగ్రంగా ఇవ్వగలిగితే దానికి మనం అగ్రాసనాన్ని ఇస్తాం. కేవలం ఒక ప్రాంతపు వారికే కాది అన్ని ప్రాంతాలవారికి, అన్ని దేశాల వారికి విషయాన్ని ఇవ్వగలిగి ఉండాలి. ఏది మనిషికి ఆచరించతగినది ఏది తగదు, వీటి వల్ల కలిగే ఫలితాన్ని కూడా స్పస్టం చేయగలగాలి.
జన్మించినంత వరకే కాదు, జీవితం చాలించిన తరువాత ఎలా ఉంటుంది ? ఈ జీవరాశి ఏర్పడక ముందు వాటి ఉనికి ఎలా ఉంటుంది ? ఇంతటి ప్రపంచం ఎందుకు ఏర్పడింది ? ఇలాంటి విషయాలని కూడా తెలుపగలిగితే అది మనకు ప్రమాణము అవుతుంది. వీటిపై అనేక మంది వారి వారి అనుభవాలని బట్టి సమాధానాలు చేబుతూ లోకంలో రకరకాల మతాలని స్థాపించారు. మనలో ఏర్పడే రకరకాలైన సంశయాలని, తెలుసుకోవాలనే జిజ్ఞాసలని తీర్చగలిగేది వేదం ఒక్కటే. అందుకే దాన్ని మన పెద్దలు ప్రమాణము అని చెప్పారు. అందుకే వేదం ఆధరణీయమైనదే కాదు ఆరాధించ తగినది అని స్వీకరించారు. అది మనకు చేసినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి సంచరించాలి అని నిర్ణయం చేసుకున్నారు మన పెద్దలు.
వేదాల్లో కేవలం మనిషిని గురించి మాత్రమే కాదు, చేతనాలని అంటే చైతన్యం కల జీవరాశిని, అచేతనాలని అంటే చైతన్యం లేనటువంటి వాటిని రెంటినీ నియంత్రించగలిగిన శక్తి తత్త్వమైన దైవాన్ని గురించి కూడా వివరించింది. "వేద శబ్దేవ్యః ఎవః అదౌ దేవాదీనాం చకార సహ", అసలు ఈ సృష్టికంతటికి కారణం వేద శబ్దరాశి మాత్రమే అని మనకు తెలుస్తుంది.
ఇంత ప్రపంచాన్ని సృష్టి ప్రళయము కావిస్తూ చేతనులనే జీవరాశికి స్వరూపాన్ని కల్పించి తద్వారా సుఖాన్ని కలిగించేందుకే ఆ జగత్కారణ తత్త్వం సృష్టి ప్రలయలను చేస్తుంది. జీవరాశిని దేవ, నర, తిర్యక్ మరియూ స్థావరాలుగా ప్రపంచాన్ని తీర్చి దిద్దుతుంది. అందుకే ఇతర గ్రంథాలు ప్రాదేశికాలు అయితే వేదం విశ్వవ్యాప్తమైన అన్నింటిని గురించి కనుక బాగుపడగోరిన ఎవ్వరికైనా మార్గనిర్దేశం చేయగలిగిన ఏకైక ప్రమాణం వేదం. దాన్ని అనుసరించడం బుద్ధిమంతుడి లక్షణం.
|| ఓం నమః శివాయ ||
No comments:
Post a Comment