Tuesday, September 24, 2024

 Vedantha panchadasi:
దూరదేశం గతే పుత్రే జీవత్యేవాత్ర తత్పితా ౹
విప్రలంభకవాక్యేన మృతం మత్వా ప్రరోతి ౹౹34౹౹

34.దూరదేశమీనకు పోయిన పుత్రుడు జీవించి ఉండగనే స్వదేశమున అతని తండ్రి,తుంటరి వంచకునిచే 
'నీ పుత్రుడు మరణించె' నని చెప్పబడి,తన పుత్రుడు మృతుడయ్యెనని భావించి విశేషముగ రోదించును.

మృతేఽ పి తస్మిన్వార్తాయా మశ్రుతాయాం నరోదితి ౹
అతౌ సర్వస్య జీవస్య బంధకృన్మాసనం జగత్ ౹౹35౹౹

అట్లు గాక,పుత్రుడు నిజముగనే మరణించినప్పటికీ ఆ వార్త అందనిచో పుత్రుడు జీవితుడే అని భావించుచు తండ్రి ఎంతకాలమైనను రోదింపడు.కనుక సర్వజీవులకు బంధకారణము మానసిక ప్రపంచమే.

మనస్సు ప్రారంభమున 
చైతన్యముగా నున్నది,మరల అంతమందుగూడ(మనస్సుగా దాని స్వభావము,కార్యము నశించిన పిదప గూడ)అది చైతన్యముగానే ఉండును,అట్టి యెడల మధ్యలో(ఇప్పుడు)దానిని విభిన్నముగా ఎందుకు పిలుతురు?

ఈ దృశ్యవిషయములన్నియు, స్వప్నానుభవములవలె,
మతిభ్రమ దశలోని దృశ్యములవలె, త్రాగుబోతు భ్రమలవలె, నేత్రభ్రాంతులవలె,
మానసికవ్యాధివలె,
భావోద్రేకపు సంక్షోభములవలె,
మానసిక స్థితుల వలె క్షణిక సత్యములుగానున్నట్లు కనిపించును.

ఆత్మీయుల చావువార్త తెలికముందు వ్యక్తి కి దుఃఖము వుండదు.అతనికి ఆవిషయము ఎంతకాలమైనను తెలియకున్న రోదింపడు.

ఒక వేళ ఎవరయిన తుంటరి సరదాకు చావువార్త చెప్పిన దుఃఖము వస్తుంది.కనుక ఇది యంతయు సర్వజీవులకు బంధకారణము మానసిక ప్రపంచమే.

ఈ దృశ్యములన్నియు మాయామయరూపములని తెలిసికొన్నప్పుడు మనస్సు "అమనస్సు"అగును.ఇంద్రియానుభవాదులస్మృతులన్నియు అంతమొందును.

సత్యము తెలియనప్పుడు అది అజ్ఞానులలో అజ్ఞానముగా ఉదయించును.అది తెలిసినప్పుడు అజ్ఞానము తొలగును.

ఒక బంధువును బంధువుగా గుర్తించనప్పుడు అతడిని 'అపరిచితుడని' అందురు. బంధువును బంధువుగా గుర్తించినప్పుడు అపరిచితుడను భావన వెంటనే తొలగును.

ద్వైతము భ్రాంతిమయదృశ్యమని వ్యక్తి తెలిసికొన్నప్పుడు అఖండబ్రహ్మముయొక్క జ్ఞానముండును."ఇది నేను కాదు"-అని వ్యక్తి తెలిసికొన్నప్పుడు అహంభావము అసత్యమని తెలియును.దీనినుండి నిజమయిన వైరాగ్యముదయించును.

"నిజముగా బ్రహ్మమే నేను"-ఈ  సత్యము తెలిసినప్పుడు వ్యక్తిలో తత్త్వజ్ఞానముదయించి అన్ని విషయములు పిదప ఆ జ్ఞానములో వినలీనములగును.

"దుఃఖముతో,కర్మలతో,భ్రాంతితో లేక కోరికతో చేయవలసినది నాకేదియు లేదు. నేనుదుఃఖరహితుడనుయి ప్రశాంతముగానున్నాను.బ్రహ్మమే-నేను సత్యమట్టిది".

"నేను", "నీవు"-అను భావనలు తొలగినప్పుడు వ్యక్తి ఇది అంతయు, ఉన్నది అంతయు, వాస్తవముగా బ్రహ్మమని తెలిసికొనును.     

No comments:

Post a Comment