*అధికారి...(అర్హత కలిగిన హృదయం).....*
భగవంతుని అందుకోవాలంటే శాస్త్రం ద్వారా ముందు జ్ఞానాన్ని పొందాలి. అయితే శాస్త్రాన్నివినాలన్నా, విన్న విషయాలను నిలుపుకోవాలన్నా అర్హత ఉండాలి. దానినే అధికారి అంటారు. శాస్త్రాన్ని తెలుసుకొనుటకు అధికారి ఎవరో, అనధికారి ఎవరో తేల్చి వేసే అధ్యాయం ఇది. కనుక ఇది గ్రంధానికి మొదట్లోనే ఉండాలి. గ్రంధంలో ఎక్కడ ఉన్నా సాధకుడి విషయంలో మాత్రం ఇది మొదట్లోనే తెలుసుకోవలసిన విషయం.
అధికారి కాని వానికి తత్త్వబోధ ఫలించదు. అందుకే చాలామంది వేదాంతాన్ని వింటున్నా ఆచరణలోకి వచ్చేది మాత్రం ఏ ఒకరిద్దరికో. అంతేకాదు వినగానే ఆచరించేవారు అరుదు. వినగా వినగా ఎప్పటికో ఆచరించాలనే భావన కలుగుతుంది. దీనికి కారణం వారు వినే ముందే అధికారులు కాకపోవటమే.
ఒక మహానుభావుడు పరుసవేదిని సంపాదించాలని భగవంతుని గూర్చి తపస్సు చేశాడట. భగవంతుడు ప్రత్యక్షమై అతడు కోరిన పరుసవేదిని ప్రసాదించాడు. అతగాడికి బుద్ధి మట్టం. పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు. ఇల్లంతా బంగారం చేయాలని ఆ ఇల్లాలి ఆశ. అందుకని ఎక్కడెక్కడో పడి ఉన్న ఇనుప ముక్కలన్నింటిని తెచ్చి రాశి పోసింది. పరుసవేదిని తాకిస్తే పాపం ఒక్కటీ బంగారం కాలేదు. లబోదిబోమని ఏడుపు లంకించుకున్నారు. దేవుడు కూడా మోసం చేస్తున్నాడు. ఇక మనుషులకు దిక్కెవరు? అని రాగాలు తీస్తున్నారు. దారిన పోయే పెద్ద మనిషి ఈ ఏడుపు విని, సంగతి అడిగి తెలుసుకున్నాడు. అతడు "ఓ బుద్ధి లేని పెద్ద మనిషీ! ఎందుకయ్యా అలా అల్లాడిపోతున్నావు. ఇది పరుసవేదే కాని తుప్పు పట్టిన ఇనుమును బంగారం చేయ్యలేదు. ముందు ఆ ఇనుప ముక్కలన్నింటిని కొలిమిలో వేసి కాల్చి శుద్ధి చేసుకొనిరా! "అన్నాడు.
అలాగే ఈ బ్రహ్మ జ్ఞానం పరుసవేది లాంటిదే. కనుక దీనికి కూడా తుప్పు లేని ఇనుము, అంటే అర్హత కలిగిన హృదయం కావాలి. 'తపో భిః క్షీణ పాపానాం' అన్నట్లు తపస్సు చేత పాపాలను పోగొట్టుకున్న పవిత్ర హృదయులు కావాలి. అట్టి పవిత్ర హృదయాలను తయారు చేయుటకే, అధికారులను తయారు చేయుటకే ఈ అధ్యాయం.
No comments:
Post a Comment