Monday, April 27, 2020

బౌద్ధ దర్శనం - నాస్తిక దర్శనం

బౌద్ధ దర్శనం (1) - నాస్తిక దర్శనం:🦢🦩🦢🦩🦢🦩🦢🦩🦢🦩🦢🦩🦢🦩

బౌద్ధ దర్శనానికి గౌతమ బుద్ధుడు మూలపురుషుడు.
తన చుట్టూఉన్న పరిసరాలను చూసినపుడు , తనకు ఎదురుపడిన సంఘటనలైన ముసలితనము, వ్యాధులు, మరణము మొదలైనవాటిని ఎవరూ తప్పించుకోలేరని గ్రహించి, వీరు, వీరి కుటుంబీకులు పడే దుఃఖానికి చలించిపోయాడు. ఈ దుఃఖాన్ని నివారించడానికి మార్గాలను అన్వేషించ సాగేడు.
ఎంతోమంది మహాపురుషులను ఆశ్రయించినా; సరైన సమాధానం లభించలేదు.
అన్వేషణలో భాగంగా సుదీర్ఘమైన తపస్సుచేసి, దుఃఖానికి నివారణోపాయాన్ని కనుగొన్నాడు.
అవి నాలుగు సత్యాలుగా ప్రచారంలోకి వచ్చాయి.

మొదటి సత్యం - ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. ఈ దుఃఖం పైపైకి కన్పించేది మాత్రమే కాదనీ , అంతటా సంసారంలో స్థిరంగా పాతుకుపోయి ఉందనీ, సుఖాలుగా కన్పించే విషయాల్లోనూ అంతర్గతంగా దుఃఖంఉందని, బుద్ధుడు కనుగొన్న మొదటిసత్యం.

ఇక రెండవ సత్యం - ఈ దుఃఖానికి కారణం ఉంది. విషయవాంఛ/ లేక తృష్ణ అనేది దుఃఖానికి కారణం. ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండే స్థిరమైనపదార్ధం గాని, వస్తువుగాని, విషయం అనేదిగాని లేదు. ప్రతీ వస్తువు మార్పుచెందే స్వభావం కలిగినదే. కాని మనం ప్రతివిషయంలోనూ స్థిరత్వాన్ని కోరుకుంటాం. అందుచేత దుఃఖానికి లోనవుతూ ఉంటాం. ఆలోచించి చూస్తే దుఃఖముకూడా ఎప్పటికీ ఉండదు. ఈ ప్రపంచంలో పుట్టడమే దుఃఖానికి కారణం. ఇలా తిరిగితిరిగి పుట్టడానికి విషయ వాంఛలే కారణం. ఇది అజ్ఞానంవల్ల ఏర్పడుతుంది.

ఇక మూడవ సత్యం - ఈ దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. దుఃఖకారణాన్ని తొలగిస్తే దుఃఖం పోతుంది. అజ్ఞానాన్ని తొలగించుకొని నిర్వాణం పొందటంవల్ల దుఃఖం పూర్తిగా నశిస్తుంది .

ఇక నాల్గవ సత్యం - దుఃఖానికిగల కారణాన్ని తొలగించుకోడానికి మార్గం ఉంది.

బౌద్ధ దర్శనం (2) నాస్తిక దర్శనం:

సమ్యగ్ దృష్టి , సమ్యగ్ సంకల్పం , సమ్యగ్ వాక్కు , సమ్యగ్ కర్మాంతం ,
సమ్యగ్ జీవనం , సమ్యగ్ వ్యాయామం , సమ్యగ్ స్మృతి , సమ్యగ్ సమాధి
అని చెప్పబడే అష్టాంగమార్గం ద్వారా దుఃఖాన్ని తొలగించుకోవచ్చు.
ఇక్కడ చెప్పబడిన అష్టాంగమార్గం యోగాచార్యుడైన పతంజలి అష్టాంగమార్గం కాదు.
దీనిలో చెప్పిన విషయాలను ఆచరించడంవల్ల మనస్సు ఏకాగ్రమై, ధ్యానస్థితి కల్గి 'నిర్వాణం' లేక మోక్షం అనేది లభిస్తుంది. అపుడిక దుఃఖం ఉండదు.
బుద్ధుడు తాను గ్రహించిన సత్యాలను ఉపదేశరూపంలో బోధించాడేతప్ప గ్రంధరూపంలో కాదు.
కాలాంతరంలో బౌద్ధులు అర్ధం చేసుకున్న విధానాన్నిబట్టి , కొన్ని శాఖలుగా రూపుదిద్దుకున్నాయి.

వాటిలో మొదటిది - మానసిక, భౌతిక ప్రపంచాలు అజ్ఞానంచేత కల్పించ బడ్డాయేగాని, అవి వాస్తవంగా లేవు. వీరు సర్వమూ శూన్యం అని చెప్పడంవల్ల, దీన్ని శూన్యవాదం అంటారు. దీన్నే మాధ్యమికమతం అనికూడా అంటారు.

రెండవది - బాహ్యప్రపంచం లేదు గాని మానసికభావాలే విజ్ఞానరూపంలో బయట కన్పిస్తుందని వాదించేవారు అవడంవల్ల, విజ్ఞానవాదం లేక యోగాచారమతం అని అనబడుతోంది.

ఇక మూడవది - బాహ్య, మానసిక ప్రపంచాలు రెండూ సత్యమే. బాహ్యప్రపంచం, అంతరంగిక విజ్ఞానం వల్ల , మనం ఎదుట ప్రపంచాన్నిఊహిస్తున్నాం. అంచేత బయటి పదార్ధాలన్నీ అనుమేయాలే. ఇలా చెప్పడంవల్ల దీన్ని అనుమేయవాదం లేక సౌత్రాంతికమతం అంటారు.

ఇక నాల్గవది - వైభాషిక మతం . దీన్లో బాహ్య , మానసిక ప్రపంచాలు రెండూ సత్యమే. అనుమేయం కాదు. అంచేత దీన్ని బాహ్య ప్రత్యక్షవాదం అంటారు.

మళ్ళీ, వీరిసిద్ధాంతాలనూ, ఆచారవ్యవహారాలను బట్టి, మాధ్యమిక , యోగాచారమతాలవారిని హీనయానమనీ , సౌత్రాంతిక వైభాషిక వాదులను మహాయానం అనీ రెండు శాఖలుగా బౌద్ధం ప్రచారంలోకి వచ్చింది.
బుద్ధుడు దుఃఖనివారణకు ఉపకరించని వాటిని గురించి మౌనం వహించడంవల్ల , ఈ ప్రపంచం అనేదాన్లో భిన్నాభిప్రాయాలు తరువాతి వారిలో వచ్చాయి.
మౌలికంగా బుద్ధుడు బోధించిన విషయాలలో భేదంలేదు.
బౌద్ధులు అనాత్మవాదులు. దైవాన్ని అంగీకరించక, తమ స్వప్రయత్నం మీదనే మోక్షం పొందటం జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ కార్యానికీ ఒక కారణమనేది ఉంటుందని చెబుతారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. పునర్జన్మలు వాంఛలవల్ల కలుగుతాయని చెబుతారు. ఇదీ సంక్షిప్తంగా బౌద్ధం.👏

No comments:

Post a Comment