*దొరికిన దొంగ* (సరదా జానపద కథ)
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212.
****************************
ఒకూర్లో ఒకమ్మాయి వుండేది. ఆ అమ్మాయి చానా తెలివైనది. అంతేగాదు పెద్ద అందగత్తె కూడా. ఆమెది అట్లాంటిట్లాంటి అందంగాదు. ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ అంత అందగత్తె యాడా వుండదని పేరు. పాలరాయిలాంటి తెల్లని ఒంటితో, ముత్యాల్లాంటి పళ్ళతో, చందమామలాంటి మొగంతో, మెరుపుతీగలాగా మెరిసిపోతా వుంటాది. కానీ పాపం ఆ అమ్మాయి అనాథ. చిన్నప్పుడే అందరూ చచ్చిపోయినారు. నా అని చెప్పుకోడానికి ఎవరూ లేరు. ఆయింట్లో ఈయింట్లో పని చేసుకుంటా వాళ్ళు పెట్టినేది తినుకుంటా వుండేది.
ఆ వూరి పక్కనే వున్న ఇంకో వూర్లో ఒక పెద్ద గజదొంగ వున్నాడు. వాడు అట్లాంటిట్లాంటి మామూలు దొంగ కాదు. మెడకు తెలీకుండా గొలుసును, చేతికి తెలీకుండా గాజును, నడుముకు తెలీకుండా వడ్డాణాన్ని కాజేసే రకం. రాత్రయితే చాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టినారో కనుక్కోని చప్పుడు గాకుండా ఎత్తుకోని పోయేటోడు. వాన్ని పట్టుకోడం చేతగాక ఆవూరి పోలీసులు ఎవరయితే ఆ దొంగను పట్టిస్తారో వాళ్ళకు లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తామని దండోరా వేయించినారు.
ఆ దొంగ రోజూ పొద్దున్నే చీరలమ్మేటోని వేషం వేసుకోని, సంచి నిండా చీరలు పెట్టుకోని రోజుకొక పల్లెకు పోయేటోడు. చీరల కోసం ఆడోళ్ళు ఇండ్లలోకి పిలుస్తారు గదా. అప్పుడు ఒకవైపు చీరలమ్ముతూనే మరొకవైపు ఇంట్లో ఏమేమి ఎక్కడెక్కడ వున్నాయి, వాళ్ళు వున్నోళ్ళా, లేనోళ్ళా అన్నీ గమనించేటోడు. ఒకరోజు అట్లా ఆ పిల్ల వున్న వూరికి వచ్చినాడు. చీరలమ్ముతా అమ్ముతా ఆ ఇంట్లో పని చేస్తావున్న ఆ పిల్లను చూసినాడు. ఆమెది కన్ను తిప్పుకోలేని అందం గదా. చూడగానే అబ్బ... ముత్యాలహారంలెక్క ఎంత ముచ్చటగుందీ పిల్ల, చేసుకుంటే ఇట్లాంటి పిల్లనే చేసుకోవాల'' అనుకున్నాడు. నెమ్మదిగా అక్కడి ఆడోళ్ళతో ఆమాటా ఈమాటా మాట్లాడతా ఆ పిల్ల వివరాలన్నీ కనుక్కున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసి మంచిగా కొత్తబట్టలేసుకోని, తలకు బాగా నూనె పట్టిచ్చి, చక్కగా దువ్వుకోని బుద్ధిమంతుని లెక్క వాళ్ళింటి కాడికి పోయినాడు. ఆ పిల్ల కనబడగానే ''పాపా నన్ను గుర్తు పట్టినావా... నేను నీ మేనమామను, మీ అమ్మకు సొంత తమ్మున్ని. చిన్నప్పుడే మా అమ్మ కొట్టిందనే కోపంతో ఇల్లు వదిలి దేశాలు పట్టుకోనిపోయి బాగా సంపాదిచ్చి ఈనడుమనే పక్కూరిలో మంచి మేడ కట్టుకున్నాను. మా అమ్మానాన్నల కోసం, అక్కాబావల కోసం వెదుకుతా వుంటే వాళ్ళంతా చచ్చిపోయినారని, నువ్వొక్కదానివే బతికున్నావని తెలిసింది. ఇంక నీకు ఏ బాధా వుండదు. నువ్వు హాయిగా కాలు మీద కాలేసుకోని బతకొచ్చు. నిన్ను పెండ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకోని చూసుకుంటా... దాపోదాం'' అంటూ వాళ్ళమ్మానాన్నల వివరాలన్నీ చెబుతా బాగా నమ్మబలికినాడు. దాంతో ఆ పాప ఆ దొంగోని మాటలు నిజమని నమ్మి సంబరంగా వాని వెంట వెళ్ళింది. కానీ, ఆ పాప సంతోషం కొన్ని రోజులు గూడా మిగలలేదు. ఆ దొంగోడు రాత్రుళ్ళు అందరూ పండుకున్నాక బయటికి పోవడం, జనాలింకా నిదుర లేవక ముందే పెద్దపెద్ద మూటల్తో లోపలికి రావడం గమనించింది. ఒకరోజు వాడు బైటికి పోగానే తలుపులన్నీ మూసి పెట్టెలన్నీ తెరిచి చూసింది. దాంట్లో అడుగున ఎవరికీ కనబడకుండా దాచిన బంగారం, వజ్రాలు కుప్పలు కుప్పలు కనబడినాయి. దాంతో ఆ పాపకు అనుమానమొచ్చి అలాగే మేలుకోని వాడు దొంగతనం చేసుకోని రాగానే, ''చెప్పు ఎవరు నువ్వు. ఈ రాత్రిపూట ఏం తీసుకొస్తావున్నావు. నీకింత బంగారం యాడిది'' అంటా నిలదీసింది.
ఆ దొంగోడు ఆ పాపను కత్తి తీసుకోని బెదపడిస్తా ''అవునే... నేను దొంగనే. నిన్ను చేసుకోడానికి మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చినాను. అంతేగానీ నువ్వు నా కోడలివీ కాదూ, నేను నీ మామనూ కాదు'' అంటూ ఆ పాపను ఒక చిన్నగదిలో ఏసి బైట తాళం వేసినాడు. ఆరోజు నుండి రోజూ బైటకు పోయేటప్పుడు ఆమెను ఒక గదిలో పెట్టి పోయేటోడు. రాగానే ఇంటి తలుపులు లోపల గడియపెట్టి, గది తలుపులు తెరిచేటోడు. ఇంటిపనులన్నీ ఆ పాపతోనే చేయించేటోడు. కసువులు వూడ్చి, బండలు తుడ్చి, అన్నం చేసి, అంట్లు కడిగి ఆ పాప బాగా అలసిపోయేది.
ఆ దొంగోని నుంచి ఎట్లా తప్పించుకోవాల్నా అని ఆలోచిస్తా వుంటే ఆ పాపకు ఒకరోజు వంటింట్లో ఒక చిన్న కిటికీ కనిపించింది. తలుపులు తెరుద్దామని చూస్తే తెరుచుకోలేదు. కిటికీ పక్కనే ఒక చిన్న మీట కనబడింది. దాన్ని నొక్కగానే సరిగ్గా ఒక మనిషి పట్టేంతగా కిటికీ తెరుచుకోనింది. పోలీసులు ఎవరయినా తన సంగతి తెలుసుకోని పట్టుకోడానికి ఇంటి మీదికి వస్తే, వాళ్ళకి చిక్కకుండా పారిపోవడానికి దొంగ ఆ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని చూసినాక ఆ పాపకు ఒక ఉపాయం తట్టింది.
తరువాత రోజు వంటగదిలో కట్టెలపై కొంచెం నీళ్ళు చల్లి వంట చేయసాగింది. దాంతో ఇల్లంతా పొగ కమ్ముకోనింది. వాడు ఖల్ ఖల్‌మని దగ్గుతా ''ఏందే ఇంత పొగ బెట్టినావు'' అని అరిచినాడు. కట్టెలు పచ్చిగా వున్నాయి, అందుకే పొగ వస్తా వుంది, వంట అయిపోయేంత వరకూ తలుపులు మూసి బైటకూచో'' అని చెప్పింది. వాడు సరే అని తలుపులు మూసి బైట కూర్చున్నాడు.
వెంటనే ఆమె నీళ్ళ సీసా మూతకి చిన్న బొక్క పెట్టి, దాన్ని పైన యాలాడదీసి, దాని కింద పొయ్యి పెట్టి పైన పెనం పెట్టి మంట పెట్టింది. ఇసుర్రాయికి తాడు కట్టి దానిని ఫ్యానుకు కట్టి మీట నొక్కింది. పెరట్లోని బరగొడ్డును చప్పుడు గాకుండా లోపలికి తోలుకోనొచ్చి దాని తోకకు పొరకను కట్టింది. నెమ్మదిగా వంటగది మూలనున్న కిటికీ తెరుచుకోని అవతలికి దుంకి పారిపోయింది. అట్లా పోయి ఆ వూరి ఎస్పీని కలసి జరిగిందంతా చెప్పింది. అతను వెంటనే ఆ దొంగని పట్టుకోడానికి ఆమె వెంట పోలీసులను పంపిచ్చినాడు.
దొంగోనికి ఇదంతా తెలీదు గదా, దాంతో బైట కూచోని వున్నాడు. కొంచెం సేపటికి ఫ్యాను గిరగిరగిర తిరుగుతా వుంటే దానికి కట్టిన ఇసుర్రాయి సురసురసురమని తిరగడం మొదలుపెట్టింది ఆ చప్పుడు విని వాడు 'ఓహో లోపల ఈ పిల్ల ఏదో పిండి విసురుతున్నట్టుందే' అనుకున్నాడు. కాసేపటికి పైన యాలాడదీసిన సీసాలోంచి నీళ్ళుకారి వేడెక్కిన పెనంపై పడ్డంతో సుయ్ సుయ్‌మనే చప్పుడు రాసాగింది. ఆ చప్పుడు విని వాడు ''ఓహో లోపల ఈపిల్ల ఒక పక్క పిండి విసుర్తూనే మరొకపక్క దోసెలు వేస్తా వున్నట్లుంది అనుకొన్నాడు. అంతలో లోపల బరగొడ్డు అట్లా ఇట్లా కదలసాగింది. దాంతో దాని తోకకు కట్టిన చీపురు గూడా అట్లా ఇట్లా కదులుతా సరసరసర చప్పుడు చేయసాగింది. ఆ చప్పుడువిని వాడు ఓహో లోపల ఈపిల్ల కసువు కొడుతున్నట్లుందే అనుకున్నాడు. అట్లా ఒక గంట దాటిపోయింది. కానీ చప్పుడు మాత్రం ఆగలేదు. ఇదేందబ్బా ఇంతసేపైనా చప్పుళ్ళు ఆగడం లేదు. ఐనా ఒకేసారి కసువు కొడతావున్న చప్పుడు, దోసెలు పోస్తావున్న చప్పుడు, పిండి విసురుతావున్న చప్పుడు వస్తా వుంది. ఒక మనిషి ఒకేసారి ఇన్ని పనులు ఎట్లా చేయగలదు అని అనుమానమొచ్చి బెరబెరా తలుపులు తెరిచి లోపలికి పోయినాడు.
చూస్తే ఇంకేముంది. పైన యాలాడదీసిన సీసా, ఫ్యానుకు కట్టిన విసుర్రాయి. బరగొడ్డు తోకకు కట్టిన పొరకా కనబడినాయి. ''అరే ఇది నన్నే మోసం చేసి తప్పించుకోని పోయిందే... దీని అంతు చూడాల'' అని పండ్లు పటపట కొరుక్కుంటా కోపంతో కత్తి తీసుకోని వెనక్కు తిరిగినాడు. కానీ అంతలోనే ఆమె పోలీసులతో ఆడికి వచ్చేసింది. దొంగోడు దొరికిపోయినాడు. ఎస్పీ ఆమె తెలివితేటలని, ధైర్యాన్ని, అందాన్ని బాగా మెచ్చుకోని 'లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*****************************
*ఈ కథలో కొన్ని తప్పులు ఉన్నాయి. కనుక్కోండి*
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment