Saturday, April 25, 2020

కింకర్తవ్యం?

కింకర్తవ్యం?
ఆయన విరాట్‌ పురుషుడు...చెట్టు, పుట్ట పక్షులు, జంతువులు... పంచభూతాల్లో ఉన్నది ఆ చైతన్యమే...మరి ఆ మహా చైతన్యం పేరేమిటి?.యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే చూసే చూపు, నిలిపే మనస్సు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు ఆయనదే. నిజానికి భగవంతుడికి ఉన్న పేర్లన్నీ ఆయా సమయాల్లో భక్తుల అనుభూతులకు అక్షరాకృతులే. అలా కురు యోధుడైన భీష్ముడి భగవత్‌ దర్శనమే విష్ణు సహస్రనామాలు...
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది.
పాండవులు రాజ్యాన్ని స్వీకరించారు.
ఒకరోజున శ్రీకృష్ణుడు, పాండవులు ఏదో విషయంలో మాట్లాడుతూ ఉండగా, ఉన్నట్లుండి కృష్ణపరమాత్మ ఒక్క క్షణం మౌనం వహించాడు. ఏం జరిగిందా? అని అందరూ ఆందోళన చెందారు. వెంటనే కృష్ణుడు పాండవుల్ని తన వెంటతీసుకుని అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరకు తీసుకెళ్లాడు. భీష్ముడిని మించిన ధర్మవేత్త లేడు. అన్ని శాస్త్రాల్నీ వాటి అంతరార్థాలతో సహా తెలుసుకున్న జ్ఞాని. మనిషి తరించటానికి అవసరమైన అన్ని ఆధ్యాత్మిక మార్గాలు తెలిసిన వాడు. ఆయనకు అంత్యకాలం సమీపించింది. ఆయన కన్నా మిన్నగా ధర్మం గురించి చెప్పగలిగినవాడు లేడు. ఆయన ద్వారా ధర్మవిషయాలు తెలుసుకోండంటూ పాండవులకు చెప్పాడు కృష్ణుడు.
బాణాల వల్ల శరీరమంతా గాయాలై, విపరీతంగా రక్తం కారుతూ అనేక బాధల్ని అనుభవిస్తూ ఉన్న నాకు శక్తినిచ్చి మరీ ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నావయ్యా? నీవే పాండవులకు ధర్మం బోధించవచ్చు కదా? అంటూ భీష్ముడు కృష్ణుడిని అడుగుతాడు.
అప్పుడు కృష్ణుడు ‘భీష్మా! నేను తత్త్వాన్ని. నువ్వు తత్త్వాన్ని అనుభవించినవాడివి. నువ్వు చెబితే అది అనుభవపూర్వకంగా చెప్పినదవుతుంది. భగవంతుడు సముద్రం వంటి వాడు. చాలా నీరు ఉన్నా అది తాగడానికి ఉపయోగించదు. అదే నీటిని మేఘం వర్షిస్తే ఆ నీరు తాగడానికి ఉపయోగిస్తుంది.
భక్తి తత్త్వం కూడా ఇంతే. భగవంతుడి తత్త్వాన్ని జ్ఞానమార్గంలో అనుభవించి, తత్త్వాన్ని దర్శించిన భక్తుడు చెబితేనే భగవంతుడంటే ఏమిటో అందరికీ తెలుస్తుంది. అందుకే జ్ఞానబోధ చెయ్యటానికి నీవే అర్హుడివి’ చెప్పాడు పరమాత్మ.
భీష్ముడు పాండవ అగ్రజుడి వైపు తిరిగి అడిగాడు...చెప్పు ధర్మనందనా...
తాతా...
కిమేకం దైవతం లోకే... లోకంలో ఒక్కడే అయి ఉన్న దేవుడు ఎవరు?
కిం వాప్యేకం పరాయణం... జీవితానికి పరమపదమైన గమ్యం ఏది?
స్తువంతః కం ప్రాప్నుయుః మానవాః శుభం... ఏ దేవుడిని స్తుతిస్తే శుభాలు కలుగుతాయి?
కం అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభం... ఏ దేవుడిని అర్చించటం వల్ల శుభాలు కలుగుతాయి?
కోధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః... అన్ని ధర్మాల కన్నా గొప్పదైన ధర్మం ఏది?
కిం జపన్‌ ముచ్చతే జంతుః జన్మ సంసార బంధనాత్‌... ఏ దేవుడి నామాన్ని జపించటం వల్ల సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది?
నాకెన్నాళ్లుగానో ఉన్న సందేహాలు నీ ముందు ఉంచుతున్నాను...
సందేహపడుతూనే సందేహాలన్నీ భీష్ముడి ముందుంచాడు ధర్మరాజు
పరమాత్మను స్మరించుకుంటూ గొంతు సవరించుకున్న భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు..
అ మాటలే మంత్రాలయ్యాయి.
ఆ నామాలు మానవాళికి కల్పతరువులయ్యాయి...
అవే పరమాత్మ విరాట్‌ స్వరూప వర్ణన. అర్జనుడికి భగవానుడు విశ్వరూపం చూపితే... భీష్ముడు వాటిని అక్షరీకరించి సహస్ర నామార్చన చేశాడు.

ఆయనకూ ఆశ్చర్యమే..
విష్ణు సహస్రం కేవలం భగవంతుడి స్తోత్రం మాత్రమే కాదు. అద్భుతమైన శబ్ద విజ్ఞాన కదంబం. సనాతన భారతీయ వ్యాకరణ విజ్ఞానవేత్తలు శబ్దాన్ని బ్రహ్మగా భావించారు. అంతకు మించిన దైవం లేదని చెప్పారు. అటువంటి శబ్దబ్రహ్మను ఉపాసన చేసేందుకు ఉత్తమమైన మార్గం విష్ణుసహస్రనామ స్తోత్రం. ఆదిశంకరాచార్యులు స్వయంగా విష్ణుసహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశారు. ఈ నామాల్లోని అక్షర ఔచిత్యానికి ఎంతగానో అబ్బురపడ్డారు.

భాషాలంకారం:
విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం ఓ అద్భుతమైన లయ, తూగుతో నడుస్తుంది. శ్రుతి పాడుకునేందుకు ప్రతిశ్లోకం ఎంతో వీలుగా ఉంటుంది. ఎన్నో అలంకారిక వైవిధ్యాలు వీటిలో ఉన్నాయి. ‘సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః’; ‘సువ్రతః సుముఖ సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్‌’ తదితర శ్లోకపాదాల్లోని పదప్రయోగాలు ఆశ్చర్యపరుస్తాయి. ఒకే పదాన్ని విభిన్న అర్థాల్లో, విభిన్న పదాల్ని ఒకే అర్థంలో ఉపయోగించే పదప్రయోగ వైవిధ్యాలు ఈ స్తోత్రంలో ఉన్నాయి. సనాతనమైన సంస్కృత భాష ఔన్నత్యాన్ని ఇవన్నీ ప్రకటిస్తాయి.
గీతం... గేయం
భగవద్గీత, విష్ణుసహస్రనామం... ఈ రెండూ మహాభారతంలోనివే. ఒకటి యుద్ధానికి ముందు జరిగింది కాగా రెండవది యుద్ధం తర్వాత జరిగింది. రెండూ శ్రీకృష్ణుడి సమక్షంలో జరిగినవే కావటం విశేషం. యుద్ధప్రారంభంలో విచారగ్రస్తుడై ఉన్న అర్జునుడిలో చైతన్యాన్ని నింపి అతడిని కర్తవ్యం వైపు సముఖుడిని చేసింది గీత. యుద్ధం పూర్తయిన తర్వాత జిజ్ఞాసతో వచ్చిన ధర్మరాజుకు మోక్షమార్గాన్ని చూపింది సహస్రనామం. మానవజీవితంలోని రెండు ప్రధాన సన్నివేశాలకు గీత, గేయం మార్గదర్శనం చేస్తాయి. విష్ణు సహస్రనామస్తోత్రంలో ఉన్న వెయ్యి నామాల్నీ విభజిస్తే మొత్తం పదిశతకాలు అవుతాయి. ఒక్కో శతకం ఒక్కో అంశాన్ని బోధిస్తుంది. ఇదే ఆ శతకాల సారాంశం.

సహస్రం అంటే సాధారణంగా వెయ్యి (1000) అనే అర్థం స్ఫురిస్తుంది. కానీ శంకరాచార్యులు ‘సహస్రం అనే మాటకు ‘అనంతం’ అనే అర్థం ఉంది. ‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌...’ అని వేదం చెబుతోంది. ఈ ప్రకారం విష్ణు సహస్రనామం అంటే విష్ణువుకు ఉన్న అనంతమైన నామాలు అని అర్థం ఏర్పడుతుందం’టూ వివరణ ఇచ్చారు.

విష్ణు సహస్రనామ పారాయణఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా చెయ్యవచ్చు. అయితే ఏకాదశి తిథిలో, నిత్యం సాయం సంధ్యాసమయంలో ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


శివం... కేశవం:
శివుడే దైవం అని శైవులు, విష్ణువే పరమదైవం అని వైష్ణువులు భావిస్తారు. కానీ శివకేవశవులకు అభేదం ఉందనీ, ఒకే పరమశక్తికి ఉన్న రెండు భావనాత్మకమైన భౌతికరూపాలే శివకేశవులనే భావనను విష్ణు సహస్రం వ్యక్తీకరిస్తుంది. ‘సర్వః శివః స్థాణుః...’; ‘స్వయంభూః శంభురాదిత్యః...’; ‘ఈశ్వరో విక్రమీ ధన్వీ..’ వంటి శ్లోకాలన్నీ శివకేశవ అభేదాన్ని, అద్వైతమార్గాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి. శివుడని పిలిచినా, విష్ణువని కొలిచినా భక్తుల్ని కాపాడే పరమదైవం ఒక్కడే అనే భావనకు ఇవన్నీ ప్రతీకలుగా నిలుస్తాయి.

No comments:

Post a Comment