Sunday, April 26, 2020

సమస్త లోకమూ విశ్వాసంతోనే జీవిస్తున్నది.

పత్రికావిలేఖరి పండరిపురం విఠలదేవుడి దర్శనార్ధం వచ్చిన భక్తుడిని అడిగాడు.
మీ వయసెంత?
80సంవత్సరాలు.
ఎంత కాలంగా ఇక్కడికొస్తున్నారు?
గత 70 ఏళ్ళుగా!
ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు గదా,ఏ నాడైనా ఆయన దర్శనమైందా మీకు,కనీసం ఒకే ఒక్కసారైనా?
లేదు నాయనా!
కనీసం ఒక్కమాటైనా కనపడని ఆ విఠలుడి కోసం ఎందుకు రావటం,వృధా ప్రయాస కాదా?ఇంకా ఆయన అక్కడున్నాడని మీరు నమ్ముతున్నారా?
నాయనా!నేను నిన్ను ఓ ప్రశ్న అడగవచ్చా?
ఇంతకూ నీవెక్కడి నుండి వస్తున్నావు?
పూనె నుండి.
పూనేలో ఇళ్ళల్లో పెంపుడు కుక్కల్ని పెంచుకుంటారా?
పెంచుకుంటారు,ఐతే?
మేము కూడా మా ఊళ్ళల్లో పంటపొలాల కాపలాకని కుక్కల్ని దొంగలబారి నుండి రక్షణకోసం పెంచుకుంటాము.నిశిరాత్రి ఏదైనా కుక్క పంటపొలాల్లో దొంగ పడిన అలికిడి వింటే వెంటనే మొరుగుతుంది.అది విని పక్క పొలం కాపలాకుక్కలు తాము కూడా మొరుగుతాయి.అదేవిధంగా చుట్టుపక్కల వందల కుక్కలు దాన్ని అనుసరించి మొరుగుతాయి,ఔనా?
అలా మొరిగిన వందలాది కుక్కల్లో ఏ ఒక్క కుక్కతప్పించి మిగిలిన కుక్కలేవీ దొంగను చూడలేదు కదా?
అదే విధంగా ఈ పుణ్యభూమి మీద అవతరించిన తుకారామ్,నామ్ దేవ్,పాండురంగడు,జ్నానేశ్వర్ లాంటి ఎందరో మహానుభావులకు విఠల దర్శనం లభించింది.నేనది విశ్వసిస్తున్నాను.అట్లాగే ఏదో ఒకరోజు నాకూ ఆ విఠలస్వామి దర్శనం దొరుకుతుంది.ఒక జంతువును మరో జంతువు నమ్ముతున్నప్పుడు,మనిషిని మరో మనిషి యెందుకు నమ్మకూడదు?
నమ్మకము లేక విశ్వాసమే ప్రధానము. సమస్త లోకమూ విశ్వాసంతోనే జీవిస్తున్నది.

No comments:

Post a Comment